అసమాన పాండిత్యం, అద్వితీయ కవిత్వం మూర్తీభవించిన ‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తివారు
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ‘సరస్వతీ పుత్ర’, ‘సరస్వతీ తిలక’, ‘వ్రజభాషాభూషణ’ ,‘సర్వతంత్ర స్వతంత్ర’ వంటి ప్రతిష్ఠాత్మక బిరుదుల్ని స్వామి శివానంద సరస్వతి, కాళీచరణ్ బెనర్జీ, మదర్ థెరిసా వంటి మహనీయుల నుండి,విశ్వవిద్యాలయాల నుంచీ పొందిన సాహితీ దిగ్గజం. అనేకానేక సుప్రసిద్ధ సాహితీవేత్తలకే వారు - అయ్యవారు !
పద్నాలుగు భాషల్లో అభినివేశం కాదు, కవిత్వం చెప్పగలవాడినని సవాలు విసరిన బహుభాషావేత్త, విద్వత్కవి, పుంభావసరస్వతి. ఆ మహనీయుని జ్ఞానతృష్ణకి పెద్దలెందరో ‘నమః’ పలికేరు. దేశం మొత్తంలోనే రసరమ్యంగా అత్యధిక పుటల్లో సాహిత్య సృజన చేసిన మహామహుల్లో పుట్టపర్తివారు తొలిపంక్తివారని ప్రతీతి.
అయ్యవారు తన 19వ ఏటనే ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యాన్ని రాశారు. ఆ కావ్యాన్ని వెంటనే మద్రాసు విశ్వవిద్యాలయం వారు విద్వాన్ కోర్సుకు పాఠ్యగ్రంథంగా పెట్టారు. అయ్యవారు ఆ విద్వాన్ పరీక్ష వ్రాయడానికి వెళ్లారు! తాను రాసిన గ్రంథాన్ని గురించి తానే పరీక్షలో వ్రాయవలసివచ్చిన చిత్రమైన అనుభవం-బహుశ-మరొక కవి జీవితంలో ఎదురై వుండకపోవచ్చు. ఇప్పటికీ సాహితీలోకంలో ఇదొక ఆశ్చర్యకరమైన సంభవమే! అలాగే, 20 ఏళ్ల వయస్సులోనే వారు ‘షాజీ’ కావ్యాన్ని అక్షరరమ్యతతో, అనుభూతిప్రదంగా రాసి రసహృదయుల మెప్పు పొందారు. ‘సూఫీ’ తత్వమంటే తమకున్న ‘పిచ్చి’కి తార్కాణంగా దాన్ని రాశానని
చెప్పుకున్నారు.
ఇక, ఆచార్యులవారి ‘శివతాండవమ్’ అక్షరాక్షర తాండవనర్తనమే. ‘భారతదేశమంతా నేను సంపాదించుకున్న కీర్తికి మూలస్తంభం శివతాండవమేననిపిస్తుంది’ అని వారే సెలవిచ్చారు. అదొక కావ్య ఝంఝ. అక్షర ప్రభంజనం. దాన్ని వారే చదువు తుండగా విన్నవారంతా ధన్యులే.
నేను కడపలో వున్న పదేళ్ళలో - ఒకసారి మధురాంతకం రాజారాంగారితో కలిసి వెళ్ళినప్పుడు, మరొకసారి వల్లంపాటివారితో కలిసినప్పుడు విన్న భాగ్యశాలిని. జింకా సుబ్రహ్మణ్యం, వైసివిరెడ్డి, ఎన్సీ, రాజారాం, శశిశ్రీ, గోవర్థనరెడ్డి, భూతపురి వారు, వారి శిష్య ప్రశిష్యులు ఎందరెందరో... కీ.శే. శశిశ్రీ శివతాండవమును వేదిక మీద పాడుతుంటే - అతని ఉద్వేగం, ఉత్తేజం, ఊపు, తూగు, లయ, స్వరఝరీ - చాలాసార్లు విని ఆనందించే అదృష్టం నాకు కలిగింది. చాలామంది సాహితీవేత్తలకు, కావ్యారాధకులకు శివతాండవం కంఠతావచ్చు.
పుట్టపర్తివారు ‘శివతాండవమ్’ చదువుతుంటే విశ్వనాథ వారు ఆనందతాండవమ్ చేశారట!’ అని అయ్యవారి సుపుత్రి, సుప్రసిద్ధ సాహితీవిదుషీమణి, బహుముఖీన ప్రతిభాభారతి - డా. పుట్టపర్తి నాగపద్మిని గారు- తాము సాహిత్య అకాడెమీ కోసం రాసిన పుట్టపర్తివారి మోనోగ్రాఫ్ లో పేర్కొన్నారు.
