Telugu Global
Arts & Literature

పండుటాకు పరిమళం (కథ)

పండుటాకు పరిమళం (కథ)
X

ఒకసారి మనిషి....

కోకిలతో అన్నాడు.. నువ్వు నల్లగా లేక పోతే ఎంత బాగుండేది?

సముద్రంతో అన్నాడు... నువ్వు

ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది??

గులాబీ తో అన్నాడు ... నీకిలా ముళ్ళులేకపోతే ఎంత బాగుండేది???

అప్పుడు ఆ ముగ్గురూ మూకుమ్మడిగా ఇలా అన్నారు.

"ఓమనిషీ! నీలో ఇలా లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండే వాడివోకదా !'

అమృతరావుకి ఎక్కడో పుస్తకం లో చదివిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ఇప్పుడు ప్రస్తుతమో లేక

అప్రస్తుతమో తెలియదుతనకు అయినా స్పురణకువచ్చాయి. కనుక మరల మరల నెమరు

వేసుకుంటున్నాడు.

'అవును. నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోయి ఉంటే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండగలిగేవాడివోకడా!'

అమృతరావు కి మహదానందంగా అన్పిస్తోంది. ఒక్కసారిగా బస్సు డ్రైవరు సడన్ బ్రేక్ వేయడంతో

ఉలిక్కి పడ్డాడు. క్రిందకు పడబోయి తమాయించుకున్నాడు. తనతో బాటు నుంచున్న తోటి ప్రయాణీకుల పరిస్థితి అలాగే ఉంది.

కాకబోతే వారందరికన్నా వయసులో చాల ముసలివాడు తాను.

"అవి సీనియర్ సిటిజన్స్ కి కేటాయించిన సీట్లు. మీరు లేచి తాతగారికి సీటు ఇవ్వాలి. వెనుక సీటులోని అమ్మాయి అందరూ అదిరిపోయేలా అంటోంది.

' వరుస బాగానే ఉంది. కాని

మీరులేచి తాతయ్యకి.. అదే తాతయ్య అంకుల్ కి సీటు ఇవ్వవచ్చును

కదా! "ఆ కుర్రాడు దేనికీ తగ్గడం లేదు. తాను ఏమీ తక్కువ తినలేదంటూ ఆమెకు కౌంటర్ ఇస్తున్నాడు.

'ఇది మహిళామణులకు కేటాయించిన సీటండీ! నేను నేటి మహిళను"

ఆవిడ మాటలలోని దర్పం అందర్నీ అబ్బురపరుస్తోంది. కుర్రాడు కనికరించడం లేదు. సీటుకు అంటి పెట్టుకుపోయి ఉన్నాడు.

'ఏమండీ! కండక్టరు గారూ, ఇది ప్రభుత్వం వారు నడిపేబస్సా!!లేక

రోడ్డు మీద తిరిగే ఆటోరిక్షానా... '

గవర్నమెంట్ వారి నియమాలు పాటించరా! పాపంపెద్దాయన నుంచోలేక ఆపసోపాలు పడుతుంటేను!!! ఆవిడమాటలు దృఢంగానే ఉన్నాయి.

* ఖాళీ చేసి వెంటనే సీటు పెద్దాయన కీయవయ్యా! అసలే ఇది

సెల్ఫోన్స్ యుగం. ఫొటోలు తీసి

వాట్సప్ గ్రూపులలో పోస్టు

చేశారంటే మంటమాకు తగులు కుంటాది.' కండక్టర్ మాట మాటలాగాలేదు కేకలాగా ఉంది.

మొత్తానికి ఆకుర్రాడికి బస్సులో సీటు రిజర్వేషన్ పాలసీని

పాటింపక తప్పింది కాదు. సీటులో కూలబడిన అమృతరావుకి కొంత

సదుపాయంగా అనిస్తోంది. తన వెనక నిలిచి వత్తాసు పలికిన అమ్మాయి వైపు కృతజ్ఞతగా చూశాడు. బస్సు వేగంగా నడుస్తోంది. బయ్యవరం వెళ్ళి చాలా

కాలమయింది. చెప్పాలంటే తనకు వెళ్ళినట్లు గుర్తుకురావడంలేదు కూడాను.మరల అనివార్యం అనుకొని ఇప్పుడు వెళుతున్నాడు. కాసింత అలసటగా

అన్పించడం తో అలా కళ్ళుమూసుకున్నాడు.

