Telugu Global
Arts & Literature

ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎవరు?

ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎవరు?
X

ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎవరు అన్న ప్రశ్న తరుచుగా ఎదురవుతూనేవుంటుంది. . చివరకు ఈ ప్రశ్నకు ” ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే, కాలక్రమేణా పిల్లవాడికి తన అవసరం లేకుండా చేసే వాడు” అన్నది సరైన సమాధానంగా భావిస్తున్నాను.

“Don’t give him a fish a day; teach him how to catch fish” అని చైనీస్ సామెత ఒకటి ఉంది. ఉపాధ్యాయుడు ఏం చేయాలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మేము చదువుకున్న కాలంలో గైడ్లు ఉండేవి కాదు. మేమే సొంతంగా నోట్స్ తయారు చేసుకునే వాళ్ళం. మా టీచర్లు కూడా దాన్ని బాగా ప్రోత్సహించేవాళ్ళు. పైన చెప్పిన సమాధానానికి నిదర్శనంగా ఓ యాభై ఏళ్ళ క్రితం (అంతకుముందు కూడా) నాతో పాటు స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.

యాభై ఏళ్ళ కిందటి పాఠశాల విద్యకు ప్రస్తుతం ఉన్న పాఠశాల విద్యకు ఉన్న తేడా ఏంటంటే. మార్కులు, ర్యాంకుల కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం. తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో ఎక్కువ కలుగజేసుకోవటం, ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ నాలెడ్జ్ ఉందని సమాజం మొత్తం భావించే పరిస్థితి ఉండటం. ఇదే ప్రస్ఫుటంగా కనిపించే తేడా. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు.

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినం సందర్భంగా అనుభవం లో ఉన్న కొన్ని కారణాలు ప్రస్తావిస్తాను.

ఒక ముఖ్యమైన కారణం. చాలా మంది టీచర్ వృత్తిన్ని ఒక ఐచ్చికంగా (choice) కాకుండా, ఒక అవకాశంగా (chance) భావించడం.. దాంతో అది ఒక ఉద్యోగ అవకాశం తప్ప ఇష్టపడి చేసే వృత్తిగా లేదు. దీనివల్ల సమస్య ఏమిటంటే ఉపాధ్యాయ శిక్షణ ఒక తూ తూ మంత్రం గా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఉపాధ్యాయుల ఎంపికలో అభ్యర్థులకు ఉన్న పరిజ్ఞానాన్ని, వారి జ్ఞాపకశక్తిని పరీక్షిస్తున్నారు తప్ప, వారి బోధనా సామర్థ్యాన్ని పరీక్షించడం లేదు. దాంతో వృత్తి పట్ల ఇష్టమున్న, మంచి ఉపాధ్యాయులు రావడం లేదు. ఒకప్పుడు ” బతకలేక బడిపంతులు” అనే నానుడి ఉండేది. ఇప్పుడు అలా కాదు మంచి జీతం వచ్చే టాప్ టెన్ ఉద్యోగాల్లో టీచర్ ఉద్యోగం కూడా చేరిపోయింది.

ఇక రెండో కారణం టీచర్లకి బోధన కన్నా ఇతర పనులు ఎక్కువ ఉండటం. గతంలో టీచర్లకి, బోధన, పిల్లల క్రమశిక్షణ పెంచడం, పిల్లల గురించి వారి అభివృద్ధి గురించి దృష్టి సారించడం మాత్రమే ఉండేవి. క్రమంగా మారిపోయిన విద్యావిధానంలో పేపర్ వర్క్ ఎక్కువ ,టీచింగ్ తక్కువ అయిపోయింది. దాంతో పాఠశాల విద్య కొంచెం బలహీనమైంది నూతన విద్యా విధానం మళ్ళీ కొంచెం ఆశాజనకంగానే కనబడుతోంది.కానీ వ్యక్తిగతంగా విద్యావిధానం కారణం అనేదాన్ని ఒప్పుకోను.

ఏ కాలానికి ఆ విద్యా విధానం ఉంటుంది. విద్యా విధానం మారవచ్చు కానీ, ఉపాధ్యాయుడు మాత్రం మారవలసిన అవసరం లేదు. ఉపాధ్యాయుడు ఎప్పుడూ ఉపాధ్యాయుడే!. బోధన పద్ధతులు మారవచ్చు కానీ, ఉపాధ్యాయుడు మారవలసిన అవసరం లేదు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలుచుకునే వాడే మంచి ఉపాధ్యాయుడు కదా?

ముందు చెప్పిన మార్కుల సంగతి చూద్దాం. మేం చదువుకుంటు

న్నప్పుడు పాస్(థర్డ్ క్లాస్) కావడమే ఒక పెద్ద విషయం. ఇప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని లేవు. అన్ని డిస్టింక్షన్ లే! ఎవరికైనా ఫస్ట్ క్లాస్ వస్తే కూడా చాలా బాధ పడతారు. నేను చదువుకున్నప్పుడు ఫెయిల్ అయిన వారికి కూడా కొంచెం డొక్కశుద్ధి ఉండేది.

