అనురాగదీపాలు (కథ)
శరద్ పూర్ణిమ.. చంద్రుడు రెట్టింపు అందంతో మిరుమిట్లు గొలుపుతున్నాడు . కవులు వర్ణించగలరు అంటారు కానీ ఎంత చెప్పినా తక్కువేనేమో అన్నట్లున్న ఆ నిండు జాబిలిని ఎంత చూసినా తనివి తీరటం లేదు ఆదంపతులకు.
ఆ వెన్నెల రాత్రిని ఏ నాడూ వృధా పోనివ్వరు అనుపమ, అనురాగ్.
ఆ రోజు సోయగం వేరు. అమృత థారలు కురిసే సమయం. డాబా మీద ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకుని అందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శివరాత్రిలా జాగారం చేసేస్తారు. అందులో అనిర్వచనీయమైన ఆనందం ఉందంటారు వారిద్దరూ.
ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కలకాలం కలిసి ఉండాలనే ఉన్నత సంస్కారంతో ఏడడుగులు నడిచారు. ఇప్పటి దంపతుల్లా తుమ్మితే ఊడిపోయే వ్యవహారానికి దూరంగా..ప్రేమైక శిఖరాల అంచులు తాకాలనే తాపత్రయం వారిది.
ప్రేమే అసలు అత్యుత్తమం. ఇక దాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునే ఆ జంటను గమనించకుండా మనముండగలమా?అనుసరిద్దాం! ఆచరిద్దాం!
* * *
వాళ్ళ ఎదురింట్లో కళ, సాగర్ ఉంటారు. వీరిద్దరికీ పూర్తి వ్యతిరేకం. ఎప్పుడూ కీచులాడుకుంటూనే. అసలు దాని కోసమే పెళ్ళి చేసుకున్నట్లు ఉంటారు. చిలిపి కయ్యాలు ఉంటే బాగుంటుంది కదా అని బయట వారి దగ్గర తమను తాము సమర్ధించుకుంటారు.
అందులో అణుమాత్రం నిజం లేదని వాళ్ళిద్దరినీ గమనించేవారికి ఇట్టే అర్థమైపోతుంది.
కానీ తాము చెప్పేదే నిజమని అందరూ నమ్ముతున్నారని భ్రమలో విచిత్రంగా జీవిస్తూ ఉంటారు వారిద్దరూ!ఎంత తమాషానో!
వాళ్ళింటి ముందు ఇల్లు కొనుక్కొని అనుపమ,అనురాగ్ వాళ్ళు దిగటం వారి అదృష్టమే!
ఎందుకంటే కళ్ళ ముందు చెడు ఉంటే సంస్కరించే మనస్తత్వం వీరిది కదా!
* * *
రోజూ లాగే చిన్న చిన్న చినుకులుగా ప్రారంభమైన ఆ మాటల యుద్ధం పెనుతుఫానులా మారిపోయింది ఎదురింట్లో.
మగవారికి తాము గొప్పవారిమన్న ఆలోచన మనసులో బాగా నాటుకుపోతుంది. అందుకే తొందరగా ఆడవారి మీద చేయి ఎత్తటం, కొట్టటం లాంటివి చేసేస్తారు. ఇది నా ఇల్లు. ఇంట్లోంచి వెళ్ళిపో అని సులభంగా అనేస్తారు.
అదే అక్కడ జరిగిపోయింది.
కళ నాలుగు డ్రస్సులు,కావాల్సిన వస్తువులు,సర్టిఫికెట్స్ లాంటి ముఖ్యమైనవి సూట్ కేసులో సర్దేసుకుని బయటకు వచ్చేసింది.
తాను సంపాదనాపరురాలు. బ్రతకాలంటే భయం లేదు. సాగర్ చెయ్యెత్తినప్పుడే తానూ అతన్ని కొట్టగలదు. కానీ అలా చెయ్యలేదు. తనకున్న సంస్కారం అడ్డుపడింది. అలోచిస్తూనే మెట్లు దిగుతోంది.
