Telugu Global
Arts & Literature

జీవితంతో లాటరీ (కథ)

జీవితంతో లాటరీ (కథ)
X

‘‘అబ్బా,ఎన్నిసార్లు చేసినా వీడి ఫోన్‌ బిజీ వస్తోందే.’’అనుకుంటూ మరోసారి ఫోన్‌ చేశాడు సుబ్బారావు. ఫోన్‌ రింగ్‌ అయింది అతని మొహం షైన్‌ అయింది.

అవతలి వ్యక్తి ఫోన్‌ ఎత్తుతూనే,‘‘హ్హి హ్హి హ్హి, చూశాను, ఈసారి కూడా నీకు ఏమీ రాలేదు’’ చెప్పాడు ఆ వ్యక్తి.

‘‘ఆస్తమాను ఇదే చెప్తావా’’ అని సుబ్బారావు ఇంకేదో చెప్తుండగానే ఫోన్‌ కట్‌ అయింది

‘‘ఛ ఛ ,నా దురదృష్టం దోసకాయంత ఉంటే, అదృష్టం ఆకాకర కాయంత ఉన్నట్టుంది.అయినా ఆ శేఖరంలాగా అందరూ ఉన్నపళంగా అదృష్టవంతులు కాలేరు, రాత ఉండాలి.లేకపోతే, నాతో కలిసి చిన్నచిన్న పెయింట్‌ పనులని జాయింట్‌ గా చేసేవాడు కాస్తా, పది కోట్ల లాటరీ తగిలి జైంట్‌ లా ఎదిగి, కోటీశ్వరుడు అయిపోయాడు. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లాంటి ఇల్లు కట్టాడు,ఫిల్మ్‌ స్టార్లు తిరిగే కార్‌ కొన్నాడు. నేనూ వాడితో పాటే బోలెడు లాటరీ టికెట్లు కొన్నాను, కొంటున్నాను కూడా. ఆ మాటకు వస్తే, వాడికి లాటరీ టికెట్లు కొనమని సలహా ఇచ్చి చచ్చిందే నేను.ఆ కడుపుమంటతోనే వాడి ఇంటి గృహప్రవేశానికి వెళ్ళినా బోజనం చేయకుండా వచ్చేసాను,కానీ మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది.భోజనం మీద అనుకునేవు మట్టి బుర్రా, ఆ భవంతి మీద’’ అంటూ పక్కకి చూసి,‘‘తింటున్నావా, వింటున్నావా’’ అడిగాడు అతని భార్య లక్ష్మమ్మతో.

‘‘చేగోడీలు తింటూ వింటున్నాను,’’అని ఆమె అంటుండగానే, ఫోన్‌ వచ్చింది.ఆమె, ఫోన్‌ వైపు చూస్తూనే చిన్న నవ్వుతో, ‘‘నూరేళ్లు, మన శేఖర్‌ అన్నయ్యే ఫోన్‌ చేశాడు ,ఇదిగోండి’’ అంటూ ఆ ఫోను సుబ్బారావుకి అందించింది.

లోన మంటగా ఉన్నా,పైకి చల్లగా, ‘‘ఆ శేఖరం ఎలా ఉన్నావు.’’అడిగాడు సుబ్బారావు.

‘‘అంతా ఒకే రా.అయితే, కాశీ దర్శించి ఇవాళే వచ్చాను, రెండ్రోజుల్లో అయోధ్య వెళ్తాం.నిన్ను చూడాలనిపించింది,ఓ సారీ ఏదైనా పెయింట్లు కొనే పనిమీద గట్రా ఇటువైపు వస్తే, మా ఇంటికి రా. అలానే లక్ష్మి ని కూడా తీసుకురా’’ చెప్పాడాయన .

‘‘సరేరా తప్పకుండా’’ అని ఫోన్‌ పెట్టేసాడు సుబ్బారావు.

మరుసటి రోజు సుబ్బారావు , సతీసమేతంగా శేఖరం ఇంటికి వెళ్ళాడు.

శేఖరం, కుశల ప్రశ్నలూ అవీ అడిగాడు. ఇంతలో పనిమనిషి వచ్చి,సుబ్బారావుకి, అతని భార్య లక్ష్మమ్మకి కూల్డ్రింకులు, తినడానికి కొన్ని బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది. ఆ బిస్కెట్లు తీసుకున్న సుబ్బారావ్‌ ‘‘ఛ ,ఒకప్పుడు వీడికి నేను,టీ బిస్కెట్లు కొనిపెట్టేవాడ్ని, అలాంటిది వీడి పనిమనిషితో నాకు బిస్కెట్లు ఇప్పిస్తున్నాడు. అయినా ఎంత కాలం? నాకూ లాటరీ రానీ,అప్పుడు వీడి మొహాన గోల్డ్‌ బిస్కెట్లు పడేస్తా’’ అనుకున్నాడు మనసులో.

