ఛాయాచిత్రం
BY Telugu Global2 Dec 2022 2:45 PM IST
X
Telugu Global Updated On: 2 Dec 2022 2:45 PM IST
గ్రామీణ బ్యాంకు
రుణం కావాలంటే
ఆమె ఫోటో కావాలన్నారు వాళ్లు
ఆ ఒక్కసారే అమ్మది
నలుపూ తెలుపూ ఫోటో తీయించాం
అది ఏనాడో పాడైపోయింది, ఇప్పుడు ఆమె నిశానీ ఏదీ లేదు
ఆమె చామనచాయ రూపం ఒక్కటే నాకు గుర్తొస్తుంది
ముసలివయస్సులో అదే ముఖం కంచురంగులో మారిపోయింది.
ఎన్నిసార్లు
నేను భోజనానికి కూర్చున్నా,
కంచు కంచంలోని
అన్నం పోగు క్రింద
ఒక ముఖమేదో
ఉదాసీనంగా నన్ను చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది
తరిగిపోతున్న అన్నంతో పాటు
ఆ ముఖం బయటపడుతూ అంటుంది
"బిడ్డా తిను, తిను, ఇంకా తిను,
మరో రెండు మెతుకులైనా తిను"
అందుకే ఇప్పటికీ
నా కంచు కంచంలో
మెతుకైనా మిగల్చకుండా తింటాను
అందులో ఎప్పటికైనా
ఆమ్మ సంపూర్ణ ముఖం కనిపిస్తుందేమో
అన్న ఆశతో
- బెంగాలీ మూలం : ఎక్రాం అలీ
- తెలుగు అనువాదం: ముకుంద రామారావు
Next Story