ఆవేశంలో ఉన్న సాగర్ ఆమెను ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు పైగా తలుపులు భళ్ళున మూసేసాడు.
* * *
అలా చేశాడేగానీ అరగంట మించి అలా ఉండలేకపోయాడు.
ఆవేశం తగ్గిపోయింది.ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళుతుంది?అసలే రోజులు బాగోలేవు అనుకుంటూ బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా వెతికి వెతికి అలిసిపోయి ఇంటికిచేరాడు.ఫలితం మాత్రం దక్కలేదు.ఇంత చిన్నదానికి ఆత్మహత్య చేసుకునేంత పెద్ద నిర్ణయం తీసుకోదని నమ్మకం.
ఏదో సరదాగా ఫోన్ చేసినట్లు కళకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేసాడు.అందరూ ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్లే. తను వాళ్ళదగ్గిర ఉన్నట్లు ఒక్కరు కూడా అనలేదు.
ఐనా నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు.
భళ్ళున తెల్లవారింది గానీ అతనికి మాత్రం కంటి మీద కునుకు లేదు.
అన్నీ ఉన్నా ఆనందం లేనట్లు తయారయ్యిందిప్పుడు సాగర్ పరిస్థితి. కోపం ఎంతటి మనిషినన్నా దిగజారుస్తుంది.
ఎంత కొట్టుకున్నా కళ ఉంటే సరదాగా ఉండేది. జీవం ఉండేది.
ఇప్పుడు తనేంటో తనకే ప్రాణం ఉండీ ప్రాణం లేని మనిషిలా కనిపిస్తున్నాడు. నాలుగు రోజులకు కోపం తగ్గి తనే వస్తుందిలే అనే పరిస్థితి కూడా కాదు. తనే తప్పు చేసాడు. అంత చిన్న విషయానికి అంత చెయ్యెత్తవలసిన పని లేదు. ఆవేశంలో విచక్షణను కోల్పోయాడు.
కళ ఎక్కడకు వెళ్ళిందో తెలియటం లేదు. ఎక్కడికి ఫోను చేసినా లేదనే సమాధానమే! ఆఫీసుకు కూడా సెలవు పెట్టిందట. అంత అవసరం ఏముంది?
పిచ్చివాడు!
అవమానం చేసిన వారికి ఆ బాధ విలువ ఏం తెలుస్తుంది? పడ్డవారికే ఆ బాధ ఏమిటో ఎక్కువ అవగత
మౌతుంది.
ఏదో యాంత్రికంగా పనులు చేసుకుంటున్నాడు. కానీ కళ వచ్చేస్తే బాగుండునని ప్రతి నిమిషం ఎదురు చూస్తున్నాడు.
అలాగే ఆ రోజు కూడా ఆఫీసు నుంచీ వచ్చి సోఫాలో వాలిపోయాడు.
కాసేపటికి తోచక ఇంటికి తాళం వేసి ప్రక్కనే ఉన్న పార్కుకు వెళ్ళి అక్కడ ఉన్న బెంచి మీద కూర్చున్నాడు.
అదే సమయంలో అనుపమ, అనురాగ్ అక్కడ పిల్లలతో సరదాగా ఆడుకుంటున్నారు.
వాళ్ళను చూస్తే ముచ్చట వేసింది సాగర్ కు. దంపతులంటే అలా ఉండాలి అనిపించింది. ఆసక్తిగా వాళ్ళిద్దరినీ గమనించసాగాడు.
ఓ అరగంట తర్వాత అనురాగ్,సాగర్ ప్రక్కన వచ్చి కూర్చున్నాడు.ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.
అతనెందుకో సొంత అన్నలా అనిపించటంతో తొలి పరిచయమే అయినా తన బాధంతా వెళ్ళబోసుకున్నాడు.
