మీరు ఏపీజీవీబీ ఖాతాదారులా? మీ ఏటీఎం కార్డులు, చెక్కులు పనిచేయవు!
తెలంగాణ ప్రాంతంలో ఏపీజీవీబీ సేవలకు స్వస్తి
మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఎకౌంట్ ఉందా? అయితే ఈరోజు నుంచి మీ ఏటీఎం కార్డులు పని చేయవు. నెట్ బ్యాంకింగ్ తో పాటు యూపీఐ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. ఎందుకు అని అడుగుతున్నారా? తెలంగాణ ప్రాంతంలోని ఏపీజీవీబీ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో విలీనమయ్యాయి. బుధవారం నుంచి ఈ విలీనం అధికారికంగా అమల్లోకి వచ్చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో ఏపీజీవీబీ పేరుతో ఇష్యూ చేసిన ఏటీఎం కార్డులు పని చేయవు. తెలంగాణ ప్రాంతంలోని ఏపీజీవీబీ ఖాతాదారులంతా వాటిని మార్చుకోవాల్సిందే. ఏపీజీవీబీ పేరుతో గతంలో కార్యకాలాపాలు నిర్వహించిన బ్యాంకులు టీజీబీ పేరుతో ఇకపై పని చేస్తాయి. దీంతో ఎకౌంట్ హోల్డర్లు తమ బ్యాంకు శాఖలను సంప్రతించి కొత్త ఏటీఎం కార్డులు తీసుకోవాలి. వారి ఖాతాల్లోని అడ్రస్ లకు ఇదివరకే కొత్త చెక్ బుక్కులు పంపారు. ఎవరికైనా రాకపోతే తమ బ్రాంచిలో సంప్రదించాలి. పాత చెక్ బుక్ ను తమ బ్రాంచిలో సబ్మిట్ చేయాలి. ఇది వరకే చెక్కులు ఇచ్చి ఉంటే వాటిని 90 రోజుల్లోపు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ కోసం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి TGB Mobile banking appను డౌన్‌లోడ్ చేసుకొని మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. , నెట్ బ్యాంకింగ్ కోసం www.tgbhyd.inను సందర్శించి సేవలు కొనసాగించవచ్చు. బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కూడా మారింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ కోసం కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ SBIN0RRDCGBని ఉపయోగించాలి. వాట్సప్ బ్యాంకింగ్ మిస్డ్ కాల్ అలర్ట్ సర్వీసెస్ కోసం 92780 31313ను సంప్రదించాలని టీజీబీ సూచించింది.