ఆశంస
ఈ మలుపు దగ్గర
నన్ను నేను అంచనా కట్టుకోనీ
గడిచిన రోజుల నిండా
నడిచి వచ్చిన దూరాలలో
సుఖ దుఃఖ తీరాల నడుమ
హెచ్చ వేసుకున్న కలలూ
కూడిక చేసుకున్న కన్నీళ్లూ
తీసి వేసుకున్న బాధలతో
నా ఉత్సాహాలనూ ఉద్వేగాలనూ భాగాహారం చేసుకున్నాక
శేషం గా మిగిలిన
శూన్యాంకం నుంచి
నా నిలకడనూ
నిండుదనాన్నీ లెక్కించనీ
నా లోటును గుర్తించనీ...
ఈ విరామం నుంచే మళ్లీ
అనంతకాల రేఖల మీద పరుగందుకోవాలి
ఊరేగి వచ్చిన ఉత్సవం చివర
తగిలించుకున్న ఆభరణాలనీ ఆహార్యాలనూ ఒలిచేసుకొని
చుట్టుకుని చంకనెక్కిన
సమస్త కాలుష్యాలనూ
కడిగేసుకుని
స్వచ్ఛంగా సత్యంగా
నన్ను నేను ఆవిష్కరించుకోనీ
మళ్లీ ఈ కాలం నీటి పాయల మీద
మంచు కడిగిన మల్లెలా
ప్రయాణం కట్టాలి.
ఊహల కొమ్మల మీది
చిగురాకుల ఒడిలో
చినుకు సంతకాన్నై
వన్నె వన్నెల పూల కలలను
రెప్పల దొన్నేల్లోకి ఎత్తుకోవాలి
వడగాడ్పులకు
ఈదురు గాలులకు
చెదరని సంకల్పాన్నై
నన్ను నేను నిబ్బరించుకోవాలి.
వేకువ వెలుగులలో తడిసి
ప్రశాంత జీవన సౌందర్యాల లోకి
ఈ కొత్త ఏటి కొమ్మల మీదికి
ఏరువాక పాటనై ప్రవహించాలి.
కాలం పుటల్లో
కమనీయ ఆప్త కవితా పంక్తినై
నా నడకను ధృవీకరించే
వాక్యాన్నై నిలిచిపోవాలి.
స్నేహ పరిమళాన్నై
జీవించాలి
- వఝల శివకుమార్