"ఇద్దరికీ కోపం, ఆవేశం ఎక్కువే. పెద్దలు కుదిర్చిన సంబంధం. ప్రేమించి పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఆస్తులు, అంతస్తులు బేరీజు వేశారు కానీ మనస్తత్వాలను గమనించలేదు. మేమూ ఆ విషయం గురించి పరిగణించలేదు.దిగితే గానీ లోతు తెలియదన్నట్లు, సంసార సముద్రంలోకి అడుగు పెట్టాకే ఈ విషయాలు అన్నీ అవగత
మయ్యాయి. కాస్త ఓర్పు, సహనం ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఇలా జరిగేది కాదేమో!"
అంతా విన్నాక అప్పుడు నోరు విప్పాడు అనురాగ్.
"సాగర్! ఇప్పుడు కూడా ఆమె అలా ఉంటే బాగుంటుందనే అనుకుంటున్నావు కానీ నీలో ఉన్న లోపం గురించి ఆలోచించటం లేదు. అసలు ఎదుటి మనిషిని కోప్పడే హక్కు నీకెక్కడుంది? పోనీ వివాహం జరిగింది కాబట్టి నాకు కోపం వచ్చింది అంటే ఊరుకుంటారా? ఎవరైనా ప్రేమను పంచితే తీసుకుంటారు కానీ బాధనూ, కోపాన్ని పంచుకుంటానంటే తీసుకుంటారా? భార్య అయినా అంతే! తనూ నీలాగే కోరుకుంటుంది. అవునా? కాదా?"
"అవును" అన్నాడు అస్పష్టంగా.
"కోపం వల్ల మన శరీరానికి జరిగేది నష్టమే. కాబట్టి ముందు ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి"
"అప్పుడు నా కళ నా దగ్గరికి వస్తుందంటారా?"
"రావచ్చు"
నమ్మకంగా చెబుతాడేమోననని అతని కళ్ళలోకి గ్రుచ్చి గ్రుచ్చి చూసాడు.అదేమీ అతనిలో కనిపించలేదు.
"పోనీ పోలీస్ రిపోర్ట్ ఇస్తే..?"అన్నాడు సాగర్.
"వద్దు.బాగా దగ్గర వాళ్ల దగ్గరకే వెళ్లి ఉంటుంది.నాలుగు రోజులు ఆగాక ఫోన్ చెయ్యి.క్షమాపణ చెప్పు.కావాలంటే నిన్నూ కొట్టమను చెంప మీద.దానితో గొడవ సర్దుకుంటుంది. "
"అంతేనంటారా?"
"అంతే"
"మీ మాటలు నాలో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి"అన్నాడు సాగర్ అనురాగ్ చేతులను పెట్టుకుంటూ"
"ధైర్యంగా ఉండండి" అంటూ ఆ చేతులను అలాగే కాసేపు పట్టి వుంచాడు.
తర్వాత నెమ్మదిగా మళ్లీ చెప్పాడు.
"మనిషి ఆశతోనే బ్రతకాలి. మీరు ప్రయత్నించండి. అందులో సఫలమైతే ఎక్కడున్నా కళను తెచ్చి మీకు అప్పగించే పూచీ నేను తీసుకుంటాను." అని అతని చేతిలో తన చేతిని వేసాడు ప్రామిస్ అన్నట్లుగా.
"ధ్యానాన్ని ఆశ్రయించండి. ఫలితం తప్పక ఉంటుంది." అని ఓ సూచన కూడా ఇచ్చి వెళ్ళాడు అనురాగ్.
మంచి వ్యక్తుల పరిచయం మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుందన్న నిజం ఆ రోజు సాగర్ కి తెలిసి వచ్చింది.
