అమ్మ పుట్టిన రోజు
అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా..
ఆవేదన తీరు రోజు ఇంకెన్నడు లేదా...
నెలన్నర తక్కువ తొమ్మిదేళ్లు అమ్మ వెళ్ళిపోయి...
ఈ ఆగస్టు 31 అమ్మ పుట్టినరోజు. మామూలుగా అయితే అర్ధ రాత్రి మహా ముద్దు చేసి, కానుకలిచ్చి, కేకు కోసి, ఆశీర్వచనం తీసుకునే రోజు. కానీతొమ్మిదేళ్ల క్రితం ఆ పుట్టిన రోజు సంతోషం లేదు.
కొడుకుని పోగొట్టుకున్న అమ్మ కన్నీళ్ళ మూటై, మాటలు రానట్లు కూర్చుంది. అమ్మ ముఖం చూసే ధైర్యం లేక మా చెల్లి చీకట్లోకి పారిపోయింది, నేనూ, అమ్మా అలా ఏడ్చుకుంటూ, కనుమరుగైన మా బంగారాన్ని తలచుకుంటూ మారిన తేదీని గడిపాం.
అయినా చెప్పాను అమ్మకి...'అమ్మా, నా తల్లివి నువ్వు ధైర్యంగా ఉంటేనే నాకు బతుకు. నువ్వు బతకాలి...లేకపోతే మేము బతకలేం' అని.....
విన్నదనుకున్నా.. కానీ నా మాట వినలేదు. పుట్టినరోజుకి సరిగ్గా నెలన్నరకి వెళ్ళిపోయింది. 'ఎన్నేళ్ళు బతుకుతానో, మా అమ్మమ్మ పోలిక వస్తే 88 ఏళ్ళు ఉంటా' అని సరదాగా, ఆశగా అనుకున్న అమ్మ, ఇంకా బతకాలన్న ఆశ అడుగంటిపోయి, రేపటి మీద నమ్మకం ఆవిరైపోయి వెళ్ళిపోయింది. ఈ క్షణానికి కూడా అమ్మ నా చేతుల్లోనే వెళ్ళిపోయిన క్షణం గుర్తొస్తే తట్టుకోలేను నేను..
.
ఒకప్పుడు కొడవటిగంటి వరూధినిగారు అన్నారు 'మీ అమ్మ దురదృష్టవంతురాలు.. ఇంకో పదేళ్లున్నా మీరు కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవారని'. దురదృష్టం మాది. అమ్మ ఇంకా ఎన్నో ఏళ్ళు బతకాల్సింది.
.
తొమ్మిదేళ్లు దాదాపు అమ్మ వెళ్ళిపోయి అయినా అమ్మా అనుకోగానే వెర్రి గొంతుకతో అరిచి ఏడవాలనిపిస్తుంది.
తల మీద ఆచ్ఛాదన లేక ఆశీస్సులు ఇచ్చే చల్లని చేయి లేక పిడుగు మీద పడ్డట్లు అవుతుంది.
దిక్కులేని అనాధలుగా దన్ను కోసం దిక్కుల్లో వెతుక్కోడం అవుతుంది.
అమ్మ లేని పిల్లల గతి అంతేగా ఎంత వయసు వచ్చినా..
మైకు పట్టుకోవడం, మాట్లాడడం, గొంతు విప్పడం, పదాలు పలకడం నేర్పింది అమ్మ.
మైక్ తన చేతిలో మంత్రదండం, అమ్మ ఉపన్యాసం ఇస్తే మేజిక్. చెవులప్పగించి వినేవారు. మధురంగా మాట. అప్పుడప్పుడొక పాట. ఏ వేదిక అయినా, ఏ సభ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా సొగసంతా అమ్మదే.
..శుక్రవారాలు అమ్మకి సెలవు
తలంటిన జుట్టు గాలికి ఎగురుతుంటే
మల్లెపూవులా చీర, జాజిపువ్వులా నవ్వు
స్కూల్ నుంచి వచ్చే మాకు
బాల్కనీలో నుంచి స్వాగతం
శుక్రవారాలు ఎందుకో ఎండ
ఇంకా వెచ్చగా, బంగారుగా ఉండేది
.
ఆనాటి ఆ ఎండ కోసం పూటకొకసారి
కిటికీ ఎదుట తారాట్లాడతాను
.
అమ్మ పాపం చేతులు ఎర్రబారగా
చేసిన రవ్వ లడ్డూ తీపి
కోసం వంటింట్లో మరో నిముషం
.
నాన్నా...బయలుదేరావా?
