అసలైన ఐశ్వర్యం
ఉదయం సుమారు 8 గంటల సమయంలో పక్కింటి ప్రసాదిని హడావిడిగా తమ ఇంటికేసి రావడం చూసి, గాభరా పడ్డాడు రామనాథం. ఆవిడ భర్త ఆరోగ్యం బాగా లేక ప్రక్కనే ఉన్న ఆస్పత్రిలో ఐ.సి.యు.లో ఉన్న విషయం తెలుసు కాబట్టి. “ రండి పిన్నిగారూ! బాబాయిగారికి ఎలా ఉంది? “ అనడిగాడు.
తన ప్రశ్నకి జవాబివ్వకుండా ”బామ్మగారున్నారాండీ? ఆవిడని వెంటనే కలవాలి” అంటూ తన సమాధానానికి యెదురు చూడకుండా రామనాథం తల్లి సామ్రాజ్యమైన వంటింట్లోకి వెళ్ళింది ప్రసాదిని.
అసలు రామనాథం తల్లి అనంతలక్ష్మిని ఆ వీథిలో యెరుగనివారంటూ యెవరూ లేరు. పిన్నవయస్సులోనే భర్తని పోగొట్టుకుని, ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చక్కగా చదివించి, కానీ కట్నం తీసుకోకుండా నిరాడంబరంగా తెలిసినవారి అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంది. వీథిలోని వారందరికీ తలలో నాలుకలా ఉంటుంది. ఇరుగు పొరుగు వారిళ్ళల్లో జరిగే యే శుభ, అశుభ కార్యాలకైనా అనంతలక్ష్మి లేకపోతే అంతే అన్నంతగా ఆమె వారి మనిషయింది. ఆ వీథి వీథికే ఆమె బామ్మగారు. ఆమె సమవయస్కులైనవారు ఆ వీథిలో మరెవ్వరూ లేరా? అంటే ఉన్నారు. కానీ సమయానికి ఆదుకునే సత్తా ఆమెకి మాత్రమే ఉంది. ఆమెలోని ప్రత్యేకతలు అలాంటివి మరి!
ఎప్పుడూ చురుకుగా పనులుచేస్తూ, చలాకీగా ఉంటూ, అటు పెద్దలతో, పిన్నలతో సమానంగా వ్యవహరిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, తెలియనివాటిని తెలుసుకుంటూ, యెదుటివారిని గౌరవిస్తూ, చెరగని చిరునవ్వుతో ఉండే బామ్మ అంటే అందరికీ ఇష్టమే, ఆరాధనే ఆమె తోటి వయస్కులు కొంతమందికి తప్ప.
ఒక నెలక్రితం యెదురింటి వరలక్ష్మి గారి అమ్మాయికి పెళ్ళిచూపులయ్యాయి.పెళ్ళిచూపులకి ముందే తెలిసినవారి ద్వారా వాకబు చేసి, అబ్బాయి బుద్ధిమంతుడన్న సమాచారం తెలుసుకున్నారు వరలక్ష్మి దంపతులు. పిల్లకి మొట్టమొదటి పెళ్ళిచూపులని, పిల్లకి మొదట బామ్మగారి ఆశీస్సులు కావాలని దంపతులు పిల్లతో సహా అనంతలక్ష్మి దగ్గరికి వచ్చారు.
