Telugu Global
Business

ధరలు పెరిగినా పసిడిపై తగ్గని డిమాండ్

గత ఏడాది ఇది నెలలో పోలిస్తే ఈ మొత్తం 40.9 శాతం మేర పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

ధరలు పెరిగినా పసిడిపై తగ్గని డిమాండ్
X

బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నా.. దానిపై మోజు మాత్రం తగ్గడం లేదు. జనవరి నెలలో నమోదైన పసిడి దిగుమతులే దీనికి నిదర్శనం. ఒక్క నెలలో 2.68 బిలియన్‌ డాలర్ల (రూ. 23 వేల కోట్లు) విలువైన బంగారం మన దేశంలో దిగుమతి అయ్యింది. గత ఏడాది ఇది నెలలో పోలిస్తే ఈ మొత్తం 40.79 శాతం మేర పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది దీని విలువ 1.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు 50 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో దీని విలువ 37.85 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారంపై మదుపర్ల నమ్మకాన్ని భారీస్థాయిలో దిగుమతులు సూచిస్తున్నాయి. కొత్త ఏడాదిలో బంగారం ధర 11 శాతం మేర పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర రూ. 88,200కు చేరింది.

బంగారం ఎగుమతుల విషయంలో స్విట్జర్లాండ్‌ మొదటిస్థానంలో ఉన్నది. మొత్తం ఎగుమతుల్లో 40శాతం వాటా ఆ దేశానిదే. యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మన దేశ మొత్తం దిగుమతుల్లో 5 శాతం వాటా బంగారానిదే కావడం గమనార్హం. మన దేశ కరెంట్‌ ఖాతా లోటుపైనా దీని ప్రభావం అధికమే. జనవరి నెలలో 23 బిలియన్‌ డాలర్ల కరెంట్‌ ఖాతా నమోదైంది.

First Published:  17 Feb 2025 9:51 PM IST
Next Story