Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    అమ్మ‘ధనం’!

    By Telugu GlobalSeptember 12, 20236 Mins Read
    అమ్మ‘ధనం’!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    నీలిమకి ముఫ్ఫైవ ఏట పెళ్ళయింది.  కూతురుకి పదిహేడవ ఏటనే పెళ్లి చెయ్యాలని  ఆమె తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సంబంధం ఖాయమయ్యేటట్లు అనిపించడమూ… తృటిలో తప్పిపోవడం ఇలా కొన్నేళ్ళు గడిచింది.  నీలిమకి  ముఫ్ఫైవ ఏడు వచ్చేసింది. తండ్రి ఓ రెండో పెళ్ళి సంబంధం తెచ్చాడు.

    అతని పేరు వేణు.  చాలా సౌమ్యుడు. భార్య చనిపోయి రెండేళ్ళు అయ్యిందిట.  పిల్లలు లేరు… అతని తల్లిదండ్రులూ కాలం చేసారు.  ఒంటరివాడు… బోలెడుఆస్తి…. వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడు.  తల్లిదండ్రుల మాట జవదాటని పిల్ల కావడంతో ఈ సంబంధం తనకిష్టమేనని నీలిమ చెప్పింది. పెళ్ళి అవ్వగానే  తనపని అయినట్లు గుండెపోటు వచ్చి తండ్రి కన్నుమూశాడు. 

    నెలనెలా నీలిమ పుట్టింటికి వెళ్లి వచ్చేది. ఇంటిపనులు చేసి పెట్టడానికి నౌకర్లు ఉన్నారు. అయినా ఆమెకి మనసు విప్పి మాట్లాడటానికి ఎవరూ లేకపోవడంతో…

    ‘మీకు అభ్యంతరం లేకపోతే అమ్మని ఇంటికి తీసుకు వచ్చేస్తా’నని ఓరోజున భర్తని అడిగింది.

    “ఇది నీ ఇల్లు, మధ్య నా అభ్యంతరం ఏవిటి? మీ అమ్మ నీకు ఎంతో, నాకూ అంతే. ఉన్నఫళంగా వెళ్ళి తీసుకురా అత్తగారిని. సామానుగట్రా తెప్పించే ఏర్పాట్లు నేను చేస్తాను” అన్నాడు నీలిమ  భర్త వేణు. నీలిమకి ఎంతో సంతోషం కలిగింది  భర్త మాటలకి.

    తమది లంకంత ఇల్లు. తాము వాడుకునే గదులు కాక, ఎప్పుడూ రెండు మూడు గదులు ఖాళీగానే పడి వుంటాయి.  వెంటనే వెళ్లి  ఇంటికి  అమ్మని తీసుకువచ్చింది నీలిమ.  భార్యని పువ్వుల్లో పెట్టి పూజించేవాడు వేణు. ఆమెని సుఖపెట్టడానికి  అహరహం తపించిపోయేవాడు.  పెళ్లి అయి  రెండేళ్ళు కావస్తున్నా నీలిమతల్లి కాలేదు. పిల్లలు కలుగుతారన్న ఆశ కూడా కనుచూపు కనిపించడం లేదు.

    ఒహటే చింత పట్టుకుంది తల్లికి.   తాను చెయ్యాల్సినవన్నీ చేసి డాక్టరుకి చూపించి  మందులు మింగించింది. మంత్రాలు వేయించింది. తావీజు కట్టించింది. దేవాలయాల దగ్గర.,బాబాల దగ్గర ముడుపులు కట్టించింది.  

    నీలిమ   ముక్కోటి దేవతలనూ  వేలాది సార్లు ప్రార్ధించింది. కడుపున ఓ  నలుసుని కాసేటట్లు చెయ్యమని.  ఎవరూ మొర ఆలకించలేదు కాబోలు … పూజలూ పునస్కారాలూ ఫలించలేదు.   అయినా ఆమె కోరిక నెరవేరనే  లేదు. ఇవన్నీ చేసిచేసి నీలిమకి మహా చికాకనిపించింది.  తల్లి సతాయింపు ఎక్కువైంది.

    పోనీలే అమ్మా! ఇప్పుడొచ్చిన  నష్టం ఏవిటి పిల్లలు  పుట్టకపోతే?”

    “అలాగంటావేటే వెర్రి తల్లీ!   పిల్లలు కలగకపోతే ఎలాగే!