అనంతలక్ష్మి తన బోసినవ్వుతో, మనసారా పిల్లని దీవించి, పిల్లకి తాంబూలం ఇవ్వమని కోడలికి పురమాయించింది. కాదూ కూడదని, వరలక్ష్మి దంపతులు బామ్మగారే పిల్లకి తాంబూలం ఇవ్వాలని పట్టుబట్టి, తరువాత వారిద్దరూ కలిసి బామ్మగారికి నమస్కరించి, దీవెనలందుకున్నారు. అనుకున్నరోజు ఆ పిల్లకి పెళ్ళిచూపులయ్యాయి. పిల్లను చూడటానికి సపరివారంగా వచ్చారు వరునివైపువారు. వచ్చినవారు దాదాపు 30 మంది. ఆ రోజు వాళ్ళందరికీ ఫలహారాలు కూడా బామ్మగారి చేతివే. పిల్ల అందరికీ నచ్చి, అక్కడికక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
వరుడికి ముంబై లో ఉద్యోగం. అబ్బాయి ఉద్యోగంలో చేరి కొంతకాలమే కావటంతో, 10 రోజులు మాత్రమే శెలవు దొరికిందని, వెంటనే అంటే రెండు, మూడు రోజులలో మంచి ముహూర్తం చూడమన్నారు వరుడి తలిదండ్రులు. అంత త్వరగా పెళ్ళి చేయమంటే, యేం చేయాలో తోచక, వారు వెంటనే బామ్మగారికి కబురంపారు. బామ్మగారు వచ్చి “ కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంతే. మీరేం కంగారు పడకండి.” అంటూ వెంటనే పంచాంగం తీసుకుని, వధూవరుల నక్షత్రాలు తెలుసుకుని, రెండురోజులలోనే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని చెప్పి, వారిని ఊరట పరచింది.
“మరి పెళ్ళి చేయడానికి సత్రం, వంటపనులు, బట్టలు, బంధుమిత్రులను పిలవటాలు లాంటివి రెండురోజులలో యెలా చేయగలం?” అన్న వరలక్ష్మి దంపతులకి “ ఇదిగో మీ ఇల్లే పెళ్ళి జరిగే సత్రం. మాఇల్లే వియ్యాలవారి విడిది. సరేనా? ఏదీ ఆలోచించకండి. పెద్దవాళ్ళందరమూ తలో చేయి వస్తే వంటపనులవుతాయి. ఎలాగూ మనం ఉమ్మడిగా పెట్టిన ఆవకాయ, మాగాయ, అప్పడాలు, వడియాలు ఉండనే ఉన్నాయి. చిన్న పిల్లలని ఇళ్ళను శుభ్రం చేసి, ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో అలంకరించమందాం. అతి దగ్గరి బంధువులకి, మిత్రులకి మొబైల్లో పిలవండి. ఈరోజే నిశ్చితార్థం ఐంది కనుక, ఉన్న డబ్బులతో సింపుల్ గా వధూవరులకి, వియ్యంకులకి బట్టలు కొనండి. మీరు యెవరికైనా బట్టలు పెట్టదలుచుకుంటే వీలైతే ఇప్పుడు కొనండి లేకపోతే తరువాత పెట్టండి. ఎవరూ మిమ్మల్ని తప్పుబట్టరు. అలా తప్పుపట్టినా మీరేం బాధపడకండి.
మా తమ్ముడు నారాయణకి తెలిసిన పురోహితుడున్నాడు. ఆయనని వెంటనే పిలుచుకురమ్మన్నానని మా రామనాథంతో కబురు పెట్టమంటాను. నాదస్వరానికి చక్కగా ఆడియోలు ఉన్నాయి. కాదూ కూడదంటే మా తమ్ముడినే దానికి కూడా యేర్పాటు చేయమంటాను. సరేనా? మీకు యేమైనా ధనసహాయం కావాలన్నా, అందరమూ తలా కొంచెం చేస్తాం. ఇక పెళ్ళి పనులు మొదలుపెడదాం ” అంటూ ఐదు నిమిషాలలో పెళ్ళియేర్పాట్లన్నీ చేసిన బామ్మగారి చాతుర్యానికి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయి, శిలాప్రతిమలయ్యారు.
వారు తేరుకొనేలోపే అనంతలక్ష్మి చక చకా పాలు కాచి, చక్కటి ఫిల్టర్ కాఫీ అందించింది అందరికీ. కోడలికీ, మనవరాలికి, కొడుకుకీ పెళ్ళి పనులన్నీ పురమాయించింది.
అనుకున్న విధంగా, నిశ్చయించిన ముహూర్తానికి పెళ్ళి నిరాడంబరంగా, కానీ వీథి వీథం తా పాల్గొని, పాతకాలం పెళ్ళిలా, యెంతో సంబరంగా, సందడిగా జరిగింది.