రంగారావుకి గొప్ప సంతోషంగా ఉంది. పిలిచిన పేరంటానికి అందరూ

తరలివచ్చేశారు. తన బంధువులు అందర్ని అలా చూసుకుంటే మహదానందం

అన్పించి పొంగిపోతున్నాడు. ఒక కలిమి తాలూకు సంతోషకరమైన

అనుభవం ఇది. ఎంతగానో అది ప్రభావితం చేస్తోంది.

శ్రీలక్ష్మికి కూడా కాస్త అటు ఇటుగా అలాగే ఉంది. కానీ అల్లుడు ఇంకా

రాలేదన్న ధ్యాస తప్ప అంతా బాగానే అన్పిస్తోంది. భర్తమరో నాలుగు రోజుల్లో

రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆరోజున యోవత్ కుటుంబము ఇక్కడ కలుసు

కోవాలని అందర్నీ ఆహ్వానించడం జరిగిపోయింది.

కూడ తీసుకోమంగా

ఒకవైపు రంగారావుకి చాల గుబులుగా అన్పిస్తోంది. ముప్పైఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి

చేశాడు. చెప్పాలంటె ఎక్కడా ఎవరి దగ్గరా చిన్న మెమో కూడా తీసుకోకుండా చాల హుందాగా ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నాడు.

ఇప్పుడు రిటైర్ అవుతున్నాడు. లోలోపల ఒకతెలియని ఆవేదన మనసునువెంటాడుతోంది. కానీ ఇంటికి అందరూ విచ్చేశార…

వెంట తెచ్చుకున్న మందు బిళ్ళల్ని ఒకటి రెండు నోట్లో వేసుకున్నాడు.

అయినా తూలడం తగ్గడం లేదు అమృతరావుకి .ఎనభైకి పైబడిన

వయసులో కూడ ఈ ప్రయాణాలు చాలకాలం నుండి ఇంట్లోంచి బయటకుఅడుగు పెట్టడం లేదు. అక్కడే ద్వారపూడిలోనే కాలక్షేపం చేస్తున్నాడు.

కానీ ఇప్పుడు మనసు ఆగలేదు. కాలు నిలువలేదు. అందుకే

తనకు పిలుపు అందకపోయినా పెద్దమనసు చేసుకొని ఈ ప్రయాణం

పెట్టుకున్నాడు.

చాలా ఆకలిగా అన్పిస్తోంది. చేతిసంచిలోని బ్రెడ్ ముక్కల్ని తీసుకొనినోట్లో వేసుకున్నాడు. కాసిన్ని నీళ్ళు తాగాడన్న మాటేగాని ఒళ్ళుతూలడం మాత్రం అలాగే ఉంది.

పరికించిచూసుకున్నాడు. బస్సు బస్సులాగానే ఉంది. అదే ప్రయాణికులతో నిండిపోయి ఉంది. వెనక సీట్లోని అమ్మాయి కోసం చూశాడు. కనబడలేదు.

బహుశా తన ఊరు రావడం తో దిగిపోయి ఉంటుంది.

"బంగారు తల్లి! దబాయించి తనకు కూర్చునే అవకాశాన్ని కల్పించింది.

లేకపోతే ఇన్ని గంటలు నిలబడి ప్రయాణం చేయడం... దెబ్బకు

హరీమనేవాడు. కొంత అలసటను మరికొంత ఆకలిని భరిస్తూ అలా కళ్ళు మూసుకున్నాడు అమృతరావు

****

అల్లుడి రాక శ్రీలక్ష్మికి మహదానందంగా ఉంది. దుబాయ్

నుండి వచ్చిరెండు సంవత్సరాలయి పోయింది. ఏదోమామగారి రిటైర్మెంట్ పుణ్యమాఅంటూ మరల ఇప్పుడు వచ్చాడు.

