Gold Rates | ఇన్వెస్టర్ల పెన్నిది బంగారం.. ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా.. దీనికి కారణాలివేనా..?!
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర తళతళ మెరుస్తున్నది.
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర తళతళ మెరుస్తున్నది. గత ఏడాది కాలంలో రమారమీ తులం బంగారం ధర రూ.9000 వరకు పెరిగింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2023 జనవరి ఒకటో తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.55,370 పలికింది. ఒక సంవత్సరం తిరిగే సరికి సోమవారం (2024 జనవరి ఒకటో తేదీ) తులం బంగారం ధర రూ.64,470 పలుకుతున్నది.
దాదాపు 18 నెలలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఇబ్బడిముబ్బడిగా వడ్డీరేట్లు పెంచుతూ వచ్చింది యూఎస్ ఫెడ్ రిజర్వ్. ద్రవ్య లభ్యతను కఠినతరం ప్రక్రియ పూర్తయిందని, ఇక మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని సంకేతాలిచ్చింది. దీనివల్ల డాలర్ ఇండెక్స్‌తోపాటు యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ పతనమైంది. మరోవైపు దేశీయంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రాజకీయ సుస్థిరత నెలకొందని, ఇది ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వృద్ధిరేటు పుంజుకోవడంతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరించడం, ప్రస్తుతం దేశంలో వివాహాలు జరుగుతుండటంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ఇవే పరిస్థితులు మున్ముందు కొనసాగితే తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.70 వేలు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2400 డాలర్లు పలుకుతుందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలతో గత నెలలో బంగారం ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లాయి. గత మే నాలుగో తేదీన దేశీయంగా తులం బంగారం ధర రూ.61,845 పలికింది. తిరిగి నవంబర్ 16న రూ.61,914లతో సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. గత నెల నాలుగో తేదీన రూ.64,063 వద్ద స్థిర పడింది. త్వరలో సార్వ్రతిక ఎన్నికల సందడి మొదలైతే దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బంగారానికి గిరాకీ పెరుగుతుందని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞాన శేఖర్ త్యాగరాజన్ చెప్పారు. వివిధ కారణాల వల్ల 2023లో బంగారం ధరలు సరికొత్త గరిష్ట రికార్డులు నెలకొల్పాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజనల్ సీఈఓ పీఆర్ సోమసుందరం చెప్పారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం ధర సోమవారం రూ.63,870 పలుకుతున్నది. ఏడాది క్రితం (జనవరి ఒకటో తేదీన) రూ.55,200 పలికింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.63,870 వద్ద ట్రేడవుతుండగా, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.58,550 వద్ద తచ్చాడుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం ధర రూ.58,700 వద్ద నిలిస్తే, 24 క్యారెట్స్ బంగారం తులం రూ.63,970 వద్ద ట్రేడవుతున్నది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని ముంబైలో 22 క్యారెట్స్ బంగారం పది గ్రాములు రూ.58,550 పలికితే, 24 క్యారెట్ల బంగారం రూ.63,870 వద్ద కొనసాగుతున్నది.