Telugu Global
Arts & Literature

తస్మాత్.. జాగ్రత్త!! (కథ)

తస్మాత్.. జాగ్రత్త!! (కథ)
X

తస్మాత్.. జాగ్రత్త!! (కథ)

" గురునాథ్ ఎక్కడవున్నావ్ ?"

" గుడ్ మాణింగ్ సార్… బ్రాంచిలోనే ఉన్నాను సార్"

" నిజమే చెబుతున్నందుకు నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలయ్యా! ఎన్నిసార్లు చెప్పాను, బ్రాంచిలో కూర్చుంటే బిజినెస్ పెరగదూ అని? రికవరీలు అవవని! నువ్వు మాత్రం మారవు."

" అంటే సింగిల్ ఆఫీసర్ బ్రాంచ్ కదా సార్ . అవసరమౌతుంది సార్ "

" నాకు తెలియదా ఏ జీ ఎం ని, నీ బ్రాంచ్ ఏంటో దాని అవసరాలేంటో. పదిరోజుల్లో క్వార్టర్ ఎండ్ పెట్టుకొని బ్రాంచ్ నుండి కాలు బయట పెట్టవు, టార్గెట్స్ రీచ్ కాకపోతే ఇన్స్పెక్షన్ కి వెళ్ళడానికి రెడీగా ఉండు".

"టార్గెట్స్ రీచ్ అవుతాను సార్"

" చూస్తాను, లేకపోతే నేను చెప్పింది చేసే వాడినే. నీకు బాగా తెలుసుగా. టార్గెట్స్ రీచ్ అయి బెస్ట్ మేనేజర్ అనిపించుకో."

ఇక్కడిదాకా జరిగిన సంభాషణ ప్రతి బ్యాంక్ మేనేజర్ జీవితంలో - సూర్యుడు తూర్పున ఉదయించును - అని చెప్పుకునేంత సహజంగా జరిగేదే!

ఇంతలో క్యాబిన్ లోకి వచ్చిన క్లర్క్ వరుణ్, మేనేజర్ గురునాథ్ మొబైల్ ఫోన్ బల్లమీద పెట్టడం చూసి -

" ఎవరు సార్?"

" ఇంకెవరు…. నా మొగుడు! ఏ జీ ఎం"

" ఏమన్నారు సార్? విజిట్ ఏమైన ఉందా సారుది?"

" అదొక్కటే తక్కువ ఎదురుగా కూర్చొని తిట్టడానికి"

"అట్లానే అంటారు సార్ వాళ్ళు, లేకపోతే మనం ఎక్స్ట్రా కష్ట పడం అని"

" ఇప్పుడు ఈ వయసులో ఎండలో ఎక్కడ తిరుగుతాం ? తిరిగినా ఇన్నాళ్లు కట్టనివాడు, నేను వచ్చానని కడతాడుటయ్య! అదీ బిజినెస్ అవర్స్ లో తిరగమన్నాడు. ఇక్కడ కస్టమర్స్ కు ఎవడు సమాధానం చెబుతాడు".

"ఈ పది రోజులూ బిజినెస్ అవర్స్ అవగానే క్యాష్ పెట్టేసి మీరు రికవరీ కి వెళ్ళండి సార్. బ్రాంచ్ నేనూ అటెండర్ క్లోజ్ చేస్తాం".

"ఆయన ఎంత కష్టపడి పనిచేసి పైకి వచ్చాడో నాకు తెలియదా? మేమిద్దరం ఒకేసారి బ్యాంకులో చేరాం ఒకే బ్రాంచ్ లో. చేసినది చిటికెడు అయితే చెప్పుకునేది చాటెడు! కాకాలు బాగా పట్టి ప్రమోషన్ లు కొట్టేశాడు. నేనేమో పాతిక సంవత్సరాలు క్లర్క్ గా ఉండి, రిటైర్మెంట్ అప్పుడు ఆఫీసర్ గా రిటైర్ అయితే పెన్షన్ ఎక్కువ వస్తుందని కక్కుర్తి పడ్డాను".

" మీ అమ్మాయి పెళ్లి గురించి చెప్పారా సార్. ఇప్పుడు నెల ముందు చెప్పుకుంటే గానీ అప్పటికి సెలవు దొరకదు సార్. ఎవరినైనా డిప్యూట్ చెయ్యాలి కదా సార్ మీ ప్లేస్ లో అన్ని రోజులకీ?"

" అసలు మామూలుగా మాట్లాడితేగా చెప్పుకోడానికి పెళ్లి గురించి. ఆయన ధోరణిలో ఆయన కు కావల్సింది ఆయన చెప్పాడు."

" మీరు మాత్రం ముందే అప్లయ్ చేసేయండి సార్ సెలవు" ఉచిత సలహా పడేసి లేచాడు వరుణ్.

***

నెల తర్వాత - లంచ్ గదిలో తల పట్టుకు కూర్చొన్న గురునాథ్ ఎదురుగా ఉన్న వరుణ్ -

" ఏంటి సార్… ఇవాళ కూడా సెలవు గురించి తెలియలేదా సాంక్షన్ చేస్తోంది లేనిది?"

" చెప్పడం లేదయ్యా… టెన్షన్ పెడుతున్నాడు."

" ఇంకా నాలుగు రోజుల్లోనే కదా సార్ పెళ్లి ఉంది, ఎలా?"

"......."

" పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సంగతి చెప్పండి సార్ ."

" మాట్లాడాను. ఎందుకో నా పేరు చెబితేనే అగ్గి బుగ్గి అవుతున్నాడట ఏ జీ ఎం."

" లంచ్ చేసి ఆయనకే ఫోన్ చేసి రిక్వెస్ట్ చెయ్యండి సార్. మీకు తెలిసిన ఆయనే కదా."

" చేస్తాను" అంటూ లేచాడు గురునాథ్.మరో గంటకి ఏ జీ ఎం, తానే గురునాథ్ కి ఫోన్ చేసి -

" గురునాథ్…. ఇంకో గంటలో మీ బ్రాంచ్ కి మార్కెటింగ్ ఆఫీసర్ కరుణాకర్ వస్తాడు. అతనికి ఛార్జ్ ఇచ్చి వెళ్లు. ఇంకో మాట… నేను చిటికెడు చేసి చాటెడు చేశానని చెప్పుకునే వాడినే, కాకాలు పట్టె వాడినే. అదీ ఒక అవసరమైన గుణమే. దానివల్ల ఎవరికీ అన్యాయం జరగలేదు. బాస్ లకి కావలసింది చేశాను. "

ఫోన్ వింటున్న గురునాథ్ కి చెమటలు పట్ట సాగాయి. వరుణ్ గానీ ఆయన చెవికి మోసేసాడా - అని ఆలోచించ సాగాడు. చివరగా ఫోన్ పెట్టే ముందు -

" గురునాథ్… నీ మంచి కోసమే చెబుతున్నా… ఫోన్ లో మాట్లాడిన అవతల వ్యక్తి - ఫోన్ పెట్టేసాడు - అని గుర్తించాకనే అతన్ని విమర్శించే జాగ్రత్త ఉండాలి! "

చెప్పాడు ఏ జీ ఎం

-రా. శా. (రాయపెద్ది అప్పాశేష శాస్త్రి)

First Published:  29 Dec 2022 12:33 PM IST
Next Story