ప్రవాసి
BY Telugu Global21 Feb 2023 8:45 PM IST
X
Telugu Global Updated On: 21 Feb 2023 8:45 PM IST
ఒడ్డు తెగి చాలాకాలమైంది
ఒడ్డు మారి కూడా
దశాబ్దాలు దాటింది
అయినా అమ్మ నేలమీద ప్రేమ
అణువంతయినా తగ్గదు
ఆదరించిన నేల
అన్నీ ఇచ్చింది
బ్రతుకు ఫలాలను అందుకోవడానికి
పెరిగెత్తడం నేర్పింది
కానీ తప్పటడుగులు వేసిన నేలే
ఎప్పటికీ తలపుల్లో నిలుస్తుంది
ఈ నేలే కాదు
ఇక్కడి ఆకాశం కూడా
అపరిచితంగా తోస్తుంది
ఉదయించే సూర్యచంద్రులు
వాడిన వస్తువుల్లా కనిపిస్తారు
ఎక్కడెక్కడికో వెడతాము
రెక్కలొచ్చిన కలలా ఎగురుతాము
కానీ కనులుమూసుకున్నప్పుడు
చిన్నప్పటి నేస్తం ముఖమే
కలలో పలకరిస్తుంది
ఏదో ఒకనాటికి
నేనూ ఈ నేలక్రిందే నిదురిస్తాను
అనంతశయనంలో కూడా
బహుశా
అక్కడి మట్టి వాసనలే
విడవకుండా నన్ను వెంటాడుతాయి
- విన్నకోట రవిశంకర్ (అమెరికా)
Next Story