ఆ రోజు నుంచీ అతను ఏది చెప్పినా దాన్ని వేదంలా అనుసరించటం ప్రారంభించాడు. అంతే కాదు ఆఫీసు నుంచీ వచ్చినప్పటి నుంచీ ఎదురింట్లో ఉన్న ఆ దంపతులను చూడటమే పనిగా పెట్టుకున్నాడు. అప్పుడు కానీ చక్కటి సంసారం అంటే ఎలా ఉండాలో అన్నది తన కిప్పటి వరకూ తెలియదని అర్ధం కాలేదు.
కళ వచ్చాక తాము కూడా వాళ్ళిద్దరిలాగానే ఉండాలనే కోరిక రోజు రోజుకి ప్రబలం కాసాగింది.
కళ కనిపిస్తే కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.
"కానీ నా కళ లేదే! నాలో మారిన భావాలు తనకు ఎలా తెలుస్తాయి?" అని అనురాగ్ దగ్గర
వాపోయాడు.
"సాగర్! నీలో నిజంగా పశ్చాత్తాపం మొదలయితే అది తప్పక తనకు తెలుస్తుంది. భగవంతుడు ఇద్దరినీ ఒకరి దగ్గరకు ఒకరిని చేరుస్తాడు. నన్ను నమ్ము" అని ధైర్యం చెప్పాడు.
ప్రతిరోజూ వాళ్ళతో గడపటానికే పార్కుకు వస్తున్నాడు సాగర్. రోజంతటిలో ఆ గంటే అతనికి అంతు లేని ఆనందాన్ని అందిస్తోంది. ఆ సమయాన్ని అనురాగ్ సాగర్ లో మార్పు రావటానికి,మార్గాలు సూచించటానికే వినియోగిస్తున్నాడు అతనికి తెలియకుండానే.
సాగర్ ని మార్చటానికే తామిదంతా చేస్తున్నామనే విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.
అంతే!
కథంతా తాననుకున్నట్లు జరుగుతోంది అనుకున్నాడు అనురాగ్.
* * *
అనుపమ, అనురాగ్ కుందేలు పిల్లలతో ఆడుకుంటున్నారు. అవి ముద్దు ముద్దుగా పరుగులు తీస్తుంటే వాటి వెంట పరుగులు తీస్తున్నారు. తామూ వీరితోనే ఉన్నామంటు
న్నట్లుగా పావురాలు అప్పుడప్పుడూ వచ్చి వారి భుజాల మీద వాలుతున్నాయి.
ఎక్వేరియం లో ఉన్న రంగు రంగుల చేపలు తమ ఆటల్ని కాసేపు ఆపేసి ఆ జంటని గమనిస్తున్నాయి. సాగర్ తో జత కలుపుతూ.
ఎంత ప్రశాంత వాతావరణాన్ని సృష్టించుకున్నారు వీళ్ళిద్దరూ.
పర్ణశాలను తలపిస్తుంది వీరిల్లు.
ఇంతలో వాళ్ళు పెంచుకుంటున్న కుక్క పిల్ల 'బిజిలీ' వచ్చి వాళ్ళ ఒడిలో చేరింది. ఆత్మీయంగా దాన్ని నిమిరింది అనుపమ.
పక్షులు, జంతువులు కూడా తమ లాంటివే. వాటికి ఇంకా ప్రేమ తమ కంటే ఎక్కువే. స్వార్ధం లేకుండా ఎదుటి వారిని పేమిస్తాయి. నిజాయితీకి ప్రాణమిస్తాయి. వాటి దగ్గర ఉంటే కాలం ఇట్టే గడిచిపోతుంది.
సాగర్ కయితే ఆ నిమిషాన్నే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనిపించింది. కానీ పానకంలో పుడకలా వాళ్ళ మధ్యకి వెళ్ళి వారి ఆనందాన్ని ఎందుకు చెడగొట్టాలి అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు.
కానీ కళ ఉంటే.. కళ ఉంటే.. అని మనసు పదే పదే ప్రశ్నిస్తోంది.
ఏం చెయ్యగలడు తను?
