వచన కవితా మూర్తి కుందుర్తి
నేడు కుందుర్తి ఆంజనేయులు శత జయంతి ముగింపు
జాషువా, విశ్వనాథల ప్రేరణా ప్రభావాలతో పద్య కవిత రచనకు పూనుకున్నారు కుందుర్తి ఆంజనేయులు. విశ్వనాథ వారి ప్రౌఢమైన శైలిలో 'సౌప్తికం' అనే
కావ్యాన్ని రచించారు .
ఆయన 1922 డిసెంబర్
16వ తేదీన నరసరావుపేట
సమీపంలో కోటవారిపాలెంలో పేదకుటుంబంలో జన్మించారు
నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో అనిసెట్టి, రెంటాల, బెల్లంకొండ రామదాస్, మాచిరాజు
దేవీ ప్రసాదులు ఆయన సహాధ్యాయులు. మాచిరాజు దేవీప్రసాద్ ప్రేరణతో శ్రీశ్రీ
కవిత్వ లాలసుడై వచన కవిత్వం వైపు దృక్పథం మరల్చుకున్నారు
నవ్యకళాపరిషత్, నరసరావుపేట ఆధ్వర్యంలో ఏల్చూరి, బెల్లంకొండ రామదాసులతోకలసి తెలుగులో తొలి వచనా కవితా సంపుటి 'నయాగరా'ను 1944లో ప్రచు
రించారు . తొమ్మిది కవితల సంపుటి నయాగరాలో కుందుర్తి రచించిన 'మన్యంలోకి' కవితలో మన్యం వీరుడు అరి విప్లవాగ్నిని ప్రశంసించారు
'జయిస్తుంది' కవితలో బ్రిటిష్ వారి దురాగతాలను నిరసించారు
క్విట్ఇండియా ప్రభావంతో అసమ సమాజాన్నిఈసడిస్తూ
'ఒకవేపున. అధికోత్పత్తి/
మరోవేపుడొక్కల కరువు' ఇకపై సాగవని హెచ్చరికచేశారు
ఆయన కవితలపై శ్రీశ్రీ మరో ప్రపంచం
గేయం ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
'పాతకాలం పద్యమైతే వర్తమానం వచనగేయం' అంటూ 'నాలో నినాదాలు'లో కుందుర్తి స్పష్టంగా ప్రకటించారు
ఎందరోఅధునిక కవులను ప్రభావితం చేశారు .అనిసెట్టి, ఆరుద్ర, దాశరథి, సి. నారాయణరెడ్డి, రెంటాల వంటి వారు వచన కవితను ఆదరించి వచన కవితా సంపుటాలు ప్రచురించారు.
వచనకవితా మూర్తి కుందుర్తికి ఫ్రీవర్స్ ఫ్రంట్ ఊపిరి. ప్రాచీనకవిత్వంపై తిరుగుబాటు చేసి 'రచనల పూలతోటలో ఛందస్సుల మొక్కలునాటను' అని ప్రతిజ్ఞ చేశారు
ఆధునిక కాలానికి అనువైన ప్రక్రియ వచన కవిత్వమేనని నిరూపించేందుకు ఎంతో శ్రమపడ్డారు ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వ్యాసాలు, పీఠికల ద్వారా వచన కవితాప్రచారం ముమ్మరంగా చేసినందున కుందుర్తిని వచన కవితా పితామహుడిగా విమర్శకులు పేర్కొన్నారు.
ఆశ, ఆచారిగారి అమ్మాయి, శిక్ష వంటి వచనగేయ నాటికలురాశారు తెలంగాణ, యుగేయుగే, నగరంలో వాన, నాలోని నాదాలు, కుందుర్తి కృతులు పాఠకుల మన్ననలు పొందాయి.
'హంస ఎగిరిపోయింది' అనే సతీస్మృతికావ్యం విశిష్టమైంది. ఆయన కవిత్వంలో అభ్యుదయ దృక్పథం, హేతువాద దృష్టి, ప్రకృతిని సామాజిక స్పృహతో సమన్వయించటం, చమత్కారమైన అధిక్షేపణ,ఆకర్షణీయమైన అంత్యప్రాసలు ఎందరో యువకులను ప్రభావితం చేశాయి.
ఆయన 1982 అక్టోబర్ 25వ తేదీన మరణించినా, వచన కవితా పితామహుడిగా ఆధునికాంధ్ర కవిత్వంలో చిరస్మరణీయులు .ఇవాళ వారి శతజయంతి సమాపనమై 101 వ జయంతి సందర్భంగా నివాళులు
-డాక్టర్ పీవీ సుబ్బారావు