    “నన్నేం  చెయ్యమంటావే? పిల్లలు పుట్టకపోతే  అది నా తప్పా?”

    “ఎవరి తప్పు కాదే తల్లీ!  

    రోజూ తల్లి పిల్లల గురించి మాట్లాడుతుండేసరికీ నీలిమకి తనపై తనకు సందేహం వచ్చింది. తల్లితో చింతించవద్దని చెప్తూన్నా లోలోపల తనకి దిగులు ఎక్కువైంది.  మనసులో ఏదో మూల చిన్న బాధ శరీరాన్ని కాలుస్తూ,  తొలుస్తూ ఉండేది.  తాను ఏ మొక్కా మొలవని ఓ బంజరు భూమి అయినట్లుగా అనిపించేది నీలిమకి.

    రాత్రుళ్ళు నిద్రలో వింత వింత కలలు.  తలా తోకాలేని దృశ్యాలు కలల్లో.  తాను నిర్మానుష్యమైన మరు భూమిలో  నిలబడింది. తన ఒడిలో ముద్దులు మూటగట్టినట్టున్న పిల్లడు.  ఇంతలో పెద్ద పెట్టున గాలివీచి, చేతిలోని ఆకాశంలోకి ఎగిరిపోయి మాయపోయినట్టు .  తాను పసిపిల్లల మాంసం ముద్దలతో పడుకున్నట్టు కలలు రావడం మూలాన ఆమె క్రమంగా మానసికంగా ఆరోగ్యం కోల్పోయింది.

    తీరికగా కూచుంటే చెవుల్లో చిన్న పిల్లల ఏడుపులు వినిపిస్తుంటాయి.

    ఓసారి తల్లిని అడిగింది.

    “అమ్మా! ఎవరి పిల్లడే గుక్కపట్టి  ఏడుస్తున్నాడు?” అని.  

    తల్లి నిదానంగా విని, ఏ ఏడ్పు వినిపించకపోవడంతో,

    “అబ్బే… లేదే!”

    “లేదమ్మా…ఏడ్చాడు. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే సొమ్మసిల్లిపోయివుంటాడు లే!” మళ్ళీ ఆమే సర్ది చెప్పేది.

    నీలిమకి అప్పుడే పుట్టిన పిల్లాడి ఏడ్పూ  వెక్కిళ్ళూ వినిపిస్తూనే వున్నాయి. చాలా సార్లు తన రొమ్ములు పాలతో పొంగినట్టు అనిపించేదామెకి. అయితే ఆ విషయం  తల్లికి చెప్పేది కాదు. గదిలోకి వెళ్ళి  రవిక విప్పి రొమ్ముల్ని చూసుకునేది.  పాలిళ్లు రెండూ ఉబ్బి వుండేవి.   పసిపిల్లాడి ఏడ్సు తన చెవిని పడ్తూనే వుండేది. అది తన భ్రమ అని సరి పెట్టుకొనేది నీలిమ.

    నిజానికి తనకి పిల్లలు ఎందుకు కలగరు? ఈ ఆలోచన పిడుగుపాటులా చీటికీమాటికీ   తన మనసు మీద పడేది.  ఎప్పుడూ విచారంగా కూచునేది నీలిమ.   వీధిలో పిల్లలు ఆడుకుంటూ  ఉంటే తన కర్ణభేరీలు బద్దలయి పోతున్నట్టు అనిపించేది. వీధిలోకి వెళ్ళి  పిల్లల పీకలు పిసికి చంపెయ్యాలని అని.  ఒక్కోసారి మళ్ళీ ఆ పిల్లలంతా తన ఇంట్లోనే అల్లరి పెడితే బాగుణ్ణూ అని కూడా అనిపించేది.

    వేణుకి  సంతానం కలగలేదన్న చింత లేదు.  షాపులో బాగా లాభాలు గడించాడు. నెలసరి ఆదాయం రెండింతలకి పెరిగింది.  ఇదేమీ నీలిమని సంతోష పెట్టలేదు. భర్త నోట్లకట్టలని తెచ్చి తనకి  అందిస్తూంటే, వాటిని ఒడిలో వేసుకొని  ‘జో’ కొట్టేది చాలా సేపటిదాకా.  ఆ తర్వాత ఉయ్యాల వేసి నోట్ల కట్టని ఊపేది.

