Telugu Global
Arts & Literature

పద్యకవితా ఉత్పలం

పద్యకవితా ఉత్పలం
X

ఉత్పలసత్యనారాయణాచార్య తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు.

ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందిన ఉత్పల సత్యనారాయణా చార్య గారు 1927, జూలై 4న రఘునాథాచార్యులు, అలివేలమ్మ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం తిరుపతిలో వేటూరి ప్రభాకరశాస్త్రి శిష్యరికంలో జరిగింది. విద్వాన్ వరకు చదివారు

తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు.విద్వాన్ పూర్తి అయిన తరువాత మద్రాసులో మాతృభూమి పత్రికలో ఉపసంపాదకునిగా చేరారు.

అక్కడ వీరికి చుండి జగన్నాథంతో పరిచయం ఏర్పడి జాతీయ భావాలను పెంపొందించుకున్నారు.

నెల్లూరులోని జమీన్‌ రైతు పత్రికకు సినిమా రిపోర్టర్‌గా మద్రాసు నుండి వారం వారం సినిమా వార్తలను పంపేవారు. ఇలా పత్రికారంగంలో ప్రవేశించి ప్రజామత, ఆనందవాణి, భారతి, గోలకొండ పత్రికలకు గేయాలు అనేకం వ్రాసి ప్రకటించేవారు.చందమామ పిల్లలపత్రికలో కూడా బాలగేయాలు రాశారు

హైదరాబాదుకు వచ్చిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పట్టా పొందారు. ఈయన సికింద్రాబాదులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా పనిచేశారు. ఆ తర్వాత జంటనగరాలలో అనేక కళాశాలలో ఉపన్యాసకునిగా కొనసాగారు

వీరు రామ్‌నరేష్ త్రిప్రాఠీ, మైథిలీ శరణ్‌గుప్త, గోల్డ్స్ స్మిత్ మొదలైన వారి రచనలనుండి ప్రభావితుడైనారు.వీరి రచన శ్రీకృష్ణ చంద్రోదయమునకు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నారు.

ఉత్పల వారి రచనలలో ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్రమర గీతము, గోపీగీతము, రాజమాత, వేణు గీతము, యశోదానంద గేహిని, స్వప్నాల దుప్పటి, తపతి, గాంధారి, శరణాగతి, కీచకుని వీడ్కోలు, చిన్ని కృష్ణుడు, గంగావతరణము, శతరూప, వ్యాసమంజూష, యుగంధరాయణ, పాతబస్తీ విలాసము,రాసపంచాధ్యాయి, రాసపూర్ణిమ, రాజమాత, రసధ్వని ప్రముఖమైనవి.

ఆంధ్రభూమి వారపత్రికలో వ్యాసపీఠం శీర్షిక కాలమ్ అనేక సంవత్సరాలు రాశారు.

ఉత్పలవారు బొమ్మరిల్లు, యవ్వనం కాటేసింది, బొట్టు కాటుక మొదలైన సినిమాలకు పాటలను అందించారు

2003లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యలో విశిష్ట పురస్కారం అందుకున్న సత్యనారాయణాచార్య గారు 2007, అక్టోబర్ 23న హైదరాబాదులో అనారోగ్యముతో మరణించారు.

సినీకవిగా ఉత్పల

అద్భుతమైన పద్యకావ్యాలతో తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన కవి ఉత్పల సత్యనారాయణాచార్య. 1976 లో 'యవ్వనం కాటేసింది' సినిమాతో గీత రచయితగా మరో అడుగు మోపి ఆణిముత్యాల్లాంటి పాటల్ని మనకుఅందించారు. సినిమాల్లో ఆయన రాసిన పాటలు చాలా తక్కువ. కాని వాటిలో సాహిత్య పరిమళం, పదసౌందర్యం ప్రస్ఫుటం. 'బొమ్మరిల్లు' (1978), 'బొట్టు కాటుక'(1979), 'విజయ'(1979) సినిమాలకు ఆయన రాసిన పాటలు అద్భుతమైన సాహిత్యపు విలువల్ని పొదుగుకున్నవే.

ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు', 'శ్రీకృష్ణ చంద్రోదయం', 'శతరూప' వంటి కావ్యాలతో తెలుగు సాహితీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకొన్న కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఉత్పల నిరంతర సాహిత్యాధ్యయనంతో తనలోని సృజనాత్మక ప్రతిభకు మెరుగులద్దారు. అద్భుతమైన పద్యకవిగా, గేయ రచయితగా చాలామందికి సుపరిచితులైన ఆయన సినిమాకవిగా మాత్రం కొద్దిమందికే తెలుసు. 'యవ్వనం కాటేసింది' (1976) సినిమాతో గీతరచయితగా ప్రవేశించి సాహిత్య సంస్కారం ఉన్న పాటలు రాశారు.

కమ్మని రాగాలు

'యవ్వనం కాటేసింది' సినిమాలో ఆయన రాసిన 'సంసారం ఒక చక్కని వీణ, సంతోషం ఒక కమ్మని రాగం' అనే పాటలో భార్యాభర్తల అనుబంధాన్ని, మమకారాన్ని చక్కగా ఆవిష్కరించారు. కుటుంబంలో ఎన్ని కలతలూ, కన్నీళ్ళూ వచ్చినా చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ జీవితాన్ని గడపాలనే గొప్ప జీవితసత్యాన్ని తెలిపారు. ఈ సినిమాలోనే 'అటు కాలనాగు ఇటు వేటగాడు' అనే పాటను కూడా ఆయన రాశారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందనేది ఈ పాట చెబుతుంది. విషాద సన్నివేశాన్ని కళ్ళముందుంచుతూనే చక్కని సందేశాత్మక విలువల్ని అందిస్తుంది. అలాగే 'బొమ్మరిల్లు'(1978) లో ఆయన రాసిన 'చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మా మా కోవెలేనమ్మా' అనే పాట అటు అన్నాదమ్ముల అనుబంధాన్ని, ఇటు అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాల్ని తెలియజేస్తుంది. ఈ సినిమాలోనే ఒక విషాద గీతాన్ని కూడా ఆయన రాశారు. ఇక 'విజయ'(1979) సినిమాలో 'కన్నెపిల్ల మూడు ముళ్ళతో కావ్యనాయికైనదండీ నేటి నుండి...' అనే పాటలో పెళ్ళి కాబోతున్న ఆడపిల్లలోని ఆనందాన్ని, తెలుగింటి పెళ్ళి వాతావరణాన్ని కళ్లకు కట్టారు. పాట అంతా కూడా ఆడపడుచు సౌభాగ్యాన్ని, సౌశీల్యాన్ని ఎంతో అద్భుతంగా ప్రకటిస్తుంది.

విలువైన పాటలు


'బొట్టు కాటుక'(1979) లో ఆయన రాసిన 'సీతమ్మ చరితమే రామాయణం, మా అమ్మ కథ మాకు పారాయణం' అనే పాట కుటుంబ విలువల్ని వివరించే పాట. పిల్లలంతా చేరి తమ తల్లికి పుట్టినరోజు వేడుకలను జరుపుతూ పాడే పాట ఇది. పిల్లలకు ఉండే పెద్ద మనసును, వారి కల్లాకపటమెరుగని స్వచ్ఛమైన ప్రేమను, నిర్మలత్వాన్ని గూర్చి ఈ పాటలో ఎంతో బాగా చెప్పారు. ఇల్లాలు కుటుంబాన్ని నడిపించడానికి ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటుందని, తల్లిగా, కూతురిగా, భార్యగా అన్ని బాధ్యతలను మోస్తూ, అనురాగాన్నే ఆసరాగా చేసుకుని, నిస్వార్థంగా చేస్తుందని ఈ పాటలో వివరించారు.

'యవ్వనం కాటేసింది', 'బొమ్మరిల్లు', 'విజయ', 'బొట్టు కాటుక' మొదలగు సినిమాలకు మాత్రమే ఆయన పాటలు రాశారు. తెలుగింటి సంప్రదాయపు వాతావరణం, ఇతిహాసపు గొప్పతనాన్ని తెలిపే వైనం, కుటుంబ విలువలు, మానవతా సంస్కారం వంటి వన్నీ ఆయన పాటల్లో ఎక్కువగా కనిపించే అంశాలు.

- వేణుగోపాలాచార్య

First Published:  4 July 2023 1:02 PM IST
Next Story