Telugu Global
Arts & Literature

మా బడి మర్రి చెట్టు నీడన (కథ)

మా బడి మర్రి చెట్టు నీడన (కథ)
X

స్కూల్లో చదువుకున్న రోజులు జ్ఞాపకం వస్తే ఎవరికైనా వొళ్ళు పులకరిస్తుంది, బాల్య స్నేహితుల్నీ, అప్పటి ఆటలూ, అల్లరినీ తలుచుకుని. ఆనంద్‌కి ఈ మధ్య మరీ జ్ఞాపకం వస్తోంది జనగామలో తను చదివిన ప్రభుత్వ పాఠశాల ఆహ్లాదకర వాతావరణం! చాలా పెద్ద ఆటస్థలం ఉండేది, ఈ రోజుల్లో ఊహించలేము కూడా! అందులో ఒక మూల ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఖాళీ గంటలలో అక్కడ చేరి ఆడుకునేవాళ్ళు. చెట్టుపైన పక్షుల కువ కువలు వినసొంపుగావుండేవి.

అప్పటి తన హైస్కూల్‌మేట్స్ అంతా ఇపుడెలా ఉన్నారో? స్కూల్లో మర్రిచెట్టు మీద పక్షి పిల్లలు రెక్కలొచ్చి తలావొకవైపు ఎగిరిపోయినట్టు అంతా పైచదువులు ముగించి ఎక్కడో ఉద్యోగమో, వ్యాపారమో చేస్తుండివుంటారు. తనిప్పుడు హైదరాబాదులో ఒక ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్. మరి శ్రీను, సంపత్, సదానంద్, అన్నారెడ్డి, వీళ్ళంతా ఎక్కడో? జాడ తెలిస్తే బాగుణ్ణని మనసులో ఎన్నిసార్లు అనుకున్నాడో!

ఈమాట పైకే అన్నాడు ఒకసారి తన శ్రీమతి విరజతో. వెంటనే ఆమె ఒక మంచి సలహా ఇచ్చింది, “దాందేముంది, పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఏర్పాటు

చేస్తే సరి!"

భేషైన ఐడియా! వెంటనే ఒక నోట్‌బుక్ తీసుకుని ఫోన్ నంబర్లు, అడ్రసులు సేకరించే పనిలోపడ్డాడు.

అనుకోకుండా ఒకసారి కారులో జనగామ మీదుగా వెళ్ళాల్సివచ్చింది పనిమీద. తన పాత స్కూల్ దగ్గర ఆగి స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ తీయించి ,తన బ్యాచ్ పిల్లలందరి పేర్లు నోట్‌చేసుకున్నాడు. మొత్తం నలభై ఐదు మంది తమ బ్యాచ్‌లో!

మొదట తనతో ఇప్పటికీ టచ్‌లోవున్న సుధాకర్‌కి ఫోన్ చేశాడు. తన దగ్గర మరో మిత్రుడి నంబర్ సంపాదించి వెంటనే వాడికి ఫోన్ చేశాడు. అతని ద్వారా మరో నంబరు ... అలా లింకులు అందిపుచ్చుకుంటూ ఒక్కొక్కరినే వెతికి పట్టుకున్నాడు, ఫోన్ ద్వారా. నెమ్మదిగా నోట్‌బుక్‌లో పేర్లు, నంబర్లు చిరునామాల జాబితా పెరుగుతోంది. ఫోన్‌లో వాళ్ళను పలకరిస్తుంటే విస్తుపోయే వాస్తవాలు, వింత అనుభూతి – పాత జ్ఞాపకాలు కలబోసుకుంటూ అప్పుడే పెద్దవాళ్ళమయామా అని చిత్రపడడం! తనతో ఆడి పాడిన నాటి చిన్న పిల్లలు ఇప్పుడు బాధ్యత గల ఇంటిపెద్దలు, సంఘంలో ఒక ఉచిత స్థానంలో ఉన్నారు చాలామంది! క్లాసులో బాగా అల్లరిచేసే సదానంద్ ఇప్పుడు ఒక ఊరి సర్పంచుగా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే శ్రీను ఇప్పుడు ఎల్ఐసీ ఏజెంట్! 'హా విధీ, నీ విధానము నేమందును!'

నవ్వుకున్నాడు.

"ఏమిటి, మీలో మీరు నవ్వుకుంటున్నారు?" విరజ వంటింట్లోంచి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. విషయం చెపితే ఆమే నవ్వింది చిన్నగా.