ఇంతకాలము బోసిబోయిన ఇల్లు మనుమడు మనవరాలితోను, వచ్చిన

బంధుగణం తోను కళకళలాడు తూ అగిపిస్తోంది.

'రిటైరైపోతున్నాడు. అమ్మా నాన్న కూడ ఉండి ఉంటే ఇంకెంత గొప్పగా

ఉండేదోకదా!! తన ఊహ తనకే నవ్వు తెప్పిస్తోంది. లేకపోతే ఏమిటి ఇప్పుడు తనకే అరవై సంవత్సరాలు వచ్చేశాయి. అటువంటి వాళ్లు ఉండాలంటే వారి వయసు

ఎనభై అయిదుకు పైన .అది తనకు అత్యాశగానే ఉంది.

అయినా ఆశపడటంలో తప్పేమీ లేదు. కారణం నాన్నతమ్ముడు

అమృతరావు బాబయ్య ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాడు. ' రంగారావు

చిన్నగానిట్టూర్చాడు.

****

చిన్న కునుకేసి లేచిన అమృత

రావుకి ఇప్పుడు అంతా కుదుటపడి

నట్లుగానే ఉంది. బస్సులో అందరూ మంచి నిద్రావస్తలో ఉన్నారు. చీకటిని

చీల్చుకుంటూ బస్సు మును

ముందుకు సాగిపోతోంది.

ఇంతదూర ప్రయాణం ఇప్పుడు తనకు అవసరమా.

పిలవని పేరంటానికి వెళుతున్నాడిప్పుడు.

వాస్తవాలు స్ఫురణకు వచ్చేసరికి

ఒక్కసారి గుండె బోరుమన్నట్లయింది. మనసు గద్గదమయిపోయింది..

అన్న గారు గుర్తుకువచ్చాడు. ఉన్నట్టుండి వెన్నులో వణుకు ప్రారంభమయి పోయింది. అవును అనంతరావు తనకు తోడబుట్టిన

వాడు. కానీ ఆఊహ అమృతరావుకి అర్ధరహితంగా అన్పిస్తోంది.

తమతల్లి తండ్రులు తన చిన్నతనంలోనే కాలం చేశారు. అప్పటి

నుండీ అన్నగారే తనకు తల్లి తండ్రి, గురువు దైవమూను. కానీ అనంతరావు దానికి తద్భిన్నం

ఒదిన నాగవతిని కూడా ప్రతి చిన్న విషయానికి పట్టుకొని చితకబాదేసేవాడు. ఆవిడకూడ ఉద్యోగస్తురాలు. అయినా ఏమాత్రము

కనికరము లేకుండా ఉండేవాడు తాను కూడ మంచి ఉద్యోగస్తుడే

అయినా ఏమాత్రం సంస్కారం లేకుండా ప్రవర్తించేవాడు.

"నువ్వు కూడా ఉద్యోగస్తురాలివేకదా ఒదినా! ఎదురుతిరిగితే

అన్నయ్య ఏమి చేయగలడేంటి నిన్ను!! ' నాగవతికి అప్పట్లో హితబోధ

చేశాడు అమృతరావు.

అనంతరావు తీరు చాల బాధాకరంగా తోచేది. కొడుకు రంగారావును ఎప్పుడూ మనసెరిగి పెంచలేకపోయాడు.

' ఏరా !మన ఉమ్మడి ఇంటి విషయం... ఈ కాగితాల మీద సంతకంపెట్టేస్తే "

".................."

"నువ్వు ఆర్ యమ్ పి డాక్టరు అయినా ప్రాక్టీసు పెట్టుకొని బాగానే

సంపాదించు కుంటున్నావు కదా. నీకంటూ పిల్లా పాపలు ఎవరూ లేరాయె!ఈ చిన్న పల్లెటూరు లోని ఈ చిన్న కొంప అవసరం నీకు ఉంటుందని నేను అనుకోవడం లేదు.'

"............"

"నువ్వు నాకన్నా బాగా ఉద్యోగంలో స్థిరపడినవాడవు అన్నయ్యా!