రోజూ డ్యూటీ అవుతూనే అమ్మ పిలుపు
కోసం ఫోన్ వైపు మళ్ళీ మళ్ళీ
అమ్మ నా చేతుల్లోనే నిశ్చలమైన క్షణం
నేను చూస్తుండగా ఆగిపోయిన చివరి ఊపిరి
నిస్సహాయ, నిర్బల, నిరర్థక క్షణం
ఇంకా ఎన్నో విషయాలు అమ్మకి చెప్పనేలేదే,
అయోమయంగా, పిచ్చి కాకిలా ఒక గంట
.
రక్తం, చెమట, కన్నీరు,
మనసు, గుండె, ఆత్మా,
శరీరం, సమయం, శక్తి,
శ్రమ, ఆలోచన, ధ్యాస, ధ్యానం
అన్నీ పిల్లలే అయిన ఆ అమ్మ
గొప్పతల్లుల మధ్య మరింత పిచ్చి తల్లి
అర్ధరాత్రి వేడి అన్నం,
పడుకుంటే కాళ్ళకి ఆయింట్మెంట్,
తలకి కుంకుడు కాయ,
సెలవులకి జంతికలు,
చదువుకుంటుంటే పాలు,
పని చేసుకుంటుంటే ఫ్యాన్ గాలి,
ఏడుస్తుంటే ఓదార్పు,
నవ్వితే మురిపెం,
మా సరదాలంటే శ్రద్ధ,
మా పనిలో ఆసక్తి,
మమ్మల్ని నొప్పించిన వాళ్ళు తనకి శత్రువులు,
మా ఆకలి దప్పులు చూసిన వాళ్ళు తనకి ఆప్తులు
పోయే గంట ముందు కూడా 'నాన్నా, నువ్వు అన్నం తిను.'
‘నాన్నా, దా నా పక్కన్నబజ్జో!’
కారణం లేకుండానే అమ్మని తలచుకుంటాను
గడియ ఒక గదిలో గడుపుతాను
తనని తాను మరచిన ఈగలా ఇల్లంతా తిరుగుతాను
గడచిన ఏళ్ళల్లో పోగొట్టుకున్న పెన్నిధి కోసం
ఆరాటంగా, దిక్కు తోచక పరిగెడతాను
.
అమ్మని రోజూ వెతుక్కుంటాను
.
చివరకి అలమారలో అమ్మ చీరలన్నీ నేల మీద పోసి
ఆ నూలురాశిలో దూరి కళ్ళు మూసుకుని బజ్జుంటాను
మా అమ్మలా మెత్తగా,
అమ్మలా వెచ్చగా
భయం, దుఖం అన్నీ తీసేసుకుని ఏమారుస్తుంది
ఆ చిన్న చీరల కుప్ప... తల్లిప్రేమలా
రచనలు చేయడానికి నాకు ఏ భాషా సరిగ్గా వచ్చి తగలడలేదు కానీ, ముద్దు పేర్లు పెట్టడంలో నా క్రియేటివిటీకి హద్దులు లేవు. నేను పిలిచె అనేకానేకమైన పేర్లలో ఒకటి 'జాజి కొమ్మ'. 'అమ్మా, జాజి కొమ్మా...పూల రెమ్మా ...బుజ్జి అమ్మా...' అని నేను గారం చేస్తే మా అమ్మ చేయించుకునేది. పండువిరా, నా కన్న తల్లివి, నా చిన్న తల్లివి నువ్వేరా అంటే నవ్వేది.
ముక్కుతో పీలిస్తే మనసులోనుంచి, ఆత్మలోకి దిగే మత్తయిన సువాసన, నాజుకైన అందం జాజికొమ్మ సొంతం... మా అమ్మ లాగా.
జానకీరాణికే తెలియదు తాను ఎంతో ఫేమస్ అని. ఎంతో తరచుగా, మేము ప్రయాణించే ప్రతి చోట తురగా జానకీరాణి గారు మీకేమౌతారు అని ఎవరో ఒకరు అడిగితే మా అమ్మ అని సగర్వంగా చెప్పుకుంటాం. ఈ జన్మకి ఆ తల్లి బిడ్డలుగా గుర్తింపు చాలు.
.
మా అమ్మ చదువుల సరస్వతి
నాట్యమయూరి...
సంగీత నిధి...
సాహితీవేత్త...
ప్రసారకర్త...
పిల్లలకి గురువు...
యువతకు స్ఫూర్తి...
అందరికీ అక్కయ్య....
అమ్మ సొగసరి
అమ్మ పనస తొన..
అమ్మ మల్లెమొగ్గ...
జాజికొమ్మ...బంగారం...బుజ్జి..పండు
అమ్మ స్నేహం, అమ్మ ప్రేమ, అమ్మ గారం, అమ్మ కోపం, అమ్మ పెంకితనం, అమ్మ హాస్యం, అమ్మ నవ్వు. చివరకి అమ్మ దుఖం. అమ్మ నిష్క్రమణం.మాకు ప్రాణభిక్ష పెట్టిన అమ్మ. జీవితాన్నిచ్చిన అమ్మ. ఈవేళ బతికి ఉన్నామంటే ఆ అమ్మ దయ. మా అమ్మ దేముడు.పాలు తాగే పాపాయిగా తొలి మాట మ్.. మ్...మ్మా.
