రూ.50.65 లక్షల కోట్లతో కేంద్రం పద్దు!
రెవెన్యూ రాబడి రూ.34.96 లక్షల కోట్లే
కేంద్ర ప్రభుత్వం 2025 -26 ఆర్థిక సంవత్సరానికి రూ.50.56 లక్షల కోట్లతో పద్దు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 4.4 శాతం ఉందని ప్రకటించారు. రెవెన్యూ రాబడి రూ.34.96 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. రూ.11.4 లక్షల కోట్లు అప్పుల రూపంలో సమీకరిస్తామని మిగిలిన ఆదాయం ఇతర మార్గాల్లో సమకూరుతుందని వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం రూ. 47. 16 లక్షల కోట్లు అని తెలిపారు. ఇందులో 31.47 లక్షల రెవెన్యూ రాబడి కాగా అప్పుల రూపంలో రూ.10.1 లక్షల కోట్లు సమీకరించామన్నారు. నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం రూ. 25.57 లక్షల కోట్లు. జీడీపీలో ద్రవ్యలోటు 4.8 శాతంగా ఉంటుందన్నారు.
ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో మధ్య తరగతి వేతన జీవులకు భారీ ఊరటనిచ్చారు. రూ. 12 లక్షల వరకు పన్ను ఆదాయపు పన్ను లేదని.. సవరించిన స్లాబ్‌లతో రూ.12 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి రూ.80 వేల వరకు పన్ను రాయితీ దక్కుతుందని తెలిపారు. వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ ఊరట దక్కుతుందన్నారు. వడ్డీపై వచ్చే ఆదాయంపై పన్ను పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను రాయితీ ప్రస్తుతం రూ. 2.4 లక్షలు ఉండగా దానిని రూ. 6 లక్షలకు పెంచారు. 36 రకాల మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలిగించారు. ఇన్సూరెన్స్ సెక్టార్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్ష్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. త్వరలో పూర్తి విరాలు వెల్లడిస్తామన్నారు. పట్టణ, పేదల కోసం రూ. 30 వేల పరిమితితో యూపీఐ లింకుడ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.