ఇప్పుడు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు. దానికి కారణం పిల్లవాడి తప్పు కాదు. నిజానికి ఎవరి నోట్స్ వాళ్లే తయారు చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు స్కూలు కానీ, టీచర్లు గానీ నోట్స్ ఇస్తారు. ప్రైవేట్ స్కూల్లో అయితే ప్రింటు చేసిన నోట్స్ ఇస్తారు. అదే రాయాలి. సొంతంగా రాస్తే ఒప్పుకోరు.

నేను ఒక స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా పని చేసేటప్పుడు ఒక సారి పరీక్షల్లో నేను దిద్ది మార్కులు వేసిన పేపర్ పట్టుకొని ఒక పిల్లవాడి తండ్రి నా దగ్గరకు వచ్చాడు. “మీరు మా అబ్బాయికి తక్కువ మార్కులు వేశారు, వాడి ఫ్రెండ్ కి ఎక్కువ మార్కులు వేశారు. వాడేమో సొంతంగా రాశాడు. మావాడు స్కూల్లో ఇచ్చిన నోట్స్ లో ఉన్న సమాధానమే రాశాడు.” అని వాపోయాడు.

నేను రెండు పేపర్లు పరిశీలించాను. స్కూల్ నోట్స్ ప్రకారం రాసిన అబ్బాయి పేపర్ లో తప్పులు లేవు గానీ రొటీన్ ఆన్సర్ రాశాడు, ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లవాడు

సొంతంగా ఆలోచించి రాశాడు. అదీ విషయం

ఇలా చాలా సార్లు తల్లిదండ్రులు పిల్లల చదువులో ఇలా కలగ చేసుకుంటున్నారు, మార్కులకే ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు, పిల్లల్లో క్రియేటివిటీ పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణం!

విద్యారంగంలో ప్రైవేటీకరణ వల్ల చాలా మార్పులు సంభవించాయి. మార్కులు ర్యాంకుల పట్ల క్రేజ్ పెరగడం, పిల్లలు సొంతంగా ఆలోచించే పరిస్థితి లేకపోవడం వంటివి ముఖ్యమైనవి. ప్రైవేటీకరణ వల్ల టీచర్ ఉద్యోగాలు పెరిగాయ్. ఏ రంగంలోనైనా ప్రైవేటీకరణ వల్ల కలిగే ఇబ్బందులు విద్యా రంగంలో కూడా ఉన్నాయి.

ఇక వేగంగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలో కూడా చొచ్చుకు పోయింది. ఇది కంప్యూటర్ యుగం. ఇప్పుడు ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు ఒక భాగం. శాస్త్రీయంగా చూస్తే ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్ల వల్ల నష్టమే గాని లాభం పెద్దగా లేదు. ఇటీవలి కోవిడ్ నేపథ్యంలో ఉపాధ్యాయుల పని కొంచెం కష్టమే అయింది. పిల్లలు కూడా ఇబ్బందే పడుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే సాంకేతికత పిల్లవాడి జీవితంలో భాగం అయితే జరిగే నష్టాలు లో మొదటిది, స్వయంగా ఏ పనైనా చేయగల, స్వయంగా విషయపరిజ్ఞానం పెంచుకోగల సామర్థ్యాలు తగ్గిపోతాయి. చిన్న వయసు నుంచే డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది.

అయితే టెక్నాలజీని రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. జాగ్రత్తగా వాడితే మంచిదే. అయితే ఉపాధ్యాయులు కూడా టెక్నాలజీని ఒడిసి పట్టుకోవాలి. అది కొంచెం కష్టమే. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లు ” A student is a student till he is a student, but a Teacher is a student forever” అన్న విషయం గుర్తు పెట్టుకుని తనని తాను టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకోగలిగితే కొంతవరకు మంచిదే.

ఇక 21 వ శతాబ్దపు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలన్నది ఒకసారి చూద్దాం. “Technology has changed the way we view the role of contemporary teacher, from transmitter of knowledge to navigator or 21 century skills” “సాంకేతిక పరిజ్ఞానం సమకాలీన ఉపాధ్యాయుడిని పరిజ్ఞానాన్ని అందించే భాండాగారం కాకుండా, 21వ శతాబ్దపు నైపుణ్యాల వైపుకి పిల్లలను నడిపించే మార్గ దర్శకుడిగా మార్చేసింది”

ఈ శతాబ్దపు ఉపాధ్యాయుడికి కావాల్సిన అర్హతలు ఇలా ఉండే అవకాశం ఉంది. “నీతివంతమైన, బాధ్యతాయుతమైన, తెలివైన, భావి నాయకులను ప్రభావితం చేయగలిగిన నేర్పు కలిగి,అనంతమైన ఓర్పు సహానుభూతి, నిరంతరం నేర్చుకోవాలన్న తపన, అనంతమైన శక్తి, వినోదంతో కూడిన మార్గనిర్దేశకత్వం”.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుడు 21వ శతాబ్దపు ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలను పెంపొందించే దిశగా, వడివడిగా అడుగులు వేయవలసిన అవసరం ఉంది.అలా విద్యాగురువులు రూపొందుతారని ఆకాంక్షిద్దాం .

- సి.ఎస్.సలీమ్ భాషా

First Published:  5 Sept 2023 7:32 PM GMT
Next Story