ఆఫర్ల మాయలో పడుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఆఫర్ అనే పదం చాలామందిని ట్రిక్ చేస్తుంది. ఆఫర్ అని కనిపించిన వెంటనే చాలామంది అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేస్తుంటారు.
ఆఫర్ అనే పదం చాలామందిని ట్రిక్ చేస్తుంది. ఆఫర్ అని కనిపించిన వెంటనే చాలామంది అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా మైండ్ సెట్‌లో చిక్కుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతామంటున్నారు నిపుణులు. ఆఫర్ల మాయలో పడకుండా ఉండేందుకు ఏం చేయాలంటే..
అవసరం లేకపోయినా ఆఫర్ ఉందనో, డిస్కౌంట్ సేల్ ఉందనో కొనెయ్యటం ఇప్పుడు మామూలైపోయింది. ముఖ్యంగా యూత్ ఈ తరహా మైండ్‌సెట్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థలు కూడా ప్రతి చిన్న సందర్భానికి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందుకే ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు నిజంగా అవసరం ఉందా? లేదా? అన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు నిపుణులు.
ఆన్‌లైన్ షాపింగ్ ఇప్పుడు ఓ స్టేటస్ సింబల్‌గా, ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ఈ ట్రెండ్‌కు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే. అసలు వస్తువు అవసరమా? కాదా? అని ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా షార్ట్ టైం ఆఫర్ అంటూ తొందర పెట్టి మరీ కొనేలా చేస్తుంటాయి ఆన్‌లైన్ సంస్థలు. ఒకవేళ డబ్బు లేక కొనుగోలు వాయిదా వేద్దామనుకునేలోపు ఈఎంఐ పేరుతో మళ్లీ అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆఫర్ లేదా డిస్కౌంట్ అంటూనే మనం కొంటున్న వస్తువు మీద లోన్ తీసుకునేలా చేసి మళ్లీ దానికి వడ్డీ రూపంలో ఎక్కువ డబ్బు కట్టేలా చేస్తున్నాయి. దుస్తుల నుంచి వీకెండ్ వెకేషన్ ట్రిప్స్ వరకూ ఇదే ఫార్ములా. పర్సనల్ లోన్స్ ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి ఒక ప్లానింగ్ అంటూ ఆలోచించకుండానే ఈ వలలో పడిపోతుంటారు చాలామంది. ఇకపోతే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాప్‌లో పడి ఆదాయాన్ని మించి కొనుగోలు చేస్తే క్రమంగా అప్పుల ఊభిలో ఇరుక్కోక తప్పదని గుర్తుంచుకోవాలి.
చాలా సంస్థలు గూడ్స్ క్లియరెన్స్ కోసమే ఇలాంటి ఆఫర్స్ పెడుతుంటాయి. ప్రతీ ఇయర్ ఎండింగ్‌లోనూ, పండుగలకీ మళ్లీ మళ్లీ ఈ ఆఫర్స్ వస్తూనే ఉంటాయని గుర్తు పెట్టుకుంటే. ఇప్పుడు కొనకుంటే మిస్ అయిపోతాం అనే ఆలోచన రాదు. అలాగే వస్తువు కొనేముందు అది నిజంగా ఇప్పుడు ఈ సమయానికి అవసరమా? కాదా? ఇది మన స్థోమతలో ఉందా? అన్నది చెక్ చేసుకుని కొనాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆఫర్ అనగానే వెంటనే కొనకుండా ఒక్క నిమిషం ఆలొచించడం మంచిదని సూచిస్తున్నారు.