Telugu Global
Arts & Literature

కవిగా కలలుకనూ

కవిగా కలలుకనూ
X

చన్ను నోట్లో పెట్టుకొని

పాలు తాగుతున్న బిడ్డలా

కవిత్వం చదువు !

ప్రేయసి ఒడిలో తలవాల్చి

సల్లాపాలు అనుభూతిస్తున్నట్లు

కవిత్వం ఆస్వాదించు !

ఆత్మగల్ల మిత్రునితో

బతుకులోతుల్ని తొర్లిచ్చుకున్నట్లు

కవిత్వం అంతరంగాన్ని తట్టు !

కళ్ళెదుట

అహరహం పనులై

అరుగుతున్న చేతులకు

అవస్థలై

కన్నీరవుతున్న గుండెలకు

తడితడిగా అక్షరాలు తొడిగి

కవిత్వం చేయు !

న్యాయం దెబ్బతిని

ఆవెదనైన చోట

ఆగ్రహమైన చోట

తుకతుక ఉడికి

సలసల కాగి

పదునైన పద్యాన్ని చేయు !

పరవశమో పండుగో

పథమై వచ్చిన్నాడు

అమ్మచేసిచ్చే పాయసంలా

ఓ కమ్మని పాట చేయు !

ఎముక విరిగి

అపసోపాలు పడుతున్న మనిషికి

వైద్యుడు కట్టు గట్టినట్టు

ఓ కవితగట్టు !

దారి తప్పి

ఆగమాగమవుతున్న మనిషికి

కాగడాలాంటి ఓ కవితనివ్వు !

మట్టిని అన్నం చేసి ఇచ్చే రైతులాగే

కళ్ళముందరి మనుషుల

కష్టసుఖాలనే కవిత్వం చేయు !

కవితా వేదికలు

కవన పోషక కేంద్రాలు

అభినందన పత్రాలు

ఎక్కడో లేవు !

ఇంట్లోనే

అమ్మానాన్నల్ని అద్దంల చూపి

ఆనందపరవశుల్ని చేయు

తట్టలు మోస్తున్న వీపులు

నిటారుగా నిలబడేలా

టానిక్ లాంటి కవితల చేయు

నిరుద్యోగి నిట్టూర్పుని ఒదిలేసి

ధైర్య వచనమయ్యేలా

ఓ జెండాలాంటి కవితను జేసి ఇవ్వు !

చప్పట్లు

దుప్పట్లు అన్నీ ఆన్నే దొరుకుతై !

కలలోను

మెలుకువలోను

కవిత్వం కనూ

బరబ్బరిగా కవివై పోతవు

-ఏలేశ్వరం వెంకటేశ్

First Published:  4 April 2023 1:13 PM IST
Next Story