‘మరణం ఒక కామా’ అనగలిగిన స్థితధీరుడు వాకాటి పాండురంగారావు (ఏప్రిల్ 18 వాకాటి వర్థంతి )
వాకాటి పాండురంగారావుగారు ఒక నడుస్తున్న విజ్ఞానసర్వస్వం. ఆయన చదవని సంగీత సాహిత్య రాజకీయ ఆర్థిక శాస్త్ర సాంకేతిక గ్రంథం లేదేమోనన్నంత అత్యంత రాశీభూత అధ్యయనం ఆయనది. ఆ మేధ ఒక పెద్ద Think tank.
ప్రాచ్యపాశ్చాత్య వాజ్మయాన్ని మధించిన మనోధర్మం ఆయనది. అగాథాక్రిష్టీ గురించి చెప్పినా, ఆదిశంకరుల తత్త్వబోధని పలికినా ఆ విషయ వివరణకు తిరుగులేని సాధికారత. ఆయన బహుముఖీన వ్యక్తిత్వపట్టకంలోని ఒక మెరుపు--
మాటలో శషభిషలు లేని ముక్కుసూటితనం. మనసులో మహాసముద్రమంత మానవీయ విలువల పరిరక్షణ వాంఛ. ఆప్యాయతను పంచటంలో ఆ పలుకు చల్లదనం, ప్రతిభను గుర్తించటంలో ఆ చూపు నైశిత్యం అసామాన్యమైనవి. అవి అనుభవైకవేద్యం!
వాకాటి వారి జీవితం గులాబీపూలశయ్య ఏమీ కాదు. దుర్భరమైన ఇక్కట్లమయం. ‘స్వయంకృషి’కి మూర్తిని చూపమంటే ఆయన్ని చూపవచ్చు. ఆంధ్రాంగ్లాల్లో ఆ‘పట్టు’ అసాధారణమైనది. అపారమైన ఆత్మ విశ్వాసాన్నీ, ఆశాభావ దృక్పథాన్నీ సాధించుకున్న అసమాన ధీరుడు ఆయన.
పాత్రికేయుడుగా వాకాటి వారిది-కామత్, చలపతిరావు, ఖాసా సుబ్బారావు, కోటంరాజు రామారావు వంటివారి స్థాయి. నన్నడిగితే, ఒక పిసరంత ఎక్కువే. ఆయన సంపాదకీయాల్లోని వాక్యసరళిలో తగిలీతగలని పూలతాకు వ్యంగ్యం- ‘వాకాటి ముద్ర’. ప్రకాశం గారి ‘ప్రజాపత్రిక’ నుండి, ఆనందవాణి, తెలుగు స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, జ్యోతి, ప్రజాతంత్ర, ఈనాడు, ఆంధ్రప్రభ వీక్లీ వరకూ- అనేక తెలుగు పత్రికల్లో ఆయన పనిచేశారు. కొన్ని ఆంగ్ల పత్రికల సంపాదకవర్గంలోనూ ఉన్నారు.
కథకుడుగా వాకాటివారిని తలచుకోగానే- వారి ‘బి’ పౌరుడు, రెండు రెక్కలువాడు, సృష్టిలో తీయనిది, ఆర్.చక్రారావు, కరి మింగిన వెలగపండు వంటి గొప్ప కథలు గుర్తుకొస్తాయి. సెటైర్ రచనలో ఆ కలం బలం ఆస్వాదించాల్సిందే!
నాకు 1965లో వాకాటివారితో తొలి పరిచయం. బందరు వచ్చారు. ఊరికే రాలేదు. భానుమతీరామకృష్ణగారి ‘అత్తగారి కథల’కు ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ అవార్డు పట్ల నిరసన ప్రకటన పట్టుకొచ్చారు. సంతకాలసేకరణ. పార్కులో కూచున్నాం. భ.జ.రా, సింగరాజు రామచంద్రమూర్తి, ఆదివిష్ణు, చందు సోంబాబు, విహారి & శాలివాహన, నందం రామారావు... చాలామందిమి ఉన్నాం. పెద్ద చర్చే జరిగింది. చివరికి సంతకాలేవీ కాలేదని గుర్తు. భజరాగారి పెద్దమనిషి సలహా అనుకుంటాను. అప్పుడు వాకాటివారు ఢిల్లీలో ఉన్నట్టు జ్ఞాపకం. తిరిగి వెళ్లిన తర్వాత-ఎందుకనో మరి- నాకొక్కడికే ఉత్తరం రాసి ‘అపరాజిత’ ‘ద్వాదశి’ కథాసంపుటాలు పంపారు. ఆయన కుమార్తె పేరు అపరాజితే! ఆ పుస్తకాలు చదివి ఆయన కథా కథన నైపుణ్యానికి మరోసారి కైమోడ్చాను.