ఆనంద్ ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని ముందుగదిలోకి రాగానే విరజ చెప్పింది, "మీ స్కూల్ ఫ్రండ్ శ్రావణ్అట, మీ మిస్డ్ కాల్ చూసి ఫోన్‌చేశాడు!"

ఆనంద్ ఆత్రంగా ఫోన్ అందుకున్నాడు, తనిప్పుడు బోనగిరిలో ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్, ఉండేది హైదరాబాదే! శ్రావణ్ రేసులో గెలుపు గుర్రంలాంటివాడు, మొదట్లో చదువులో వెనకబడి వుండేవాడు, ఏమయిందో, ఒక్కసారి పుస్తకాల పురుగైపోయాడు!

"ఓఁ వండర్ఫుల్! నేనిప్పుడు ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ని, హైదరాబాదులోనే! ఇక్కడే ఉన్నా తెలియలేదు ఇన్నాళ్ళు!" చాలా సేపు చిన్నప్పటి కబుర్లు, తన జాబ్ ఎంత బిజీగావుంటుందో, దాని గురించి మాట్లాడ్తుండిపోయాడు శ్రావణ్. ఇద్దరూ ఫోన్‌లో పాత కబుర్లు కలబోసుకున్నాక ఆనంద్ చెప్పాడు, జనగామ గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థుల పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఏర్పాటు చెయ్యాలనే తన కోరికగురించి.

"తప్పకుండా, నా దగ్గర వీరు, అదే, మన వీరేంద్ర గాడి ఫోన్ నంబరుంది, పంపిస్తాను. వాడికీ తెలియజెయ్యి, వాడిప్పుడు బిజినెస్ చేస్తున్నాడు!" శ్రావణ్ ఫోన్ పెట్టేసాడు.

ఒకసారి తన నోట్‌బుక్ తెరిచి తన జాబితా సరిచూసుకున్నాడు ఆనంద్, ఇప్పటికే మూడొంతులమంది వివరాలు తెలిశాయి. అన్నారెడ్డి క్యాన్సర్ వచ్చి చనిపోయాడని తెలిసింది. కృష్ణమూర్తి ఏక్సిడెంట్‌లో పోయాడట. విధి వైపరిత్యం! కానీ ఒక విషయం ఆనంద్‌ని చాలా కలవరపెట్టింది. క్లాసులో తనతో చదువులో పోటీపడే సుధీర్ ఏమయ్యాడో ఎవరూ చెప్పలేకపోయారు. వాడికి లెక్కల్లో నూటికి తొంబై పైన వచ్చేవి. తనకి జెలసీగావుండేది. తనేమో లెక్కల్లో పూర్. తనకి లెక్కల డౌట్లన్నీ తీర్చేది అతనే! ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు.

"ఒకవేళ తనుకూడా అన్నారెడ్డిలా ..." అంటే విరజ వెంటనే అన్నది, "ఛ, అలా అనకండీ, అమంగళం ప్రతిహతమౌ గాక!"

"అలా కావద్దనే మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను!" తనలో తను అనుకుంటున్నట్టు పైకే అనేశాడు.

జనవరి నెల, రెండో శనివారం ... సమావేశం రోజు రానేవచ్చింది. పొద్దు పొద్దునే స్కూల్ చేరుకుని మీటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైపోయాడు ఆనంద్. తన చిన్నప్పటి మర్రిచెట్టు అక్కడ యధాతధంగా ఉంది. చూడగానే ప్రాణం లేచివచ్చినట్టయింది, తన చిన్నతనం తీపి గుర్తులకు అది మౌన సాక్షి! పదిన్నర అయ్యేసరికి దాదాపు అంతా వచ్చేశారు. ముఖ్యంగా అప్పటి టీచర్లు,ముసలి తనంలో చేతకాకున్నా వచ్చారు. శేఖర్ మాస్టారికైతే కళ్ళు చెమర్చినయ్, తన పాత విద్యార్థుల ఆప్యాయత, ప్రగతి చూసి!

