తాయెత్తు మహిమ
మేఘశ్యామంగారికి ఒక్కడే కొడుకు. అతడి పేరు తంతువర్ధన్. అతడికి పదేళ్ళు. అతడికి అఖండమైన తెలివితేటలున్నాయి. ఏకసంథాగ్రాహి. కాని అతడికి ఒక పెద్ద బలహీనత ఉంది. ఎంత చదువుకుని పరీక్షలకు వెళ్ళినా, పరీక్షహాలు లోనికి అడుగెట్టిన మరుక్షణం ముచ్చెమటలు పోసేస్తాయి. చదువుకున్నవి ఏవీ అస్సలు గుర్తుకు రావు. అలాగే నలుగురి మధ్యకు వెళ్ళినప్పుడు మాట్లాడాలన్నా ఎంతో బెరుకుగా ఉంటుంది. నోటివెంబడి ఒక్క మాట కూడా రాదు.
మేఘశ్యామంగారికి అతడి విషయంలో చాలా ఆందోళనగా ఉండేది. చివరికి ఒక మిత్రుడి సలహా మేరకు తంతువర్ధన్ని రాజమండ్రిలో ఉన్న ఒక స్వామీజీ వద్దకు తీసికెళ్ళాడు. ఆయనతో విషయమంతా వివరించి చెప్పగా ఆయన ఒక వెండి తాయెత్తును మంత్రించి ఒక వెండిగొలుసులో బిగించి తంతువర్ధన్ని ఆశీర్వదించి అతడి మెడలో వేసారు.
'నాయనా! ఇది చాలా మహిమ గల తాయెత్తు. ఇది నీ మెడలో ఉంటే నీకు ఎప్పుడూ అఖండమైన విజయం ప్రాప్తిస్తుంది. ఇంక ధైర్యంగా ఉండు." అని అతడికి చెప్పారు.
ఆ తాయెత్తు ధరించినప్పటినుంచి తంతువర్ధన్లో విపరీతమైన మార్పు వచ్చేసింది. పరీక్ష వ్రాసేముందు ఆ తాయెత్తును చేతితో తాకి పరీక్ష వ్రాసేవాడు. అంతే, పరీక్షల్లో ఫస్టుమార్కులు వచ్చేవి. వక్తృత్వపోటీలు జరిగితే మెడలో ఉన్న తాయెత్తును ఒక్కసారి తాకి, ఉపన్యసించేవాడు. అంతే, అతడికే మొదటి బహుమతి వచ్చేది.
తంతువర్ధన్ పెరిగి పెద్దయాడు. సివిల్స్ పరీక్షలు వ్రాసాడు. అతడికి మంచి రేంకు వచ్చింది. అతడిని ఇంటర్వ్యూకి పిలిచారు. అతడు చాలా ధైర్యంగా వెళ్ళాడు. ఇంక ఇంటర్వ్యూ హాలులోకి అడుగు పెడతాడనగా ఒక్కసారి మెడలో ఉన్న తాయెత్తును తాకబోయాడు. మెడలో తాయెత్తు లేదు. మెడంతా తడిమి తడిమి చూసుకున్నాడు. లేదు. ఏమై వుంటుంది? స్నానం చేయడానికి బనీను విప్పినప్పుడు బనీనులో చిక్కుపడి బనీనుతో పాటు వచ్చేసి ఉంటుంది. ఆ బనీను బాత్రూమ్ లోనే వంకీకి వదిలేసాడు. ఇప్పుడెల్లాగు? అతడికి కంగారు వచ్చేసింది. ఇంతలో అతడికి పిలుపు వచ్చేసింది. దడదడలాడుతూ లోనికి వెళ్ళాడు. అక్కడ అధికారులు అడిగే ప్రశ్నలు అతడి చెవిలో పడటల్లేదు. ముచ్చెమటలు పోస్తున్నాయి. చెవిలో హోరు మొదలైంది. నోటినుంచి ఒక్క మాట కూడా పెగలలేదు. అధికారులు చికాకుగా, 'యూ మే గో నౌ.' అనగానే, బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చిపడ్డాడు.
ఇంటికి వెళ్ళగానే మేఘశ్యామంగారు 'నాయనా! ఇంటర్వ్యూ బాగా చేసావా?' అని అడిగారు. తంతువర్ధన్ బిక్కమొహం వేసి జరిగింది చెప్పాడు. తరువాత తంతువర్ధన్ బాత్రూమ్లో బనీను తీసి చూసాడు. తాయెత్తు లేదు. అది ఎక్కడ పడిపోయిందో అని ఇల్లంతా వెతికాడు. కనపడలేదు. మేఘశ్యామంగారు అతడి ఆందోళనను గమనిస్తూనే ఉన్నారు. చివరికి తంతువర్ధన్ పట్టుపడితే అతడిని తీసుకుని రాజమండ్రి స్వామీజీ వద్దకు వెళ్ళారు.