ఆ తర్వాత, వాకాటి వారిని చూడటం మళ్లీ 1994లోనే. వేదగిరి రాంబాబు, రచన శాయి , సాధన నరసింహాచార్య ల సంయుక్త నిర్వహణలో జరిగిన మొదటి కథానికా సదస్సులో ఆయన పాల్గొన్నారు. సుమారు వందమంది రచయితలే వచ్చారు అప్పుడు. ఆ సదస్సుకు నేను సమన్వయకర్తగా వ్యవహరించాను. ఆ తర్వాతి వారం ప్రభ వీక్లీలో వారి సంపాదకీయం- ‘మిత్రవాక్యంలో విహారి ‘పౌరోహిత్యం’ వహించారని భాషణ చాతుర్యంతో పేర్కొన్నారు. అదొక విశేష విషయంగా సంచలనమైంది. అదీ వాకాటివారి రచనా శైలి!
వాకాటివారు తెలుగు సాహిత్యరంగంలో అత్యంత గౌరవాస్పదులైన రచయిత. మునిపల్లెరాజుగారు, మధురాంతకం రాజారాం, భ.జ.రా, బలివాడ కాంతారావు వంటి ఎందరెందరో మహారచయితలకు వారు అభిమానపాత్రులు. మరెందరో మావంటి వారికి గురుస్థానీయులు.
వారు ఆంధ్రప్రభ వీక్లీకి ఎడిటర్ గా ఉన్నప్పుడు నేను - పత్రికకు కథ పంపలేదు. ఒకటిరెండుసార్లు ‘ఏదీ మీ కథ?’ అని అడిగితే ‘మీరంటే భయం సార్.. రాయను’ అంటే ‘మంచిదే’ అనేవారు!!
1970లో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు చేపట్టిన ‘ఆదాన్ ప్రదాన్’ కార్యక్రమం కింద ‘కథాభారతి’ తెలుగు కథానికలు సంకలనాన్ని పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారి సహసంపాదకత్వంలో సమకూర్చారు. వేసిన అన్నికథలూ అపూర్వమైనవిగా ఉన్న గొప్ప కథా సంకలనాల్లో కథాభారతి ఒకటి. గోపీచంద్, చలం, పా.ప, బుచ్చిబాబు, కొ.కు. రావిశా, తిలక్, చాసో వంటి వారి సరసన ఆదివిష్ణువంటివారి మరీమంచి కథలూ ఇందులో వున్నాయి. 1998లో కేంద్ర సాహిత్య అకాడెమీవారికి డా. వేదగిరి రాంబాబు సహసంపాదకత్వంలో 60 కథలతో ‘బంగారు కథలు’ సంకలనాన్ని అందించారు. ఆ సంకలనంలో నా కథ ‘గోరంతదీపం’ ని ఎన్నిక చేశారు. ‘ఏ విశ్వనాథ్ లాంటి వారో సినిమా తియ్యాలి’ అనేది ఆ కథకు వారి కితాబు!
అస్వస్థతతో వుండి కూడా ‘అరవై అద్దాలు’ పేరుతో నిఖార్సయిన ముందుమాట రాసారు. దాన్ని చదివితే వారు ఎంత ప్రజ్ఞావంతులో, రచనాచణులో తెలుస్తుంది. విశ్లేషణాత్మకంగా వ్యాసాలు పఠించే విజ్ఞులకు కథ ఆత్మని రెండు లైన్లలో వ్యక్తీకరించటం అనే శిల్పవిద్య దానిలో కనిపించి ఆశ్చర్యపరుస్తుంది.
1999లో వారు మరణించిన తర్వాత వారి కుటుంబసభ్యులు జాగృతి వారపత్రికతో కలిసి ప్రతిఏటా వాకాటి పాండురంగారావు స్మారక కథానికల పోటీని నిర్వహిస్తున్నారు. ఆ పోటీలో ఒకసారి ద్వితీయ బహుమతినీ, మరొకసారి విశిష్ట బహుమతినీ పొందటం నాకు ఆనందదాయకమైన సంభవం.
‘వాకాటి తెలుగుజాతి కోసం, భారతీయ ఉత్తమ తాత్త్వికచింతన కోసం - కలంపట్టిన ధర్మకర్త’ అన్నారు కథారుషి మునిపల్లెరాజుగారు.
వాకాటివారి రచనల్ని చదివి ఆ వాక్యంలోని సమగ్రతని అర్థంచేసుకోవటమే వారికి సముచితమైన నివాళి అవుతుంది!!
- విహారి