చిత్రం (కథ)
లలితకళా నిలయం మెట్లు ఎక్కుతున్నాను.మా టౌన్ లో కళలకు సంబంధించిన ఏ ఎగ్జిబిషన్ జరిగినా అందులోనే జరుగుతుంటాయి.అప్పడప్పుడూ సాహిత్యసభలు కూడ పెడుతుంటారు. నాకు సాహిత్యం కంటె చిత్రకళ పట్ల అభిరుచి మెండు.కొద్దో గొప్పో ప్రవేశం కూడ వుండటంతో చిత్రాలను సునిశితంగా పరిశీలించడం అలవాటయింది.
ప్రసిద్ధ చిత్రకారులు వడ్డాది పాపయ్య, దామెర్ల రామారావు,బాపు,నందిని గౌడ్ వంటి వారి ఎగ్జిబిషన్ లకు అవి జరిగినన్ని రోజులు హాజరవుతాను.లబ్దప్రతిష్టులైన కళాకారులవే కాక అప్పుడప్పుడే రేఖలు దిద్దుతున్న ఔత్సాహిక చిత్రకారుల ప్రదర్శన లకు కూడ అంతే మక్కువ తో హాజరవుతాను.
ప్రతి గీత,రంగు నా మనసులో భావ సౌరభాలు నింపుతాయి.
ఆరోజు చిత్రలేఖ చిత్రప్రదర్శన వుందని తెలియడంతో అక్కడకు వచ్చాను. ఆమె ఈ మధ్య కాలంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న చిత్రకారిణి.ఆమె చిత్రాలు కొన్ని అంతకుముందు చూసాను .కాని వాటిలో అంతర్లీనంగా వుండే భావం పట్టుకోలేక పోయాను.
వరుసగా చిత్రాలన్నీ చూస్తుండగా ఒక చిత్రం దగ్గర నా చూపులు అతుక్కుపోయాయి.
చుట్టూ ప్రకృతి రమణీయకత మధ్యలో అప్సరసలాంటి స్త్రీ మూర్తి చిత్రం.కాని ఆమె చూపులు పరిసరాలపై లేవు.రంగుల మేళవింపు చిత్రీకరణ అత్యద్భుతంగా వుంది. ఎంత పరికించి చూసినా ఏదో మిస్ అయిన ఫీలింగ్.
కళాకారిణి చిత్రలేఖ ఆ హాలులో మూలగా ఒక్కరే కూర్చొని వున్నారు.ఆమె దగ్గరకు వెళ్ళడానికి సంశయించాను ఎలా స్పందిస్తారో తెలియదు కదా!చుట్టూ చూసాను తెలిసిన వారెవరైనా కనిపిస్తే పరిచయంచేస్తారేమోనని.
ఒక్క మొహం తెలిసింది లేదు.ఎలాగైనా ఆ చిత్రాల్లోని భావం ఆమెతో ఒకసారి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చేమో ననే ఆరాటం వుత్సుకత నిలవనీకుండా చేయడం తో ధైర్యం చేసి ఆమె దగ్గరకు నడిచాను.నన్ను నేను పరిచయం చేసుకున్నాను.ముందు ముభావంగా మాట్లాడినా నా వాక్చాతుర్యం తో సంభాషణ ఉత్సాహంగా సాగింది. పాత, కొత్త చిత్రకారులు ,వారి రేఖా విన్యాసము ,రంగుల మేళవింపు ,కుటుంబ నేపథ్యం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు మా సంభాషణ లో చోటు చేసుకున్నాయి.
హఠాత్తుగ ఆమె బిగుసుకు పోయి గుమ్మం వైపు కళ్లు విప్పార్చుకుని చూడసాగింది. నేను అటు వైపు చూసాను. ఒకఆజానుబాహు విగ్రహం మా వైపే రాసాగింది.భర్త కాబోలు.!
అతనిని చూడగానే నా మిస్సింగుకి జవాబు దొరికినట్లైంది.జీవరహితమైన కనులు కాదు, జీవ సహితమైన హృదయంలోని పగులు నా మనసును తాకింది.
- యార్లగడ్డ శ్రీ రంగలక్ష్మి,