మీటింగ్ మరికాసేపట్లో మొదలౌతుందనగా వచ్చాడు సుధీర్! మనిషిలో వయసుని మించిన పెద్దతనం, బట్టలు, సాదాగా వున్నయి, కనీసం ఇస్త్రీ కూడాలేదు. నిన్ననే ఎవరో చెపితే ఈ కార్యక్రమం గురించి, బయలుదేరి వచ్చేశాడట! ఆనంద్ సంతోషంతో కౌగిలించుకున్నాడు వాణ్ణి, "సుధీర్, ఏం చేస్తున్నావ్? ఎలావున్నావ్?" ఆత్రంగా అడిగాడు. సుధీర్ చాలా సంకోచంగా చెప్పాలా వద్దా అని సందేహిస్తూ చెప్పాడు, " టెన్త్ కాగానే మా నాన్న చనిపోయాడు. చదువు ఆగిపోయింది. బతుకు తెరువు కోసం ఏదైనా ఒక పనిచెయ్యాల్సిన పరిస్థితి … ఇప్పుడు నేనొక వ్యవసాయ కూలీని!"

ఆనంద్‌కి కాళ్ళ క్రింద భూమి కదిలిపోయినట్టయింది, కళ్ళు చెమరుస్తున్నయి. వెంటనే సర్దుకుని, "మనం తరవాత తీరిగ్గా

మాట్లాడుకుందాం, రా, రా!" అంటూ చెయ్యి అందుకుని అల్పాహారం తిని వచ్చి కూర్చోమని తీసికెళ్ళాడు.

అంతా గుంపుగాచేరి మాట్లాడు కుంటున్నారు. స్కూల్లో అప్పుడు ప్రయోగించిన కొంటె పేర్లు సరదాగా గుర్తుచేస్తూ, "అరేయ్," "ఏరా" అప్పటి ఆప్యాయపు పిలుపులతో, తరుగుతున్న జుట్టు మీద, పెరుగుతున్న పొట్ట మీద జోకులతో అంతా సందడిగావుంది!

సుధీర్ అందరితో కలివిడిగా ఉన్నాడుగానీ అతనిలో ఒక నిర్లిప్తత .మీటింగు మొదలయింది, ఒక రెండున్నర గంటలపాటు అనుభవాలు, అనుభూతులు పంచుకున్నాక భోజనాలు, ఫొటో సెషన్ నడిచినయ్. అంతా వస్తామని వీడుకోలు చెప్పుకుని బయలుదేరారు.

"నీదిప్పుడు వెలిది గ్రామం కద? నిన్నక్కడ దింపి వెళతాను!" అంటూ సుధీర్‌ని ఎక్కించుకుని కారులో బయలుదేరాడు ఆనంద్.

గ్రామంలో పొలాలవెంటవున్న అతని ఇల్లు చూసి నీరుగారిపోయాడు, మట్టిగోడలు, గుడిసెకంటే కాస్త మెరుగు! అతని తల్లి భూలక్ష్మి తనని గుర్తుపట్టి పలకరించింది. ఆమె ఆరోగ్యం అంతంతమాత్రంగానేవుంది. మాట్లాడుతుంటే సుధీర్ కొడుకు విక్రాంత్ వచ్చాడు. తను ఇంటర్ ఎంపీసీ గ్రూపుతో మంచిమార్కులతో పాసయాడు. తండ్రిలాగే లెక్కల్లో దిట్ట! చాలా సంతోషమయింది అతన్ని చూసి. మరి, తండ్రి లాగా తన ప్రతిభ వృధాపోగూడదు ... ఎలా?

ఆరాత్రి ఆనంద్‌కి ఆలోచనలతో నిద్రపట్టలేదు. తన ఆప్త మిత్రుడి బ్రతుకు ఇలా ఐపోయిందనే బాధ. అప్రయత్నంగా ఆలోచన తమ స్కూల్ మర్రిచెట్టు మీదికి మళ్ళింది ... ఒకరోజు తను, రాజు, వీరు చెట్టుకింద ఆడుకుంటుంటే హఠాత్తుగా ఒక పక్షి పిల్ల క్రింద పడింది. దానికి రెక్కలింకా పూర్తిగా రాలేదు. కొద్దిగా ఎగిరి మళ్ళీ క్రింద పడిపోతోంది. తల్లి పక్షి గోలగా అరుస్తోంది, నిస్సహాయంగా చుట్టూ ఎగురుతూ. స్నేహితులు ముగ్గురూ దాన్నెలాగైనా పైకి చేర్చాలని ప్రయత్నించారు, చెట్టు చాలా పెద్దది మరి! కర్రకి కర్ర కట్టి, దానికి డబ్బా ఒకటి కట్టి, దాన్నందులోవుంచి ఎంత ప్రయత్నించినా, ఉహుఁ లాభంలేక పోయింది. తెల్లారి స్కూల్‌కి వెళ్ళినప్పుడు చూస్తే అదక్కడ లేదు, ఏమయిందో తెలియదు.

