Car Sales | ఎస్‌యూవీలపై మోజు.. కార్ల విక్రయాల్లో సరికొత్త రికార్డులు.. ఇదీ సంగతి..?!
Car Sales | ఇంతకుముందుతో పోలిస్తే కొన్ని నెలలుగా కార్ల విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Car Sales | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీలంటే మోజు పెంచుకుంటున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే కొన్ని నెలలుగా కార్ల విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చిలో కార్ల విక్రయాలు 3.75 లక్షలు దాటాయని అంచనా వేస్తున్నారు. దీంతో 2023-24లో కార్ల విక్రయాలు 40.20 లక్షల మార్క్‌ను దాటి రికార్డు నెలకొల్పుతాయని అంచనా. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 38.90 లక్షల నుంచి ఎనిమిది శాతం సేల్స్ పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
కార్ల తయారీ కంపెనీలు గత నెలాఖరు నాటికి యుటిలిటీ వెహికల్స్, సెడాన్లతో కలిపి 3.86 మిలియన్ల యూనిట్లు డిస్పాచ్ చేశాయి. ఇండస్ట్రీ తెలిపిన వివరాల మేరకు గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ 3.55 మిలియన్ యూనిట్లు డిస్పాచ్ చేశాయి. ఇది 2022-23తో పోలిస్తే 8.6 శాతం వృద్ధి సాధించింది.
సెమీ కండక్టర్ల సరఫరా మెరుగు పడటంతో దేశీయ కార్ల తయారీ సంస్థల్లో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల విక్రయాలు పెరిగాయి. సానుకూల ఋతుపవనాలు, సమర్థవంతమైన ఆర్థిక విధానాలతో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌కు రోజురోజుకు గిరాకీ పెరుగుతున్నది. పలు కార్ల తయారీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెగ్మెంట్ల వారీగా తమ విక్రయ అంచనాలను సింగిల్ డిజిట్ నుంచి 8+ శాతానికి పైగా పెంచుకున్నాయి.
ద్రవ్యోల్బణంలో ప్రతిష్ఠంభన, అధిక వడ్డీరేట్లతో ఆటో రుణాలు పెరిగాయని మారుతి సుజుకి మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. శక్తిమంతమైన వృద్ధిరేటుతో దేశీయంగా 6-7.5 శాతం వృద్ధి సాధిస్తామని అంచనా వేశారు.
హ్యుండాయ్ మోటార్ ఇండియా గతేడాదితో పోలిస్తే ఎనిమిది శాతానికి పైగా వృద్ధి నమోదు చేసింది. క్రెటా, క్రెటా ఎన్ లైన్ మోడల్ కార్ల ఆవిష్కరణతో హ్యుండాయ్ 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం గ్రోత్ నమోదు చేసిందని హ్యుండాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెప్పారు. అసాధారణ రీతిలో ఎస్‌యూవీల విక్రయాల పెరుగుదలతో కస్టమర్లలో తమ విశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు.
ఇక దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఫెస్టివ్ సీజన్‌లో అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో విక్రయాలు పెంచుకున్నది. తమ కార్ల వృద్ధిరేటు కొనసాగుతుందని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. తాము ఆశావాహ దృక్ఫథంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. అయితే, వచ్చే ఏడాది 3-6 శాతం స్వల్ప వృద్ధిరేటు సాధిస్తామని విశ్లేషకులు తెలిపారు.