ఒదిన గారు ఉద్యోగం చేసుకుంటోంది. రంగారావు మంచి చేతికొచ్చేసినాడు."

అప్పట్లో అన్న గారి ముందు నోరు విప్పాడు అమృతరావు.

"..................."

'ఏదో నాన్న ద్వారా సంక్రమించిన పిత్రార్జితపు ఆస్తి ఇది. సమానంగా

పంచుకొని ప్రక్క ప్రక్కన మనం మనం అనుకుంటూ ......." అన్నగారికి నచ్చ చెప్పబోయాడు. అంతే తమ్ముడు చెంప ఛెళ్లు మనిపించాడు

అనంతరావు

ఊహించని వాస్తవానికి అమృతరావు కళ్ళుబయర్లు కమ్మేశాయి .మనిషి అవాక్కయి పోయినాడు.

"చిన్న ప్పటి నుండి నిన్ను పెంచి పెద్దజేశాను. చదువు చెప్పించి కాళ్ళమీద నిలబడేటట్లు చేశాను.

అటువంటిది చెప్పిన మాట వినకుండా..."

క్రింద పడేసి ఎడాపెడా ఉతికి పారేశాడు

స్వంతతమ్ముడు అన్న ఇంగిత జ్ఞానమయినా లేకుండా కనిపించినప్పుడల్లా

కల్పించుకొని తరిమి కొట్టాడు. జుట్టు పట్టుకొని బాది పారేశాడు .

అప్పటి నుండి అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. రెండు కుటుంబాలు

మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఆలోచిస్తున్న అమృతరావుకి చాల ఉద్వేగంగా అన్పిస్తోంది.తానొక ఉదార వాది. అన్నగారు ఎన్ని సార్లు తనపై దాడి చేసినా ఇప్పటికీ

ఆయనను మనసులో వెనకేసు కొస్తూనే ఉన్నాడు.

బస్సు ప్రయాణం అమృతరావుకు బడలిక ఏమీ అన్నించడంలేదు

కానీ అన్నగారి తోటి అప్పటి తగాదాలు ,కలిసి ఉండటం చేతగాక

గిల్లికజ్జాలతో విడి పోవడాలు తనకు ఈ ఎనిమిది పదుల ముసలితనం

లో విపరీతమైన బడలికను తెచ్చిపెడుతున్నాయి.

భార్యపోయిన తర్వాత ద్వారపూడిలో ఆర్.యమ్.పి డాక్టర్ గా ఉండి ఏదో తన పొట్ట తాను పోసుకుంటున్నాడు. కొన్ని విషయాలను తల్చుకుంటే

వింతగాను, ఆనక బాధాకరంగాను

అన్పిస్తుంటుంది. ఆశ్చర్యంగా ఆరోజు సాయంత్రమే రిటైరయి

అదేమి చోద్యమో గానీ అప్పట్లో అనంతరావు రిటైరైపోయాడు.ఆశ్చర్యంగా ఆ రోజు సాయంత్రమే రిటైరై పోయానని తీవ్రమైన మానసిక

అలజడికి లోనయినాడట. తీవ్రమైన గుండెపోటు కారణంగా ఆరోజే చనిపోయాడు. అలాగే తర్వాత కాలంలో మరో దిగ్భ్రాంతికర మైన సందర్భం!

అనంతరావు చనిపోయిన నాలుగు సంవత్సరాలకి నాగావతి ఒదిన రిటైపోయింది. ఆవిడది

కూడా అదే పరిస్థితి. రిటైరై న రోజు రాత్రి తీవ్రమైన అలజడికి లోనయింది.ఆ కారణంగా గుండెపోటు వచ్చింది.

అంతే ఆరాత్రి హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.

' పదవీ విరమణ రోజునే భార్యభర్తలు

ఇద్దరు పరలోకానికి చేరిపోయారు. అప్పట్లో ఆవార్తను ఫొటోలతో సహా పత్రికలు విశేషంగా వ్రాశాయి .