2420 పద్యాల ‘శ్రీనివాస ప్రబంధము’ వంటి సుమారు పదిపద్యకావ్యాలు రాశారు, అయ్యవారు. ‘జనప్రియరామాయణం’ వంటి బృహత్ గేయకావ్యాలు ఉన్నాయి. ‘పండరీభాగవతం’ ద్విపదలో మరో గొప్ప ప్రాచుర్యం, ప్రసిద్ధి పొందిన కావ్యం. సంస్కృతంలో శివకరణామృతం వంటివి వెలయించారు. ‘అభయప్రదానము’ వంటి నవలలు ప్రముఖుల ప్రశంసలు పొందినవే.
వచన రచనలు, పరిశోధనలు, వ్యాసాలు, విమర్శలు.... చాలా సంపుటాలుగా (ఇటీవల ఏక సంకలనంగా వచ్చాయి). పుట్టపర్తివారి ఇంగ్లీషు, మరాఠి, హిందీ, మలయాళం, తెలుగులోనికి, తెలుగునుండి వివిధ భాషలలోనికి పుట్టపర్తి వారు కథలు, నాటకాలు, వచన రచనలు అనువాదాలుగా ప్రకటించారు. ‘ఏకవీర’ని మలయాళంలోకి అనువదించారు!
వారు రాసిన పీఠికలు గల గ్రంథాలు ఇబ్బడిముబ్బడిగా వున్నాయి. కాగా, ఆచార్యులవారు ఆంగ్లంలో - ‘ది హీరో’ అని దుర్యోధనుడు ప్రధాన పాత్రగా నాటకాన్నీ, మహాభాగవతం దశమస్కంధాన్నీ, ‘లీవ్స్ ఇన్ ది విండ్’ అనే పద్య సంపుటిని సృజించారు. వీటిలో ‘హీరో’ డ్రామా షేక్ స్పియర్ నాటకాల స్థాయిని మించినదనీ, పద్యసంపుటిలోని రచనలు మిల్టన్ కవిత్వస్థాయికంటే అమేయమనీ - ఆంగ్ల సాహిత్య విమర్శకులు ప్రశంసించారు. ‘లీవ్స్ ఇన్ ది విండ్’ ని నేను అధ్యక్షుడుగా వున్న కడప-రచన సాహిత్య వేదిక ద్వారా ప్రచురించాము. అదొక ప్రతిష్ఠాత్మక ఆనంద సన్నివేశం!
పాండిత్యాన్ని ఔపోసనపట్టిన అగస్త్యులవారు ఆయన. ఆ భాషాపరశేషభోగి నావంటి వారి భుజంమీద చేయివేసి ఎన్నోసార్లు రామకృష్ణ సమాజం లైబ్రరీలో సాహిత్య సభకు వచ్చి అధ్యక్షత వహించటం జీవితంలో ఒక మహత్తర సంఘటన. అలాగే వారు అధ్యక్షత వహించిన ఆకాశవాణి ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలోని కవిసమ్మేళనాల్లో పాల్గొనటం పూర్వజన్మసుకృతమే.
కర్నూలు దీపావళి కవిసమ్మేళనంలో నేను చదివిన ‘అమావాస్య - దీపావళి’ కవితకు అనన్యమైన ప్రశంస మర్నాటి పత్రికల్లో వస్తే ప్రత్యేకించి అభినందించి, ఆశీర్వదించిన మహోన్నతవ్యక్తిత్వం వారిది. ఆ కవితలో ‘నా పేటకు న్యాయాధిపత్యం రాలేదని వాపోవటం అమావాస్య; జెండా కర్రకు చెద పట్టకుండా జాగ్రత్త వహించటం దీపావళి’ అనే ముక్తాయింపుని మరింతగా ఉదహరిస్తూ వుండేవారు! ఆ కవిత అంతా అలాంటి నడకలోనే ఉన్నది.
చిత్రమైన విషయం, పుట్టపర్తి వారు సాహిత్యపరంగా ఆధునికుల్లో అత్యాధునికులు; ప్రాచీనుల్లో ప్రాచీన వాజ్మయనిధి! వారు అనేక భాషల్లోని ఎందరెందరో సాహితీవేత్తలకు ఆరాధనీయులు, గౌరవాస్పదులు. అలాగే అంతకుమించిన యువ ఆధునిక రచయితలకు వారు గురుస్థానీయులు, ప్రియమైన ఒజ్జలు! పుట్టపర్తివారి నిలువెత్తు కాంస్యవిగ్రహం ప్రొద్దుటూరు ముఖ్య స్థలంలోనూ, కడప పట్టణంలోనూ కూడా ప్రతిష్ఠ చేయబడి ఉంది.
పుట్టపర్తివారిని గురించి తెలుసుకోవటం మాత్రమే కాక, వారిరచనల్నీ చదవగలిగిన వారికి తప్పకుండా ఆ సాహితీ గిరివృక్షం పంచే తెమ్మెరని ఆహ్లాదించే అదృష్టం కలుగుతుంది!
-విహారి