తెల్లకాగితం (కవిత)
నేనో "తెల్ల కాగితాన్ని "
మంజుల మనోజ్ఞ అక్షరాలు
నా పైన వ్రాలాలని
గతకాలపు శిలాశాసనాలు
నాచెక్కిళ్ళలో చెక్కాలని
అక్షరాలు అల్లుకొని
చిలుకా గోరింకల్లా
నా ఎదపై ప్రేమ కావ్యం అల్లాలని
ప్రపంచానికి శాంతి సందేశం
నా అధరామృతంలో ముంచి లిఖించి
ఆకాశాన విహరించె పావురాలతో దండోరా వేయించాలని
వీరుల పౌరుషానికి
వీరరసం రంగరించి
దట్టించి వ్రాయాలని
అన్వేషణల అర్ధాలకు నిగూఢరహస్యాలకు
నిఘంటువు కావాలని
భక్తి తత్వాన్ని తార్కిక ఆలోచనలను
గీతాచార్యుడినై బోధించాలని
కన్నీళ్లతో దాహం తీర్చుకుంటున్న
అభాగ్యుల పాలిటి
ఆపన్నహస్తాలకు
అమరత్వం
ద్విగుణీకృతం చేయాలని
బాధే తెలియని శోకం ఎరుగని
లోకంలో పాటై పల్లవించాలని
ప్రపంచాన్ని సుఖమయం చేసి
బృందావన విహారం చేయించాలని
వ్రాసే కలాల కొరకు గీ
సే కుంచెల కోసం
ఎదురు చూస్తున్నా
ముద్దులతో ఎప్పుడు తడిపేస్తుందో హత్తుకొనే సిరా అని
అరమోడ్పు కన్నులతో
వేచిచూస్తున్న
తెల్ల కాగితాన్ని
- కేశరాజు వేంకట ప్రభాకర్ రావు