మనసులో ఒక అపరాధభావన, ‘ప్రతిభవుండీ అవకాశంలేక తన సమవుజ్జీ వెనకబడ్డాడే …’ పత్తిలోంచి దారంతీసినట్టు ఎడతెగని ఆలోచనలు. ఎప్పటికో నిద్రపోయాడు.

తెల్లారి ఆదివారం, ఆలస్యంగా లేచాడు. అన్యమనస్కంగా తయారై పూజలో కూర్చున్నాడు. పూజ పూర్తి చేసుకుని లేచాడో లేదో, విరజ ఫోన్ అందించింది, "శ్రావణ్అట, కాలేజీ ప్రిన్సిపల్!" అంది. ఆత్రంగా ఫోన్ అందుకుని "హలో!" అన్నాడు. తను నిన్నటి సమావేశానికి రాలేకపోయాడు!

నిన్న కార్యక్రమం ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, అడుగుతున్నాడు తను ఫోన్‌లో. మెల్లిగా సుధీర్ సంగతి చెప్పాడు, "తనకి మనమేమైనా సహాయం చెయ్యగలమా?"

వెంటనే అన్నాడు శ్రావణ్ “మాకాలెజీలో అడ్మిషన్ ఇప్పిస్తాను వాడి కొడుక్కి తక్కువ ఫీజుతో, హాస్టల్లో చేర్పిస్తాను!" మాట ఇచ్చాడు. ఆనంద్ మనసులో పట్టరాని సంతోషం! "సరే, ఆ ఫీజులేవో నేనే కట్టేస్తాను!" వెంటనే అన్నాడు. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు.

విరజకి విషయం చెప్పి సంతోషంగా "ఇప్పుడే సుధీర్‌కి ఫోన్ చేసి చెప్పాలి, శ్రావణ్ దగ్గరికి తన కొడుకును తీసుకుని వెళ్ళి కలవమని," అంటూ నంబర్ కలిపాడు. సుధీర్ ఫోన్ ఎత్తగానే నవ్వుతూ విషయం చెప్పాడు, "సుధీర్, నీ కష్టాలు గట్టెక్కినయ్, ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు!" అన్నాడు. బదులుగా సుధీర్ ఏంచెప్పాడో, ఆనంద్ మొహంలో సంతోషం,"అహఁ ,అలాగా?" అంటున్నాడు.

ఫోన్ పెట్టేసి విరజవైపు తిరిగాడు ఉత్సాహంగా, "విన్నావా విరజా? నేనెలా తాపత్రయపడ్డానో తన గురించి నా మిత్రులూ అలాగే ఆలోచించారు. చూశావా! సదానంద్ సర్పంచ్ .వాళ్ళమ్మకి ఓల్డేజ్ పెన్షన్ ఇప్పిస్తానని చెప్పాడట ఫోన్‌లో, తన పలుకుబడినుపయోగించి! వీరేందర్ తన తల్లి వైద్యానికి ఓ పాతిక వేలు పంపిస్తానని నిన్ననే మాట ఇచ్చాడట … ఇంకా శ్రీను, ఎల్ఐసీ ఏజెంటు, ఒక ఏక్టివా బండి కొనడానికి తను ష్యూరిటీ ఇచ్చి లోనుయిప్పిస్తానన్నాడట! ఇంతకంటే సంతోషకరమైన వార్త నాకేముంటుంది?" విరజ తలవూపింది వింటూ.

ఒక్కసారి గట్టిగా నిశ్వసించి అన్నాడు ఆనంద్, " మా బడి మర్రి చెట్టు నీడన ఒక పక్షి, రెక్కల బలం చాలక

నిస్సహాయంగా వెనకబడిపోయింది. ఇప్పుడు తన తోటి పక్షులు తమ రెక్కలు చాచి ముందుకొచ్చి, 'మేమున్నాం సాయం, ఎగర' మంటున్నయ్! దానికి ఎగిరే సమయమొచ్చింది ఇన్నాళ్ళకి!" అతని కళ్ళల్లో ఒక సన్నని నీటి పొర!

- తెన్నేటి శ్యామకృష్ణ

First Published:  8 April 2023 1:21 PM IST
Next Story