లక్ష డాలర్లు దాటేసిన బిట్‌కాయిన్
ఎన్‌ఈసీ విభాగానికి క్రిప్టో అడ్వయిజర్‌ను అధిపతిగా నియమిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో పెరిగిన బిట్‌కాయిన్ విలువ
క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ రికార్డు సృష్టించింది. మొదటిసారి దాని విలువ ఏకంగా1,00,000 డాలర్లు (రూ. 84 లక్షలకు పైగా) దాటింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి దీని విలువ పెరుగుతున్నది. తాజాగా ఎన్‌ఈసీ విభాగానికి క్రిప్టో అడ్వయిజర్‌ను అధిపతిగా నియమిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో బిట్‌కాయిన్ విలువ మరింత పెరిగింది. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇది 1,00, 00 డాలర్ల మార్క్‌ను దాటింది. ఒకదశలో అత్యధికంగా 1,00,512 తాకింది.
మడ్‌రెక్స్ సీఈవో ఈ పరిణామాలపై స్పందిస్తూ.. బిట్‌కాయిన్ దూకుడు వెనుక మస్క్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడం వంటి కారణాలున్నాయి. దీంతోపాటు అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) ఛైర్మన్‌గా పాల్ అట్కిన్‌కు ట్రంప్ బాధ్యతలు అప్పగించడం వంటివి కలిసి వచ్చాయి. దీంతో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి. భవిష్యత్తులో బిట్‌కాయిన్ 1,20,000 డాలర్లకు కూడా చేరే అవకాశం ఉందన్నారు.
పాల్ అట్కిన్ గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలోనూ ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ఆ పదవిని వీడిపోయాక అమెరికాలో మార్కెట్ నియంత్రణ చాలా తీవ్రంగా ఉందని న్యాయపోరాటం చేశారు. తాజాగా ట్రంప్ మళ్లీ ఆయనకు ఎస్‌ఈసీ పగ్గాలు అప్పగించడం గమనార్హం. అమెరికా ఎన్నికల రోజున బిట్‌కాయిన్ విలువ 69,374 డాలర్లుగా ఉన్నది. రెండేళ్ల కిందట 17,000 డాలర్ల దిగువకు జారిపోయిన ఈ క్రిప్టో కరెన్సీ ఇప్పుడు లక్ష డాలర్లు దాటడం విశేషం