అంతదాకా తమని పట్టించుకోలేదని బాధపడే పెద్దవారైన మామ్మలు, బామ్మలు తమ నైపుణ్యాన్ని చూపే సమయం వచ్చిందని సంబరపడి, తమ శాయశక్తులా పనిచేశారు. వీరి ఆప్యాయతానురాగాలకి వియ్యంకులు ఉబ్బి, తబ్బిబ్బైపోయారు.
ఇక వంటలైతే అదిరాయి. మర్యాదలు చేయడానికి అందరూ ముందుకి వచ్చారు. అంతదాకా బాధ్యతలు లేకుండా , పనులు చేయడమే యెరుగని యువత తమకిచ్చిన పనులను సక్రమంగా చేసి, పెద్దల మన్ననలందుకున్నారు. ఇక అప్పగింతలప్పుడు వధువుతో బాటు, వరుడు, వియ్యంకులు కూడా కంటతడి పెట్టడం చూసి, అందరి కళ్ళూ చెమర్చాయి. ఎలాగైతేనేం? పెళ్ళి బాగా జరిగి, ఆ అమ్మాయి సుఖంగా ముంబైలో కాపురం చేసుకుంటోంది. దానికంతా బామ్మగారి చలవే కారణమని వీథి వీథంతా బామ్మగారిని పొగిడారు, అంతదాకా బామ్మగారిమీద గుర్రు ఉన్న సాటి బామ్మలతో సహా.
ఇక వాస్తవం లోనికి వద్దాం. ఐ.సి.యు.లో ఉన్న ప్రసాదిని భర్త స్పృహ లోకి రాగానే, మొదట బామ్మగారిని చూడాలనుందని అన్నాడట. అంతే పరుగు పరుగున బామ్మగారి దగ్గరికి వచ్చింది ప్రసాదిని. స్నానం చేసి, భక్తితో దేవుని పూజచేసి, కర్పూరహారతినిచ్చి, తీర్థప్రసాదాలతో బయటికి వచ్చిన బామ్మగారి పాదాలమీద పడిపోయింది ప్రసాదిని.
“ అబ్బాయి ఎలా ఉన్నాడే?” అని ఆప్యాయంగా అడిగింది. “మీ చలవ వల్ల ఆయన బాగున్నారు. మిమ్మల్ని వెంటనే చూడాలంటున్నారు.” అంది ప్రసాదిని. “ దానికేం భాగ్యం? మొదట ఈ తీర్థప్రసాదాలు … అంటూ అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చింది. “అమ్మాయ్! అబ్బాయిని చూసొస్తాను” అంటూ కోడలికి చెప్పి, ప్రసాదినితో బయల్దేరింది.
ఆ తరువాత ప్రసాదిని భర్త బామ్మగారి ఆశీస్సులందుకోవడం, క్షేమంగా ఇంటికి రావడం జరిగాయనుకోండి.
అలాగే ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. రెండిళ్ళవతల ఉండే సారసాక్షికి ముగ్గురు కూతుళ్ళు. మొదటి అమ్మాయి సుగాత్రికి పెళ్ళి కుదిరింది. తమ ఆనవాయితీ ప్రకారం ప్రక్క ఊర్లో ఉన్న తమ కులదేవత గుడిలో పెళ్ళి చేయాలని సారసాక్షి అన్నది. కాదూ కూడదని, తమ ఒక్కగానొక్క కొడుకుకి ఆర్భాటంగా వివాహం జరిపించాలని పెళ్ళికొడుకు తల్లి పట్టుబట్టింది. అలా జరపకపోతే, తమవారిలో తమ పరువు పోతుందనీ, తమ పలుకుబడి తగ్గుతుందనీ ఆమె వాదం.