బడిలో మొదటి అడుగులో ఆక్రందన అమ్మా..
నాన్న కనిపించరేమిటి అన్న ప్రశ్నలో అమ్మా...
చీకటి వాన భయం దుఃఖం అన్నింటికీ అమ్మ..
బాల్య స్నేహాల లుకలుకలు, తొలి ప్రేమ మనస్తాపాలు
పరుగులో పోటీలు పరీక్షల్లో విజయాలు
ఆట పాట రచన కవిత్వం కపిత్వం అన్నింటికీ అమ్మే.
కొత్త మనిషితో కొత్త జీవితంలో సంశయం 'అమ్మా?'
ఉద్యోగ ధర్మం...రెక్కలు విప్పి గగనతలంలోకి ప్రయాణం
కఠిన నిర్ణయాలు...కన్నీటి పర్వాలు... అమ్మా...
నా నొసటి రాత వంకరపోయిన నాడు ఆర్తిగా
అక్కున చేర్చుకుని దుఃఖ సంద్రమయింది అమ్మే..
చివరకి ఒకానొక నాడు హఠాత్తుగా నిశ్చలమయితే
నేను అరిచి గీపెట్టి పిలిచింది...అమ్మా అమ్మా
నా కన్నతల్లి, బంగారు తల్లి, తెల్లని, మెత్తని మల్లి
బూడిదయ్యేందుకు పంపుతూ గొంతు చించుకుంటూ
పిలుపు అదే..అమ్మా అమ్మా...
ఒంటరిగా పోరాడలేక అలిసిపోతూ ఈనాడు
నా లోపల మార్మోగే పిలుపు అదే....అమ్మా...అమ్మా..
ఈ అమ్మలేనితనం అలవాటు కావడం లేదు..
ముద్ద పెట్టినంత సేపు అమ్మ.
ముద్దు పెట్టినంత సేపు అమ్మ.
బాగుంది.
అమ్మ పెద్దదవుతుంది.
జుట్టు నెరిసిపోతుంది
పట్టు సడలిపోతుంది
తిన్నది అరగదు
మోకాళ్లు అరుగుతాయి
చిరాకు పడుతుంది
పరాకు పెరుగుతుంది
రాత్రుళ్లు నిద్రపోదు
పగళ్లు ఊరుకోదు
మాగాయకి సలహా ఇస్తానంటుంది
మనవరాలికి కథ చెబుతానంటుంది
చెప్పిందే చెప్తుంది
అడిగిందే అడుగుతుంది
గదిలో ఉండలేదు
గడప దాటనివ్వరు
చీర మడత నలిగిందంటుంది
కూర ఖారమయ్యిందంటుంది
కంటి చూపు మందగించినా
కడలంత జీవితం చూశానంటుంది
కళ్లు లేవు పళ్లు లేవు అయినా
నాది పెద్దరికం చూడమంటుంది
'నాన్నా అన్నం తిన్నావా?
రా కూర్చో'
బిడ్డ ముదిరిన ఒళ్లు నిమరాలని తపన
తన అనుభవం మనకొద్దు
తన తాపత్రయం మనకి చిరాకు
గదిలో ఒక మూల ఆమె చిన్నపాటి ఉనికి
మన సరదా జీవితం పైన ఒక మరక
..
ముగ్గుబుట్ట తల..వీపు వంగిన విల్లు
నెత్తురు చీము నీరై...కండ గుండె పొడి అయ్యి
అమ్మ ఒకనాడు ఆవిరి ముద్దవుతుంది
అమ్మ ముసలిది అయిపోతుంది
చివరికొకనాడు కట్టె అయిపోతుంది
అప్పుడూ...అమ్మని ప్రేమించాలి
అమ్మ చల్లని చేయి అమ్మ ఆశీర్వచనం
అమ్మ సంతృప్తి అమ్మ ఆనందం
పట్టని వాడు పుట్టనేమీ వాడు గిట్టనేమి
ఆకాశంలో తళుక్కుమన్న
ఆ నక్షత్రంలో అమ్మ నవ్వు చూశానని
గుండె మీద చేయి వేసుకుని
అంతరాత్మ కళ్ళల్లోకి చూసి
ఆ చివరి రోజు వరకు చెబుతూనే వుంటా
హ్యాపీ బర్త్ డే అమ్మా !
ఆగస్టు 31 మా అమ్మ పుట్టినరోజు
- తురగా ఉషారమణి