ఉషశ్రీ
తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు ఉషశ్రీ. పురాణ ప్రవచనంలోనే కాక ప్రత్యక్షవ్యాఖ్యానాలలోనూ తెలుగు శ్రోతలపై చెరగని ముద్ర వేసిన ‘గళగంధర్వుడు’ ఉషశ్రీ.
తెలుగునాట రేడియో స్వర్ణయుగవైభవాన్ని శిఖరస్థాయికి చేర్చిన దిగ్దంతులలో అగ్రతాంబూలం ఆయనదే అనడం అతిశయోక్తికాదు. ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు భారత, రామాయణ, భాగవతాలను ప్రతి వారం సీరియల్‌గా చెపుతూ, అశేష తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించారు. రామాయణ భారతాలు మానవజాతి సర్వకాలాలలోనూ సుఖశాంతులతో మనుగడ సాధించడానికి అవసరమయిన విశేషాలను అందించే గ్రంథాలు మాత్రమే అనీ, అందుచేతనే ఇవి ఇన్నివేల సంవత్సరాలు జీవించగలిగాయనీ ఉషశ్రీ అందరితో ఒప్పించగలిగారు.
ఉషశ్రీ అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 సంవత్సరం మార్చి 16 న జన్మించారు. ఈయన తండ్రి పురాణపండ రామూర్తి - ఆయుర్వేద వైద్యుడు, తల్లి కాశీ అన్నపూర్ణ - పురాణపండ రామూర్తి జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా పనిచేశాడు.భీమవరంలో డిగ్రీ పూర్తి కాబోయే సంవత్సరంలో ఆయన మిత్రుడైన రామానుజాచార్యులు
ఆయనచే పునర్జన్మ అనే నాటకంలో ఒక పాత్ర వేయించాడు. అందులో ఉషశ్రీ తండ్రి పాత్ర పోషించగా రామానుజాచార్యులు విలన్ పాత్ర పోషించాడు. ఆ తరువాత ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద రామాయణం, మహాభారతం మహా భాగవతం ప్రవచనం చేశారు.
ఉషశ్రీ భార్య వ్యాస సత్యవతి పురాణపండ (మధునాపంతుల). ఈయనకు నలుగురు కుమార్తెలు.
ఉషశ్రీ ఆకాశవాణి విజయవాడ
కేంద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన "ధర్మ సందేహాలు" కార్యక్రమము చాలా పేరు పొందింది. ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. 1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించాడు. 1979 లో పి.వి.ఆర్.కె ప్రసాద్ తి.తి.దేకి కార్యనిర్వహణాధికారిగా ఉన్నపుడు ఆయనచే భాగవతం రాయించి పాతికవేల కాపీలు ముద్రింప జేసి అతి తక్కువ ధరలో భక్తులకు అందించాడు.అయితే ఆయన రెండున్నర రూపాయలకు విడుదల చేసిన పుస్తకాన్ని తరువాత వచ్చిన వారు తొమ్మిది రూపాయలు చేశారు. భారతం, రామాయణాలు కూడా పదివేల ప్రతులు ముద్రించి కృష్ణా పుష్కరాల సమయంలో విడుదల చేశారు.
ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేవి . అప్పట్లో, దూరదర్శన్ లేదు.శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. భగవద్గీతనీ, సుందరాకాండనీ అందరికీ అర్థమయ్యేలా చేశారాయన.
‘సమస్త సన్మంగళాని భవంతు...’ మొదలుకొని ‘స్వస్తి’ పలికే వరకూ ప్రత్యక్షరం స్పష్టంగా, సూటిగా జన హృదయాలను తాకేది. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అది అతిశయోక్తి కాబోదు.
వీరకాకాని అంతిమయాత్ర, గోదావరి నదిపై రోడ్డు రైలు వంతెన ప్రారంభోత్సవం, భద్రాద్రి రామయ్య కల్యాణం, కృష్ణాపుష్కరాల ప్రత్యక్ష వ్యాఖ్యానం (1980) తదితరాలు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాళ్లు. ‘సహదేవుడు నక్సలైటా?’ అన్న ఆయన విశ్లేషణ, అర్జునుడు విడిచిన బాణంతో సైంధవుడి శిరస్సు - సచిన్ టెండూల్కర్ కొట్టిన బంతిలా ఎగిరిపడింద’ని చేసిన సందర్భోచిత వ్యాఖ్యలు. ఆయన ఉపన్యాసాలని మళ్లీమళ్లీ వినేలా చేస్తాయి.
ఆ సుస్వర మాంత్రికుడి 33వ వర్థంతి సెప్టెంబర్ ఏడు .ఈ సందర్భంగా వారికి స్మృతి నివాళి