బిస్కెట్లు పర,పరా నవులుతూ,పరాగ్గా ఆలోచిస్తున్న శేఖర్‌ వైపు దీర్ఘంగా చూసి, ‘‘ఏంటి అలా ఉన్నావ్‌’’అడిగాడు అనుమానంగా.

‘‘ఏం చెప్పమంటావ్‌ సుబ్బారావ్‌, ఇదివరకు జీవితమే బాగుందనిపిస్తోంది . ఈ దిక్కుమాలిన లాటరీ వచ్చాక ఆన్నీ సమస్యలే’

‘‘లాటరీ వస్తే సమస్యా, హాస్యం కాకపోతే’’ నవ్వాడు సుబ్బారావ్‌

‘‘మరేవనుకున్నావ్‌, లాటరీ వచ్చాక సౌకర్యాలు పెరిగాయి.ఇంట్లో పనిమనుషులు అన్నీ చేతి దగ్గరకే అందిస్తున్నారు.దాంతో సంవత్సర కాలంగా మా ఆవిడ ఏ పని చేయకుండా,ఇంట్లో సున్నుండలా ఉండిపోయి, ఎన్నో మొండి ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంది .ఇప్పుడు రోజూ గుప్పెడు మాత్రలు మింగుతూ, హాస్పిటల్‌కి ఇంటికి అప్పెండౌన్‌ చేస్తోంది. ఇక నాకొడుకు, ఒక్కసారే అంత ఆస్తి రావడంతో, చదువుపై శ్రద్ధకి శ్రద్దాంజలి ఘటించాడు. జల్సాలూ, ఫ్రెండ్స్‌ తో తిరుగుళ్ళలో ముందుండడంతో, చదువులో బాగా వెనుకబడి పోయాడు. చేసేదిలేక పేమెంట్‌ సీట్‌ కొని ఎంబిబిఎస్‌ లో జాయిన్‌ చేశాను. అయినా తీరు మారలేదు. వాడు ఆ చదువు పూర్తి చేస్తాడనే నమ్మకం నశించి పోతోంది. మరో పక్క బంధువులంతా మాకేం పెట్టలేదు, చేయలేదు అంటూ నన్ను వాడిగా, వేడిగా ఆడిపోసుకుంటున్నారు. పోనీ కాస్తోకూస్తో పెడుతూ పోతే, మా ఆవిడ, కొడుకు నన్ను బతికుండగానే బోయిల్‌ చేసుకు తినేస్తున్నారు. ఇలా చుట్టాలు, స్నేహితులు తగ్గిపోయారు.ఒక్క సారె ఎవరో మంత్రం వేసినట్టు,జీవితం యాంత్రికం అయిపోయింది. ఏదో సాధించాలి అనే తపన కాస్తా టపా కట్టింది’’. చెప్పాడు శేఖర్‌.

తర్వాత కొద్దిసేపటికి శేఖరం దగ్గర శెలవు తీసుకుని,భార్యతో ఇంటికి తిరిగి వచ్చేస్తున్న సుబ్బారావుని ,ఒక షాపు వాడు చూసి, ‘‘లాటరీ టికెట్లు కొనకుండా వెళ్ళిపోతున్నావ్‌! మర్చిపోయావా’’ అడిగాడు.

అతనివైపు అసహనంగా చూసిన సుబ్బారావు, జేబులో ఉన్న లాటరీ టికెట్ల చించి పక్కన పడేసాడు.

తర్వాత, ‘‘లక్ష్మి నువ్వు బస్సెక్కి ఇంటికి వెళ్ళు, నేను ఇక్కడ ఓ ఓనర్‌ గారితో మాట్లాడి వచ్చేస్తాను’’ చెప్పి,ఆమెని బస్టాప్‌ లో దిగబెట్టి వెళ్లిపోయాడు.

అతను వెళ్లడం ఆలస్యం అన్నట్లు,శేఖరానికి ఫోన్‌ చేసి, ‘‘సారీ అన్నయ్య, ఆయనకి రోజురోజుకీ లాటరీ పిచ్చి పెచ్చు పెరిగిపోతోంది. నీకు లాటరీ వచ్చినప్పటి నుండి ఆ పిచ్చి పదింతలు ముదిరిపోయింది.కష్టపడి సంపాదించిందే కాక,అప్పు చేస్తూ మరీ లాటరీ టికెట్లు కొని తప్పు చేస్తున్నారు.ఇలా అయితే ఇల్లు గుల్లయ్యి రోడ్డున పడతాం. అందుకే నిన్ను అలా చెప్పమన్నానన్నయ్యా.’’ చెప్పిందామె.

‘‘సారి అవసరం లేదమ్మా,ఎందుకంటే, నేను చెప్పింది పూర్తి అబద్దం కాదు’’ చెప్పి ఫోన్‌ పెట్టేసాడాయన.

ఆలోచనలో పడింది లక్ష్మి

- వడ్లమన్నాటి గంగాధర్

First Published:  24 Aug 2023 1:40 PM IST
Next Story