పేపర్లలో చదివి తెలుసుకోవడమేగానీ

అమృతరావుకి ఎవరూ విషయాన్ని

తెలియజేయలేక పోయారు.

కానీ ఇప్పుడు వయసుడిగిన ఆ కుటుంబపెద్దగా ఆలోచిస్తున్నాడు.

ఎవరూ ఊహించని విధంగా కీడును పసికట్టి మరీ అప్రమత్త

మవుతున్నాడు.

రంగారావు ఇప్పుడు రిటైర్ కాబోతున్నాడు. అన్న వదినల రిటైర్మెంట్లు అప్పటి సంఘటనలు అమృతరావును కలవర బెడుతున్నాయి.

అందుకే అటువంటివి జరగకుండా ఉండేందుకు బాధ్యత గల్గిన వైద్యునిగా ఆసమయంలో రంగారావుని కనిపెట్టుకొని ఉండేదుకు సమాయత్తమవుతున్నాడు

ఆ ఆలోచనలతోనే తగిన మందులను ముందు జాగ్రత్త చర్యల కోసం తనతో తీసుకెళుతున్నాడు.

ఈ పిచ్చి వ్యవహారం అమృతరావుకి

నామర్దగా ఏమీ అన్పించడంలేదు. రంగారావు తమ కొడుకు. వాడి క్షేమం.. వాడి సుఖ సంతోషాలు తనకు ముఖ్యం అంతే !

***

రంగారావుకు చాల ఆశ్చర్యంగా ఉంది. లోలోపల సంతోషంగాను అన్పిస్తోంది.

రా బాబయ్యా ! ... ఎన్నో కెన్నాళ్ళకు !ఎదురేగి ఆలింగనం చేసుకున్నాడు.

అమృతరావు రాకతో ఇప్పుడు అక్కడ నిజమైన పండుగ కళ వచ్చేసింది..

కుటుంబం అంతమందిని ఆహ్వానించి కూడా ఇంకా ఈ భూమి మీద బ్రతికి ఉన్న స్వoతబాబయ్య ను పిలవాలను కోకపోవడం రంగారావు కు చిన్నతనంగా అన్పిస్తోంది. లోలోపల కుoచించుకుపోతున్నాడు.

"రండి మావయ్యగారూ! మీ రాకతో మాకడుపు నిండిపోతోంది.

శ్రీలక్ష్మి చినమావ గారికి పాదాభివందనం చేస్తూ అంటోంది.

"చాల తగ్గిపోయావు బాబయ్యా !"

" రేపు భాద్ర పదమాసానికి నాకు ఎనభైరెండు నిండుతున్నాయి. అంటే మీ అమృతరావు బాబయ్య ఎనభై మూడేళ్ళ పడుచు కుర్రాడన్నమాట'

చిన్నగా నవ్వుతూన్న ఆయన బోసినోరు అక్కడ అందరికీ వింతగా

అన్పిస్తోంది.

'చిన మావగారు కొడుకు మీద ప్రేమతో మా రిటైర్మెంట్ ఫంక్షన్కి రావడం

మా"కు ఎంతో బాగుంది. శ్రీలక్ష్మి వేడుకమాటలు అమృతరావుకి

సమంజసంగా ఏమీ అన్పించడం లేదు.

" తన విపరీతమైన ఆలోచనతనది. అప్పట్లో అన్న గారు, ఒదినగారు

దురదృష్టవశాత్తు తమతమ రిటైర్మెంట్ రోజునే ఈ లోకాన్ని విడిచి

వెళ్ళిపోయారు.అటువంటి సంఘటన మరల తమకుటుంబంలో

పునరావృతం కారాదన్నది తన తపన .తాను డాక్టర్ గా పై చదువులు చదవలేదు.అయినా ద్వారపూడిలో మంచి హస్త వాసికల్గిన డాక్టర్ అనే మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ కారణంగానే లో చూపు కల్గిన ఆయన గారు రంగారావును కనిపెట్టుకొనే

ఉంటున్నాడు.