ఆనవాయితీ మారిస్తే, యే అవాంతరాలు వస్తాయో నని సారసాక్షికి భయం, దిగులు. తన పంతమే నెగ్గాలని పెళ్ళికొడుకు తల్లి అలకపాన్పు యెక్కేంత పనిచేసింది. తన చెల్లి కోరిక తీరకపోతే, పెళ్ళిని ఆపుచేస్తానని, ఆమె ముఖంలో నిరాశని, కోపాన్ని చూడలేనని వియ్యంకురాలి అన్నగారు ఖరాఖండిగా చెప్పేశాడు. ఆ మాట విన్న వియ్యంకురాలు, రాని కన్నీటిని తుడుచుకుంటూ, ముక్కుని తెగ చీదేసింది.
సారసాక్షి దంపతులకి పెళ్ళి ఆగిపోతే వచ్చే నష్టాలు, కలిగే అవమానం, ఇరుగు పొరుగువారి మాటలు కళ్ళముందు సినిమా రీళ్ళలాగా కనబడి, గుండెలు జారిపోయాయి. ఇక చేసేదిలేక వాళ్ళు తమ కాబోయే వియ్యంకులతో బామ్మ గారి దగ్గరకు వచ్చారు, పరిష్కారం కొరకు.
రెండువైపుల వాదనలు విని, బామ్మగారు “ఇంత చిన్న విషయానికి అంత బెంబేలు పడితే యెలాగ? కాస్త నిదానంగా ఆలోచిస్తే, అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది”అంటూ “ అమ్మాయ్! కాస్త అందరికీ కాఫీ చేసి పట్టుకురా” అంటూ కోడలికి పురమాయించింది. “ అబ్బెబ్బీ! అవన్నీ యెందుకండీ?” అంటూ ఇబ్బందిపడుతున్న వియ్యంకులతో “ మొదట కాస్త స్థిమితంగా ఉండండి. సుగాత్రి కూడా నా మనవరాలే. కనుక మీరు నిస్సంకోచంగా నాతో మాట్లాడవచ్చు.అవును, మీకు మీ అబ్బాయి పెళ్ళి బాగా జరిపించాలని ఉందా? లేక వచ్చినవారికి బాగా ఆర్బాటంగా సౌకర్యాలు చేయాలని ఉందా?” అని నిదానంగా అడిగింది.
“వచ్చినవారికి బా…గా… అన్ని సౌకర్యాలు చేయాలి. వారికి చేసేవాటిల్లో యెటువంటి లోపం ఉండకూడదు” అని ఠక్కున సమాధానమిచ్చింది కాబోయే వియ్యపురాలు. ఇంతలో కాఫీలు వచ్చాయి. అందరూ నింపాదిగా తాగసాగారు.
అప్పుడు మెల్లగా బామ్మగారు ”ఐతే పెళ్ళిని సారసాక్షిదంపతుల ఇంటి ఆనవాయితీ ప్రకారం గుడిలో జరిపించి, అక్కడ తీర్థప్రసాదాలను ముగించి, తరువాత అక్కడినుండి నేరుగా ఇక్కడ ఉన్న శ్రీరామనివాస్ అదే ఈ మధ్యే క్రొత్తగా కట్టారు… అక్కడ హాలులో భోజనాలు యేర్పాటు చేసుకుంటే సరి. ఆ హాలు బాగా పెద్దగానూ, అన్నిసౌకర్యాలతోను ఉంటుంది. మీ కోరికా నెరవేరినట్లవుతుంది.” అంటూ సమస్యను పరిష్కరించింది.
ఆ సలహా ఇరువైపులవారికి హాయిని, ఆనందాన్ని, ప్రశాంతతని కలిగించింది.
ఇలా బామ్మగారి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో….
బామ్మగారికి వీథిలోని వారందరూ బ్రహ్మరథం పట్టారంటే ఆవిడకున్న ఐశ్వర్యమంతా – తోటివారిమీద ఉన్న నిస్వార్థమైన అవ్యాజ్యమైన ప్రేమ, కరుణ, అందరూ బాగుండాలన్న తపన.
“పరోపకారం ఇదం శరీరం, సర్వే జనా: సుఖినో భవన్తు” అన్న
సూక్తులు అందరికీ తెలుసు , కానీ వాటిని పాటించేవారినే అసలైన ఐశ్వర్యం వరిస్తుంది.
తిరుమల ఆముక్తమాల్యద
(చెన్నై)