హోండా, నిస్సాన్ విలీనానికి బ్రేక్
అధికారికంగా ప్రకటిస్తూ ఇరు సంస్థల బోర్డుల సంయుక్త ప్రకటన విడుదల
![హోండా, నిస్సాన్ విలీనానికి బ్రేక్ హోండా, నిస్సాన్ విలీనానికి బ్రేక్](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403017-honda-nissan.webp)
జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు హోండా, నిస్సాన్ విలీనానికి బ్రేక్ పడింది. తమ వ్యాపారాలను విలీనం చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ఇరు కంపెనీలు గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. విలీన చర్చలపై ముందుకు వెళ్లకూడదని ఇరు సంస్థల బోర్డులు నిర్ణయించాయని పేర్కొన్నాయి. దీంతో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఒకటి అవతరించబోతున్నదన్న అంచనాలకు ఆదిలోనే బ్రేక్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని ఎదుర్కొవడానికి జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన సంస్థలైన హోండా మోటార్ కో, నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తమ వ్యాపారాలను విలీనం చేసి ఓ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గత ఏడాది డిసెంబర్‌లో తెలిపాయి. నిన్సాన్ అనుబంధ సంస్థ అయిన మిత్సుబిషి మోటార్స్ కార్పొరేన్ కూడా ఇందులో భాగమౌతాయని ప్రకటించింది. దీనికోసం మూడు సంస్థలూ కలిసి చర్చలు ప్రారంభించాయి.
తద్వారా టయోటా, ఫోక్స్‌వ్యాగన్‌కు పోటీగా మూడో అతిపెద్ద వాహన సంస్థ అవతరిస్తుందని పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. అయితే విలీన చర్చలు ప్రారంభమైన నాటి నుంచి ఆశించిన మేర ముందడుగు పడలేదు. దీంతో త్వరలోనే ఈ విలీనానికి బ్రేక్ పడొచ్చని జపాన్ మీడియా వర్గాలు కొన్నిరోజుల కిందటే పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా బ్రేక్ వేస్తున్నట్లు తాజాగా ఇరు సంస్థలు పేర్కొనడం విశేషం. అయితే ఇది వరకే నిస్సాన్, హోండా, మిత్సుబిషిలో తమ విద్యుత్ వాహన విడిభాగాలను పంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ విషయంలో మాత్రం కలిసే మందుకెళ్లనున్నాయి.