రంగారావు పదవీ విరమణ సందర్భం దిగ్విజయంగా ముగిసిపోయింది. ఆయన గారి ఆఫీసులో మంచి వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. రాత్రికి

మంచి డిన్నర్ ఇచ్చారు కూడాను.

అమృతరావు గొప్ప గొప్ప అనుభూతులతో పరవశించిపోతున్నాడు.

'బాబయ్యా ! అమ్మనాన్నకూడా ఉండి ఉంటే చాలా బాగుండేది

కదూ!

'అవున్రా !వాళ్ళు ఇక్కడే ఎక్కడో నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి

దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి' అని మటుకు అనగలిగాడు.

'మా నాన్న పెద్ద శాడిస్టు బాబయ్యా !పైగా పెద్ద మూర్ఖుడు. ఎందర్ని

ఎన్ని విధాలుగా ఇబ్బ oదులు పెట్టాడో నాకు తెలవంది కాదు. ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నావు.

మా నాన్న రిటైరయిన రోజజే చనిపోయాడు.... అమ్మ కూడా ఆయన మార్గంలోనే

నడిచి ఆఫీసులో వీడ్కోలు తీసుకున్న రోజే తనువు చాలించుకు వెళ్ళిపోయింది.

'ఈ సమయంలో అమృత రావు బాబయ్య వచ్చి నాకు చేదోడుగా నిలవాలనిఆశించాను. నీ దగ్గరకొచ్చి నీ కాళ్ళ మీదపడి క్షమార్పణ చెప్పుకొని

నిన్ను మనసారా ఆహ్వానించి రావాలని అనుకున్నాను. కానీ ఇన్నేళ్ళ తర్వాత నీ వాస్తవ పరిస్థితి ఏమీ అర్ధంగాక .....

రంగారాశవు అంతరంగం ఆ క్షణాన

ఒక మలయమారుతం లాగా అన్పిస్తోంది.

"భలేవాడివిరా అబ్బాయ్ ! నీగడప తొక్కింది కూడా ఆ సెంటిమెంట్ తోనే

మీ నాన్నే నన్ను ఉసి గొల్పి ఇక్కడకు పంపించి ఉంటాడు?"

"మీకంటూ ఎవరూ లేకుండా... ఒంటరిగా ఈ వయసులో ఎక్కడో ...."

"..............."

"ఇక మీదట మా దగ్గరకొచ్చేయాలి!. రంగారావు మీ స్వo తకొడుకు .మీకు

ఏ లోటూ లేకుండా చూసుకొనే బాధ్యత మాది ' శ్రీలక్ష్మి మాటలలో గోరంతఆప్యాయత, కొండంత నిజాయితీ అనుపిస్తున్నాయి.

" త్వరలో మీదగ్గరకే రావాలేమో !అయినా మీరు తప్ప ఈ లోకంలో

నాకు ఇంకెవరున్నారు చెప్పు!! అమృతరావు బయటకు అడుగులు వేస్తూ అన్నాడు. ఆప్యాయత నిండిన

అనురాగ స్పర్శ తన అంతరంగాన్ని చుట్టుముట్టేయడంతో ఆ పలుకులు చిన్నగా వణుకుతున్నాయి

వీధిగేటు దగ్గర ఉన్న గుల్మొ హర్ చెట్టుకొమ్మలు విదిల్చిన

పండుటాకులు నేలమీద పడి ఉన్నాయి.

బయటకు నడుస్తున్న వాడల్లా ఆగి అపురూపంగా వాటిని ఏరుకొని

దోసిళ్ళలోనికి తీసుకున్నాడు. వాటి తాలూకు సుగంధ పరిమళం

ఒక్కసారిగా గుప్పుమంటోంది.

వాటి వెనుకనే ఒకానొక ఆత్మీయతా పరిమళం పరవశమవుతూ

అంతరంగాన్ని చుట్టేయడంతో మనసులో తనను తాను పరామర్శించుకుంటూ సంతృప్తిగా బయటకు అడుగులు వేస్తున్నాడు అమృతరావు.

- వడలి రాధాకృష్ణ

(తెనాలి)

First Published:  29 Jan 2023 12:06 PM IST
Next Story