ఎంత వెతికినా తన జాడ మాత్రం తెలియడం లేదు. పోలీసు రిపోర్టు ఇద్దామనుకున్నాడు.
కావాలని వెళ్ళిపోయిన వాళ్ళను ఏ పోలీసులు పట్టుకోలేరు. నీది వృధా ప్రయత్నం అవుతుంది అని వాళ్ళిద్దరూ అనటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు సాగర్.
కానీ కళకు తను మారాడని ఎలా తెలుస్తుంది? వీళ్ళిద్దరూ మాత్రం తెలుస్తుంది అంటారు. ఎలా?
ఆలోచనలో పడ్డాడు సాగర్.
అలాగే నీరసంగా అడుగులు వేసుకుంటూ వచ్చి పార్క్ లో బెంచి మీద వాలాడు.
ఈ రోజు అటో ఇటో తేల్చుకోవాలని నిశ్చయించుకుంటూ.
కళ అంటే తనకు ఇంత ఇష్టమా? తను లేకుండా బ్రతకలేడా? మూడు ముళ్ళలో ఇంత మహత్యం ఉందా? కొన్ని రోజులలో తమ మధ్య ఇంత సాన్నిహిత్యం ఏర్పడిందా?
ఎవరైనా ఈ విషయం చెబితే తను నమ్మను గాక నమ్మడు. ఇది తనకే జరుగుతోంది కాబట్టి నమ్మగలుగు
తున్నాడు.
ఈ రోజు ఇంకా అనుపమ వాళ్ళు రాలేదు. ఎందుకో?
ఈ పాటికి వచ్చి ఉండాలే!
ఎప్పటిలా పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు.
గంట నిరీక్షణ. ఫలితం శూన్యం.
ఇక వెళ్ళిపోదాం అనుకునేంతలో పిల్లల మధ్య ప్రత్యక్షమయింది కళ.
నిజమా? భ్రమా?
తన కళ్ళను రెండు, మూడు సార్లు నులుముకుని చూసుకున్నాడు.
నిజమే! అక్కడ కళ ఉంది.
పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చెంత చేరాడు.
పార్కు అన్న విషయం కూడా మరిచి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు.
"కళా! కళా!" ఇన్నాళ్ళూ ఎక్కడికి వెళ్ళిపోయావు? అన్నాడు కన్నీళ్ళతో అభిషేకిస్తూ.
కళ కూడా లతలా అతన్ని పెనవేసుకు పోయింది.
"నన్ను క్షమించు. జీవితంలో ఇంకెప్పుడూ నీ మీద చెయ్యి చేసుకోను. మాట ఇస్తున్నాను. ప్రామిస్! కావాలంటే నన్ను కూడా కొట్టు . అంతే గానీ నన్ను విడిచి వెళ్ళకు."
అతని మాటల్లో ఎంతో ఆర్తి.
"లేదు. లేదు. అసలు వదిలి వెళ్ళనే వెళ్ళను" అంటూ అతన్ని మరింతగా అల్లుకుపోయింది కళ.
ఇద్దరూ తమకు తెలియని ఆనందంలోనే ఇంటికి చేరుకున్నారు.
* * *
"కళా! ఇప్పుడు చెప్పు! ఇన్నాళ్ళూ ఏమైపోయావ్ ? నేనసలు గుర్తు రాలేదా? నేనంటే నీకు అంత కోపం వచ్చిందా?" పసిపిల్లవాడిలా ఆమె ఒడిలో వాలిపోతూ అడిగాడు సాగర్.
"ఎందుకు గుర్తు రాలేదు ? అసలు మరిచిపోతే కదా! నువ్వు ఆఫీసు కన్నా వెళ్ళావు. నేను ఆఫీసుకు కూడా వెళ్ళలేదు."
"మరి?"
