Telugu Global
Business

సైబర్ మోసాలపై ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు!

సైబర్ మోసాలపై తీసుకునే ఇన్సూరెన్స్‌ ‘సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్’ అంటారు. వీటిని 18 ఏళ్లు పైబడినవారు ఎవరైనా తీసుకోవచ్చు.

సైబర్ మోసాలపై ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు!
X

రోజురోజుకీ సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలామంది ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. అయితే తమ ప్రమేయం లేకుండా జరిగే ఈ తరహా మోసాల కోసం కొత్తగా ఇన్సూరెన్స్‌లు పుట్టుకొచ్చాయి. ఆర్థికంగా నష్టపోతే ఆ నష్టం నుంచి కొంత గట్టేక్కేందుకు ఈ ఇన్సూరెన్స్‌లు పనికొస్తాయి.

సైబర్ మోసాలపై తీసుకునే ఇన్సూరెన్స్‌ ‘సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్’ అంటారు. వీటిని 18 ఏళ్లు పైబడినవారు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో కట్టే ప్రీమియంను బట్టి రూ. లక్ష నుంచి రూ. కోటి వరకూ కవరేజీ పొందొచ్చు.

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై జరిగే మోసాలు, వెబ్‌సైట్ లింక్‌లతో చేసే మోసాలు, ఆన్‌లైన్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా డబ్బు కోల్పోవడం.. ఇలా అన్నిరకాల నష్టాలు ఈ పాలసీలో కవర్ అవుతాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో వేధింపులకు గురయిన వాళ్లకు కూడా ఈ పాలసీలు ఆర్ధికంగా హెల్ప్ చేస్తాయి. సోషల్ మీడియాలో పర్సనల్ వివరాలు దొంగిలించి వేధిస్తున్నప్పుడు బాధితులు న్యాయపోరాటానికి కావల్సిన డబ్బుని కూడా ఈ పాలసీల ద్వారా పొందొచ్చు. అలాగే సైబర్ బుల్లియింగ్ ద్వారా మానసికంగా కుంగిపోతే వైద్య ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది.

యూజర్లు ఉద్దేశపూర్వకంగా చేసే పనులకు ఈ పాలసీలు వర్తించవు. అంటే అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తే బీమా వర్తించదు. అలాగే పాలసీదారుడిపై ఎలాంటి ఫైనాన్షియల్ క్రైమ్ ఉండకూడదు. ఈ పాలసీలు కేవలం ఆర్ధిక పరమైన బీమాను మాత్రమే అందించగలవు. పాల‌సీదారుడు కోల్పోయిన డేటా, ఫోటోలు వంటివి పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు. అలాగే మినిమన్ సెక్యూరిటీ టిప్స్ పాటించకపోతే కూడా ఈ పాలసీ కవర్ అవ్వదు. అంటే తేలికైన పాస్‌వర్డ్స్ పెట్టుకోవడం, యాంటీ వైరస్ వాడకపోవడం వంటి జాగ్రత్తలు కూడా పాటించకపోతే పాలసీ కవర్ అయ్యే అవకాశం ఉండదు.

ఇకపోతే హ్యాకింగ్‌కు గురైన సందర్బాల్లో ఎలాంటి నష్టం జరిగినా దాన్నుంచి కోలుకునేవిధంగా ఈ పాలసీలు ఉపయోగపడతాయి. వీటిలో పాలసీ రకాన్ని బట్టి అది కవర్ చేసే బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి పాలసీ తీసుకునేముందే అది ఏయే నష్టాలకు వర్తిస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుని సరైన పాలసీని ఎంచుకోవడం మంచిది.

First Published:  9 March 2024 8:21 AM IST
Next Story