Telugu Global
Business

June Car Sales | కొత్త మోడ‌ల్ కార్ల‌తో మారుతి క‌ళ‌.. మ‌హీంద్రా రికార్డు బ్రేక్‌.. హ్యుండాయ్‌.. టాటా మోటార్స్ అంతంతే.. టూ వీల‌ర్స్ రిక‌వ‌రీ

June Car Sales | కొత్త మోడ‌ల్ కార్ల ఆవిష్క‌ర‌ణ‌ల‌తో జూన్ నెల‌లో దేశీయంగా కార్ల విక్ర‌యాల్లో స్వ‌ల్ప వృద్ధిరేటు న‌మోదైంది. 2023తో పోలిస్తే గ‌త నెల‌లో 3,40,784 కార్లు అమ్ముడ‌య్యాయి.

June Car Sales | కొత్త మోడ‌ల్ కార్ల‌తో మారుతి క‌ళ‌.. మ‌హీంద్రా రికార్డు బ్రేక్‌.. హ్యుండాయ్‌.. టాటా మోటార్స్ అంతంతే.. టూ వీల‌ర్స్ రిక‌వ‌రీ
X

June Car Sales | కొత్త మోడ‌ల్ కార్ల ఆవిష్క‌ర‌ణ‌ల‌తో జూన్ నెల‌లో దేశీయంగా కార్ల విక్ర‌యాల్లో స్వ‌ల్ప వృద్ధిరేటు న‌మోదైంది. 2023తో పోలిస్తే గ‌త నెల‌లో 3,40,784 కార్లు అమ్ముడ‌య్యాయి. ఒక‌వైపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం, మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా హీట్ వేవ్ వంటి స‌వాళ్లు ఎదురవుతున్నా 2024 తొలి అర్థ‌భాగంలో కార్ల విక్ర‌యాల్లో 7.6 శాతం పురోగ‌తితో 21.68 ల‌క్ష‌ల యూనిట్లు అమ్ముడు పోయాయి. 2023 తొలి ఆరు నెల‌ల్లో 20.15 ల‌క్ష‌ల కార్లు మాత్ర‌మే అమ్ముడు పోయాయి.

2023 జూన్‌తో పోలిస్తే గ‌త నెల‌లో కేవ‌లం 12 వేల యూనిట్లు మాత్ర‌మే అమ్ముడ‌య్యాయని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పార్థో బెన‌ర్జీ చెప్పారు. కొత్త మోడ‌ల్ కార్ల‌ను ఆవిష్క‌రించ‌డం వ‌ల్లే పోటీ ఇవ్వ‌డంతోపాటు మొత్తం కార్ల విక్ర‌యాలు పెంచుకోగ‌లిగామ‌ని తెలిపారు. గ‌తేడాదితో పోలిస్తే గ‌త నెల‌లో మారుతి సుజుకి కార్ల విక్ర‌యాల్లో మూడు శాతం గ్రోత్ మాత్ర‌మే రికార్డ‌యింది. 2023 జూన్‌లో 1,33,027 యూనిట్ల కార్లు అమ్ముడు పోగా, గ‌త నెల‌లో 1,37,160 యూనిట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2024-25) ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలోనూ కార్ల సేల్స్‌లో 1.2 శాతం గ్రోత్‌తో 4,19,114 యూనిట్ల‌కు ప‌రిమితం అయ్యాయి.

ప్ర‌స్తుతం మారుతి సుజుకి డీల‌ర్ల వ‌ద్ద స‌గ‌టున 37-38 రోజుల‌కు స‌రిప‌డా స్టాక్ ఉంది. జూన్ నెల‌లో మారుతి సుజుకి రికార్డు స్థాయిలో 31,033 కార్లు విదేశాల‌కు ఎగుమ‌తి చేసింది. గ‌తేడాది జూన్‌తో పోలిస్తే గ‌త నెల‌లో 57 శాతం వృద్ధి రికార్డ‌యింది. ఇక 2023తో పోలిస్తే ఆల్టో, ఎస్‌-ప్రెస్సో వంటి ఎంట్రీ లెవ‌ల్ కార్ల సేల్స్ గ‌త నెల‌లో త‌గ్గాయి. గ‌తేడాది 14,054 (ఆల్టో, ఎస్‌ప్రెస్సో) కార్లు విక్ర‌యిస్తే, గ‌త నెల‌లో 9,395 యూనిట్ల‌కు ప‌రిమితం అయ్యాయి.