స్వామీజీ తంతువర్ధన్ని తన మందిరంలోనికి పిలిచారు. తంతువర్ధన్ ఆయన కాళ్ళకి మ్రొక్కి జరిగినదంతా వివరించి మరొక తాయెత్తును ప్రసాదించమని కోరాడు.
స్వామీజీ నవ్వి, "నాయనా, ఇప్పుడు నీ వయసు ఎంత?' అని అడిగారు. అతడు 'ఇరవైయారు సంవత్సరాలు' అని చెప్పాడు. స్వామీజీ గంభీరంగా అన్నారు. 'జరిగే ప్రతి సంఘటనకు వెనకాల దైవసంకల్పం ఉంటుంది. ఆ తాయెత్తు నిన్ను విడిచి వెళిపోయిందంటే ఇంక దాని అవసరం నీకు లేదన్నమాట. నీలో ఆత్మనిర్భరత వచ్చిందన్నమాట. చిన్నప్పుడు నీకు నడక రానప్పుడు నీ తల్లి నీ చేయి పుచ్చుకుని నిన్ను నడిపిస్తుంది. నీకు మాటలు రానప్పుడు 'ఊ, ఉక్కు, ఉంగా' అంటూ నీకు మాటలు నేర్పిస్తుంది. నీకు నడక వచ్చిన తరువాత కూడా రోజూ నీ తల్లి వచ్చి నీ చేయి పుచ్చుకుని నీ చేత అడుగులు వేయించాలని నువ్వు కోరుకోకూడదు కదా? నీ శక్తిని నువ్వు తెలుసుకో. నీ లోని ప్రతిభను గమనించు. స్వతహాగా నీలో తెలివితేటలు ఉండబట్టే, నువ్వు వాటిని ఉపయోగించుకుంటూ విజయాలు సాధించడానికి నీ వంతు ప్రయత్నాలు నువ్వు చేస్తుండబట్టే దైవబలం కూడా నీకు తోడయింది. ఇప్పటి నుంచి నీలోని భయాలు తొలగిపోవాలంటే రోజూ చక్కగా మెడిటేషన్ చెయ్యి. ప్రాణాయామం చేస్తూవుండు. ఆటోసజెషన్స్ ఇచ్చుకుంటూ ఆత్మవిశ్వాసం పెంచుకో. కేవలం తాయెత్తుల మీద, మంత్రశక్తుల మీద ఆధారపడడం మానివెయ్యి. భగవద్గీత రోజూ అధ్యయనం చెయ్యి. అందులో పరమాత్మ ఏమి చెప్పాడో అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకో. నీ వంతు కర్మ నువ్వు చెయ్యి. ఫలితం గురించి ఆందోళన చెందకు. నీ విధ్యుక్తధర్మాలని నువ్వు ఆచరించు. సంశయాత్మా వినశ్యతి అని కదా భగవంతుడు అన్నది? ఆందోళనతోను, ఈ పని నేను చెయ్యలేనేమో అన్న భయంతోనూ నువ్వు ఏ పనయినా ప్రారంభిస్తే విజయాన్ని నువ్వు సాధించలేవు. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. ఆత్మవిశ్వాసంతో అన్నింటిలోను విజయాలను సాధించు. అర్థమయిందా నాయనా?'
తంతువర్ధన్కి వారు చెబుతున్న మాటలలోని నిజం మెల్లిగా అవగాహనలోనికి వచ్చింది. తన మనసులో ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. ఒక స్పష్టత వచ్చేసింది. 'అర్థమయింది స్వామీ. మీరు నిజంగా మహా
మహిమాన్వితులు. కేవలం భగవత్స్వరూపులు. లోకకల్యాణమే తమరి ఆశయం గాని, మాయలు చూపి ధనార్జన చెయ్యడం కాదు. మీ వలన నాలాంటి ఎందరి జీవితాలో బాగుపడుతున్నాయి. తమలో గీతోపదేశం చేసిన శ్రీకృష్ణపరమాత్మని నేను దర్శించుకుంటున్నాను. ఆశీర్వదించండి స్వామీ.' అని ఆయన పాదాలకి మ్రొక్కి, ఆయన ఆశీస్సులు తీసుకుని వచ్చేసాడు.
ఇంక విజయానికి ఏ మెట్లు ఎక్కాలో ఏ పుస్తకాలూ చదవకుండానే అతడికి తెలిసిపోయింది. ఈ నాడు అతడు కర్తవ్యదీక్షతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న ఒక ఐ.ఏ.యస్ అధికారిగా జీవితం గడుపుతున్నాడు.
- పెయ్యేటి రంగారావు (నార్త్ కెరొలినా ,అమెరికా)