Telugu Global
Arts & Literature

పనంటే విసుగనిపిస్తోందా?

పనంటే విసుగనిపిస్తోందా?
X

వంటావార్పన్నా, ఇల్లు చక్కదిద్దుకోవడమన్నా విసుగనిపించే స్థితి ప్రతి గృహిణికీ ఎప్పుడో ఒకప్పుడు రాకతప్పదు. ఆలోచిస్తే అందుకు ముఖ్యకారణం గృహిణులు ఇంటికే పరిమితమై యాంత్రిక జీవితం గడపడమేనని అనిపించక మానదు. అంతేకాదు, గృహిణులు తాము చేసే పని పట్ల శ్రద్ధ చూపకపోవడం మరియు చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చేయకపోవడం కూడా కారణమే.

కొంతమంది గృహిణులు రోజూ చేసే వంటే గదా ఏదో మొక్కుబడిగా చేసి అక్కడ పడేసి వచ్చి టీవి ఎదురుగా చతికిలబడతారు. అలా కాకుండా ప్రతి గృహిణీ తాము చేసే వంటలోనే చిన్నచిన్న మార్పులు చేస్తే ఆ వంట చేయడంలో కూడా ఆనందాన్ని తృప్తిని పొందగలుగుతారు.

ఉదాహరణకు రోజూ రొటీన్‌గా ఓ కూర పప్పు చారు చేసేసి బయటపడాలని చూడకుండా తాము చేసే వంటలో వైవిధ్యం కనబరచాలి.

అందుకని ఓ రోజు పప్పు, కూర చేస్తే ఓ రోజు పులిహోర, మరునాడు బిరియాని చేయండి, ఓ రోజు మజ్జిగ పులుసు, అలాగే ఆవపెట్టి పులుసు పెట్టిన కూరలూ, కాకరకాయల స్టఫ్, గుత్తివంకాయ స్టఫ్ ఓహ్ ... నిజంగా చేయదలుచు కుంటే మన ఆంధ్రులకు వైరైటీ వంటకాలకు కొదవలేదు.

ఓ విధంగా మనం ఆంధ్రులమై పుట్టడం మన పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. కూరలలోగానీ, పచ్చళ్లల్లోగా నీ ఊరగాయలలోగానీ మన ఆంధ్రులకున్నన్ని వైరైటీలు మరే ఇతర ప్రాంతాలవారికీ లేవనే చెప్పాలి. అంతేకాకుండా ఈ రోజులలో టీవిలోనూ, కంప్యూటర్ లోనూ, వెబ్ సైట్లలోనూ ప్రతికలలోనూ ఎన్నో రకాల నోరూరించే గా రెసిపీలను చూపిస్తున్నారు. మనకీ మన సాంప్రదాయక వంటలు బోర్ కొట్టినప్పుడు ఆయా మీడియాలలో చూపించే వంటకాలను కూడా ట్రై చేయవచ్చు.

అంతేకాదు, వంట అంటే విసుగనిపించినప్పుడు మన ఆలోచనాసరళిని మార్చుకోవడం ఎంతైనా అవసరం. అందుకు ఏం చేయాలంటే ప్రతిరోజూ వంటకు ఉపక్రమించే ముందర ప్రతి గృహిణీ ఈ వంటని నేను నా పిల్లలకోసం భర్తకోసం చేస్తున్నాను. వంట కనక బాగా కుదిరితే అప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించే, ఆనందం తృప్తి వెలకట్టలేనిది. అలా నా పిల్లలూ, భర్త నేను చేసిన వంటని ఎంజాయ్ చేస్తూ తినాలంటే నేను దృష్టిపెట్టుకుని వంట శ్రద్ధగా చేయాలి. అని తనకు తానే పాజిటివ్ సజెషన్ ఇచ్చుకోవాలి. అసలు శ్రద్ధగా చేస్తే ఎవరూ అంత ప్రాధాన్యత నివ్వని 'చారు' కూడా అమోఘంగా ఉంటుంది.

ఇక ఇంటిని చక్కదిద్దుకోవడం కూడా మన పిల్లలకోసం మన భర్తల కోసం చేయాలని అది చూసి వాళ్ల పొందే ఆనందాన్ని ఊహించుకుంటే మన బద్ధకం, నిరాసక్తత అన్నీ ఉష్ కాకి అన్నట్లు మటుమాయం అవుతాయన్నది నిజం కాకపోదు.

ఉదయమే పిల్లలూ శ్రీవారూ స్కూళ్లకీ, ఆఫీసులకీ వెళ్లాక ఇల్లంతా రణరంగంలా ఉంటుంది. అప్పుడు ప్రతి గృహిణీ తాను కూడా బ్రేక్ ఫాస్ట్ చేసి వేడి వేడి కాఫినో, టీ సిప్ చేస్తూ కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత మీ మ్యూజిక్ ఎలానూ, రేడియోలోనూ పాటలు పెట్టుకుని వింటూ పిల్లలు అటు ఇటూ చిందర వందరగా పడేసిన వస్తువులను యథాస్థానంలో పెట్టాలి. కనుక ఇంటి చుట్టూరా తోట పూలమొక్కలు ఉంటే రోజుకో రకమైన ప్లవర్ అరేంజ్ మెంట్ చేసి మీ డ్రాయింగ్

రూంని అలంకరించుకోండి.

ఆ తర్వాత మీకు కనుక పనిమనిషి ఉంటే సరే లేకపోతే ఆ పనినంతా చేసేసుకుని తర్వాత స్నానం చేసి దేవుడి పూజచేసుకోవాలి.

మీకు ఇంటిపనిమీద ఆసక్తి పెరగాలంటే మీకంటూ ఓ ప్రత్యేకమైన వ్యాపకం తప్పక ఉండి ఉండాలి. ఉదాహరణకు కుట్టు, అల్లికలు రచనావ్యాసాంగం లాంటి హాబీలు మీ తీరిక వేళల్లో డెవలప్ చేసుకోవాలి. ఇందువల్ల ఎంతో కొంత తీరిక వేళల్లో డబ్బుకూడా ఆర్జించుకోవచ్చు. అందువల్ల మీ మనస్సుకు ఓ నూతన ఉత్తేజం కలుగుతుంది. అప్పుడు ఇంటిపనీ, వంటపనీ రెట్టించిన ఉత్సాహంతో చేయగలుగుతారు. ఈ సూత్రం అన్ని వయసుల వారికీ తప్పక వర్తిస్తుందని మరిచిపోకూడదు.

- ఉషా మాధవపెద్ది

First Published:  9 Sept 2023 11:00 AM IST
Next Story