Air India Express | 80 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు.. 200 సీనియర్ క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవులు.. కారణమిదేనా..?!
Air India Express | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తున్న సీనియర్ క్రూ సిబ్బంది 200 మందికి పైగా మంగళవారం మూకుమ్మడి సెలవులు పెట్టినట్లు తెలుస్తున్నది.
Air India Express | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తున్న సీనియర్ క్రూ సిబ్బంది 200 మందికి పైగా మంగళవారం మూకుమ్మడి సెలవులు పెట్టినట్లు తెలుస్తున్నది. సెలవులో వెళ్లిన వారంతా అనారోగ్యం కారణం చెప్పినట్లు సమాచారం. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. విమాన ప్రయాణికులు విమానాశ్రయాలకు వచ్చేందుకు తమ విమాన సర్వీసు సమాచారం తెలుసుకోవాలని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సూచించింది. క్యాబిన్ సిబ్బంది కొరతతో బుధవారం కూడా పలు విమాన సర్వీసులు రద్దు చేస్తారని భావిస్తున్నారు. కాలికట్, కొచి, బెంగళూరు విమానాశ్రయాల పరిధిలో పని చేసే 200 మందికి పైగా సీనియర్ క్రూ సిబ్బంది సెలవులో ఉన్నారని వార్తా సంస్థల కథనం.
క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవుల నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తిగా రీఫండ్ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించింది. ప్రయాణికుల అభ్యర్థన మేరకు విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తామని పేర్కొంది. సిబ్బది కొరత వల్ల కొన్ని విమాన సర్వీసులు ఆలస్యం కావడం గానీ, రద్దు చేయడం గానీ జరుగుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు క్రూ సిబ్బందితో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.
అనారోగ్యం పేరిట సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టినా.. కంపెనీ యాజమాన్యం వివక్షాపూరిత ధోరణిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ మధ్య విలీన ప్రక్రియ ప్రారంభమైన తర్వాత క్యాబిన్ క్రూ సిబ్బందిలో అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. 2022 డిసెంబర్‌లో ఎయిర్ ఏషియా ఇండియాలో షేర్లు మొత్తం టాటా సన్స్ కొనుగోలు చేసింది. అలాగే ఎయిర్ ఏసియా ఇండియా సంస్థ పేరును ఏఐఎక్స్ కనెక్ట్‌గా మార్చేసింది. అటుపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ విలీనం జరిగింది. గతేడాది అక్టోబర్‌తో ఎయిర్ ఏషియా ఇండియా బ్రాండ్ కనుమరుగై ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేరిట విమాన సర్వీసులు నిర్వహిస్తున్ నారు.
విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు టాటా సన్స్ తన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం, ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనం చేయాలని నిర్ణయించింది. అయితే వేర్వేరు సంస్థాగత సంస్కృతుల మధ్య పని చేస్తున్న ఉద్యోగులను ఒక గొడుగు కిందకు తేవాలని ప్రయత్నిస్తున్న టాటా సన్స్ యాజమాన్యం.. ఉద్యోగుల వేతన ప్యాకేజీల ఖరారులో తేడాలు ఉండటంతో సిబ్బందిలో అసంతృప్తి, నిరసన పెరుగుతున్నదని తెలుస్తున్నది.
గత నెలలో టాటా సన్స్ మరో విమానయాన సంస్థ విస్తారా ఎయిర్‌లైన్స్ 110 విమాన సర్వీసులు రద్దు చేసింది. మరో 160కి పైగా విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. పైలట్ల కొరత సమస్యను ఎదుర్కొంటుడంతో విమాన సర్వీసులను తగ్గిస్తున్నామని విస్తారా ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. పైలట్ల కొరత సమస్య పరిష్కారం అయ్యే వరకూ పరిమితంగా విమాన సర్వీసులు నడుపుతామని, అప్పటి వరకూ రద్దయిన విమాన సర్వీసుల్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తిగా రీఫండ్ చేస్తామని తెలిపింది.