Telugu Global
Arts & Literature

నువ్వు మనిషివే గదా? (కవిత)

నువ్వు మనిషివే గదా? (కవిత)
X

కడుపు నింపే పళ్ళ చెట్టును చూసి

బుద్ధి తెచ్చుకో !

నీడ నిచ్చే మర్రి చెట్టును చూసి

మనసు మార్చుకో!

గలగల పారే నదులను

ఆలింగనం చేసుకో!

మాగాణీ భూముల్ని పండించి

సిరుల పంటల్ని నీకిస్తోంది

మేఘాలు ఏమి చూసి

వర్షాన్ని కురిపిస్తున్నాయి?

గాలికేమి తొందర?

క్షణం క్షణం నిన్ను బ్రతికిస్తూ

పరుగులు పెడుతోంది

అడవులెందుకు నిన్ను

రమ్మని పిలుస్తున్నాయి?

పచ్చని ప్రకృతి నీ కెందుకు

అన్ని కానుక లిస్తోంది?

సముద్రాలను ఎందుకు

మధిస్తున్నావు ?

అడగక పోయినా ఎంతో

మత్స్య సంపద నీ పరం చేస్తోంది

ఖనిజాల కోసం కొండల్ని

పిండి చేస్తున్నావు

ఇసుక మేటల్ని అమ్ముకొంటున్నావు

అడవుల్ని తెగ నరికేస్తున్నావు

వృక్షాల గుండెల్ని రంపపు కోతతో

బలి చేస్తున్నావు

అభివృద్ధి పేరుతో

చెరువుల్ని కబళించావు

నదుల్ని మాయం చేశావు

జీవ వైవిధ్యానికి తూట్లు పొడిచావు

ఆకు లేని చెట్లు

ఎండి పోయిన తొర్రల్లో

పక్షుల కళేబరాలు

మూగగా రోదిస్తున్నాయి

తిండి లేక జంతువులు

నగర బాట పడితే

మనిషివి నువ్వు

మృగమై పొయ్యావు

స్వార్థ పిపాసీ !

నువ్వు మృగానివి కాదు గదా?

మనిషివే గదా?

-వారణాసి భానుమూర్తి రావు

(హైదరాబాదు)

First Published:  23 July 2023 12:48 AM IST
Next Story