"మన మధ్య రాక్షసి లా నిలబడ్డ కోపాన్ని అదుపులో పెట్టే ప్రయత్నం లో ఉన్నాను."
"సాధించావా?"
"ఆఁ! పట్టుదల ఉంటే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదు."
"అవును. అది నాకూ అనుభవం లోకి వచ్చింది."
"సరే! ఇన్నాళ్ళూ ఎక్కడున్నావ్? జల్లెడ పట్టి వెతికినా కనిపించలేదు. సప్త సముద్రాల అవతల
దాక్కున్నావా ఏమిటి రాజకుమా
రిలా?"
"ఆఁ! ఈ రాజకుమారుడు వెతుక్కుంటూ రావాలని."
"ఇక నన్నెప్పుడూ విడిచి వెళ్ళవుగా?"
"వెళ్ళను" అంది ప్రేమనిండిన అతని కళ్ళలోకి అలాగే చూస్తూ.
"నేనసలు నీ మీద కోపం తెచ్చుకోను."
"సరే"
ఆ రాత్రి వారిద్దరికీ తొలిరాత్రి అయ్యింది. జ్ఞాపకం, వాస్తవం మేలుకలయిక లో ఆ దంపతులు ఓలలాడారు.
ఇన్నాళ్ళ విరహానికి తెర దించేశారు. ఈ కలయికకు కారణమైన వాళ్ళకు కృతఙ్ఞతలు చెప్పుకుంటూనే!
వాళ్ళను మరిచిపోతే ఎలా?
విడిపోయిన ఓ జంటను కలపటం అంటే మాటలు కాదు. మరో పెళ్ళి చేసినట్లే!అందులో వంద శాతం మార్కులు కొట్టేశారు ఆ దంపతులు. వారికి ఏమిచ్చినా ఋణం తీరదు.
* * *
ఆ రోజు ఏమీ ఆలోచించకుండా సాగర్ కొట్టాడన్న కోపంతో నాగుపాములా బుసలు కొడుతూ సూట్ కేస్ తో బయటపడింది కళ.
ఇంటి మెట్లు దిగుతోందే కానీ ఆ రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు ఆమెకు.
ఆ సమయంలో అనునయంగా ఓ చెయ్యి ఆమె భుజం మీద పడింది. అది ఎంతో ఓదార్పు నందించింది.
"చెల్లెమ్మా! " అన్న ఆత్మీయమైన పిలుపు అండగా నిలబడింది. అంధకారంగా మిగలబోతున్న తన చీకటి బ్రతుకుకు చిరుదివ్వెలై వెలుగు నిచ్చారు వాళ్ళు.
అందరిలా మనకెందుకు అని ఊరుకోలేదు వాళ్ళు. యాంత్రికంగా ఎవరికి వారే అన్నట్లు స్వార్ధంగా బ్రతకకుండా.. అందరూ మనవాళ్ళు, అందరి కష్టాలు మనవే అనుకున్నారు. ఆశ్రయం ఇవ్వటమే కాక, పట్టాలు తప్పిన ఆమె జీవితాన్ని మళ్ళీ గాడిలో పెట్టారు. ఆమెలో ఉన్న కోపాన్ని తగ్గించుకునే మార్గాన్ని చూపెట్టారు.
తమ మాటలతో చేతలతో ఆమెకు కనువిప్పు కలిగించారు. అసలు వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యాన్ని చూసిన ఏ జంటైనా అలా మారిపోవాలని తప్పక కోరుకుంటారు. వారు మరెవరో కాదు అనుపమ,అనురాగ్.
అనురాగ దీపాలు.
వారు తమ జీవితాన్ని కాంతులతో నింపుకోవటమే కాకుండా కష్టాల చీకట్లో కొట్టు మిట్టాడే ఎందరి బ్రతుకులలోనో దీపాలు వెలిగిస్తూనే ఉంటారు.
ఇప్పుడూ.. ఎప్పుడూ !
- యలమర్తి అనురాధ