Best SUV Cars | సిక్స్ ఎయిర్ బ్యాగ్స్‌తో వచ్చే బెస్ట్ ఎస్‌యూవీ కార్లు ఇవే.. !
Best SUV Cars | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు.
Best SUV Cars | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్‌గా ఉండే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)ల వైపు మొగ్గు చూపుతున్నారు. విశాలంగా ఉన్నా, అత్యాధునిక ఫీచర్లు ఉన్నా రహదారులపై వెళుతున్నప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. ఇటీవల పల్లోంజీ సైరస్ మిస్త్రీ కంపెనీ అధినేత- టాటా సన్స్ మాజీ సీఎండీ సైరస్ మిస్త్రీ వెళుతున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆయన దుర్మరణం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కార్ల తయారీలో సేఫ్టీ ఫీచర్లను ప్రామాణికం చేసింది. అన్ని కార్లలో సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ తప్పని సరి చేసింది. దీంతో కార్ల తయారీదారులు తాము తయారు చేసే వివిధ మోడల్ కార్లలో మెరుగైన సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నారు.
అన్ని కార్లలో స్టాండర్డ్‌గా సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరి కావడంతో కార్ల తయారీలో ఎయిర్‌బ్యాగ్స్ సహా పలు రకాల సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యం ఏర్పడింది. కేవలం ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కార్ల ప్రయాణానికి సురక్షితం కాదని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిందే. ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు పలు రకాల ఫీచర్లతో కార్లలో ఓవరాల్‌గా సేఫ్టీ లభిస్తుంది. దేశంలో రోజురోజుకూ ఎస్‌యూవీ కార్లకు పాపులారిటీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్‌తో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం..!
హ్యుండాయ్ ఎక్స్‌టర్‌లో సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి
దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ తీసుకొచ్చిన ప్రతి ఎస్‌యూవీ కారులోనూ సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి. హ్యుండాయ్ తయారు చేస్తున్న ఎస్‌యూవీ కార్లలో ఎక్స్‌టర్ అత్యంత చౌక ధరకు లభించే కారు. హ్యుండాయ్ మైక్రో ఎస్‌యూవీ కారు ఎక్స్‌టర్ ఎంట్రీ లెవల్ కారులోనూ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వినియోగిస్తున్నారు. ది ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024 (ఐసోటీ 2024) అవార్డు గెలుచుకున్న ఎక్స్‌టర్ కారు ధర రూ.6.13 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) రూ.10.28 లక్షల (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
హ్యుండాయ్ వెన్యూ ఇలా
హ్యుండాయ్ తయారు చేసే ప్రతి కారులోనూ సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి. ఇందుకు హ్యుండాయ్ వెన్యూ మినహాయింపు కాదు. ఈ కంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ బేస్ మోడల్ కారులోనూ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. హ్యుండాయ్ వెన్యూ కారు ధర రూ.7.94 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) రూ.13.44 లక్షల వరకూ (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
ఇలా కియా సోనెట్
దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్ ఇండియా సైతం అన్ని మోడల్ కార్లలోనూ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్‌గా తయారు చేస్తున్నది. ఇటీవలే దేశీయ మార్కెట్‌లో ఆవిష్కరించిన సోనెట్-2024 బేస్ వేరియంట్‌లోనూ సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. దీని ధర రూ.7.99 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) రూ.15.69 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.
అదే బాటలో టాటా నెక్సాన్
దేశంలో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌లోనూ సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి చేశారు. ఇంతకుముందు బేస్ వేరియంట్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే వాడే వారు. కానీ 2023 సెప్టెంబర్‌లో టాటా మోటార్స్ ఆవిష్కరించిన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ అన్ని వేరియంట్లలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ప్రామాణికం చేశారు. ఈ కారు ధర రూ. 8.15 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.15.80 లక్షల వరకూ (ఎక్స్ షో రూమ్) పలుకుతుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో ఇలా
దేశంలోకెల్లా అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. కానీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ అన్ని మోడల్ కార్లలో స్టాండర్డ్‌గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వాడటం లేదు. కేవలం జేటా, ఆల్ఫా అనే రెండు టాప్ వేరియంట్లలో మాత్రమే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వాడుతున్నారు. మీరు జెటా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కొంటున్నారా.. అందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా వాడాలంటే రూ.10.55 లక్షలు చెల్లించాల్సిందే.