త్వ‌ర‌లో ఐపీవోకు వెళ్ల‌నున్న హ్యుండాయ్ మోటార్ ఇండియా దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల విక్ర‌య సంస్థ‌గా నిలిచింది. కానీ 2023తో పోలిస్తే గ‌త నెల‌లో కార్ల విక్ర‌యాలు తగ్గిపోయాయి. గ‌తేడాది జూన్‌లో 65,601 కార్లు విక్ర‌యించిన హ్యుండాయ్ 1.22 శాతం సేల్స్ త‌గ్గి ఈ ఏడాది 64,803 యూనిట్ల‌కు ప‌రిమితం అయ్యాయి. గ‌త ఆరు నెల‌ల్లో హ్యుండాయ్ కార్ల సేల్స్ 2023తో పోలిస్తే 5.68 శాతం వృద్ధితో 3,65,030 యూనిట్ల నుంచి 3,85,772 యూనిట్ల‌కు దూసుకెళ్లాయి. గ‌త ఆరు నెల‌ల్లో హ్యుండాయ్ కార్ల విక్ర‌యాలు రికార్డు స్థాయిలో సాగ‌డానికి హ్యుండాయ్ క్రెటా ఒక్క‌టే 91,348 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. గ‌తేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధిరేటు ఎక్కువ‌.

దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ కార్ల విక్ర‌యాల్లో 8 శాతం క్షీణ‌త న‌మోదైంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పండుగ‌ల వ‌ల్ల కార్ల‌కు డిమాండ్ పెరిగినా, మే, జూన్ నెల‌ల్లో రిజిస్ట్రేష‌న్లు త‌గ్గాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు, హీట్ వేవ్ దీనికి కార‌ణం అని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2023-24)తో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1,38,682 యూనిట్ల విక్ర‌యాల‌తో ఫ్లాట్‌గా కొన‌సాగాయి.

హ్యుండాయ్, టాటా మోటార్స్‌కు భిన్నంగా దేశీయ కార్ల త‌యారీ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా గ‌ణ‌నీయ పురోగ‌తి సాధించింది. 2023 జూన్‌తో పోలిస్తే 23 శాతం వృద్ధితో గ‌త నెల‌లో కార్ల విక్ర‌యాలు 32,588 యూనిట్ల నుంచి 40,022 యూనిట్ల‌కు పెరిగాయి. ఎగుమ‌తుల‌తో క‌లిపి మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా గ‌త నెల‌లో 11 శాతం వృద్ధితో 69,397 యూనిట్ల‌కు చేరుకున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాలు 20,594 యూనిట్లు అమ్ముడ‌య్యాయి.

గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి గిరాకీ పుంజుకోవ‌డంతో గ‌త నెల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల విక్ర‌యాలు పెరిగాయి. మోటారు సైకిల్ మేజ‌ర్ బ‌జాజ్ ఆటో దేశీయంగా టూ వీల‌ర్స్ సేల్స్‌లో ఏడు శాతం గ్రోత్ న‌మోదు చేసుకుంది. 2023 జూన్‌లో 1,66,292 యూనిట్లు అమ్ముడు కాగా, గ‌త నెల‌లో 1,77,207 యూనిట్ల‌కు చేరాయి. మ‌రోవైపు విదేశాల‌కు ఎగుమ‌తుల్లో ఒక‌శాతం త‌గ్గింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఏడు శాతం గ్రోత్‌తో 5,42,931 యూనిట్ల నుంచి 5,82,497 యూనిట్ల‌కు పెరిగాయి. ఇక హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూట‌ర్స్ సేల్స్‌లో 60 శాతం వృద్ధి న‌మోదైంది. గ‌త నెల‌లో 5,18,799 టూ వీల‌ర్స్ విక్ర‌యించిన హోండా మోటారు సైకిల్స్ వాటిల్లో దేశీయంగా 4,82,597 యూనిట్లు అమ్మితే, విదేశాల‌కు 36,202 యూనిట్లు ఎగుమ‌తి చేసింది. మ‌రో టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్ ఐదు శాతం వృద్ధి చెందాయి. గ‌తేడాది జూన్‌లో 3,04,401 యూనిట్ల టూ వీల‌ర్స్ విక్ర‌యించిన టీవీఎస్ మోటార్స్ గ‌త నెల‌లో 3,22,168 యూనిట్లు విక్ర‌యించింది.

First Published:  2 July 2024 1:58 AM GMT
Next Story