    ఇంకోసారి చీర పైకెత్తి పిల్లాడికి నలుగుపిండి పెట్టి స్నానం చేయిస్తున్నట్లు నీళ్ళు పోస్తుంటే – తడిసిపోయిన నోట్లకట్టలని  చూసి   వేణు విస్తు పోయాడు.

    ఓ రోజున పాల గిన్నెలో నోట్లకట్టలని చూసి   వేణు కి మతిపోయింది.

    “పాలగిన్నెలో డబ్బు ఎవరు పడేశారు?” అని భార్యని అడిగాడు.

    ‘’రాలుగాయి పిల్లలూ… రాలుగాయి పిల్లలూ …ఎక్కడాఇంత అల్లరి చూడలేదు బాబూ…  ఉండండి మీ పని చెప్తా’’!! అంటూ ఆ నోట్లకట్టని చిన్నగా కొడుతున్న భార్యని చూసి విస్తుపోయాడు వేణు.  

    “అక్కడ  ఇక్కడ పిల్లలు లేరే?” అన్నాడు.  భార్య చేస్తోన్నపని అర్ధంకాక.

    భర్తకన్నా మరింత కలవరపడటం  ఈసారి నీలిమ వంతు అయింది.

    “ఇదేం విడ్డూరమండీ బాబూ!..  పిల్లలసలు లేనట్లే మాటాడతారేవిటి? వాళ్ళ అల్లరీ., పెంకి తనమూ తేలుస్తాను” అంది

    వేణుకి చప్పున అర్థమయిపోయింది. తన భార్య మతిస్థిమితం పోగొట్టుకుందని.  లోలోన కుమిలిపోయాడు అందరూ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు.  వేణుకి మనసు  చివుక్కుమంది.  అతను కలవర పడిపోయాడు. మరి లాభంలేదని దుకాణానికి వెళ్ళడం మానేసి నీలిమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు.

    వ్యాపారానికి కొన్నాళ్ళు దూరంగా., రోజుల తరబడి వేణు  ఇంటిదగ్గరే  తన సంరక్షణ చూస్తూ వుండటం వల్ల నీలిమకి మనసు కుదుట పడింది. అయితే  ఆమెకి కొత్త చింత పట్టుకుంది  భర్త రోజంతా ఇంట్లోనే ఉంటే ‘షాపే’మి అవుతుందో అని. చాలాసార్లు భర్తని అడిగింది కూడా.

    “మీరు షాపుకెందుకు వెళ్ళడంలేదు”

    “పని చేసిచేసి విసుగెత్తి పోయానోయ్!  కొన్నాళ్ళపాటు ఇంటిపట్టున వుండి విశ్రాంతి తీసుకోనియ్” అనేవాడు.

    “మరి అయితే షాపుని ఎవరికి అప్పగించారు. అతను నమ్మకస్తుడేనా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించేది నీలిమ.

    ‘’నమ్మకస్తుడే. రోజూ పైసా పైసా… లెక్కలు అప్పగిస్తూ వుంటాడు.  నీకెందుకా గొడవలు చెప్పు”

    “భలేవారే! నాకు గాక మరెవరికండీ! ‘పిల్లలు పుట్టుకొచ్చారా’? మనకోసం కాక  పోయినా, వాళ్ళ కోసమైనా మనం ఆలోచించకపోతే ఎలా చెప్పండి? మీ ఫ్రెండు కాస్తా ద్రోహం తలపెట్టి, డబ్బూ దస్కం ఎత్తుకుపోతే మన పిల్లల భవిష్యత్ ఏం కానూ’’??

    భార్య మాటలకి  వేణు కళ్ళలో  నీళ్లు సుడులు తిరిగాయి.

    ‘’చాలా నిజాయితీ  పరుడు, నమ్మకస్తుడు”

    “నాకెందుకులెండి.  అయితే తల్లిగా మన సంతానం గురించి  ఆలోచించాలి గదా నేను?”  

    చేసే పనేమీ లేకపోవడంతో ‘’లేని పిల్లల’’ కోసం బట్టలు కుడుతుంది. స్వెటర్లు అల్లుతుంది. భర్తకి చెప్పి రకరకాల  సైజుల్లో వూలు వుండలు తెప్పిస్తుంది.

    ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో… 

    ఓ రోజున స్నేహితుడు సాగర్ – వేణు దగ్గరికొచ్చాడు. అతని మొహంలోచెప్పరాని ఆందోళన, దిగులు. మిత్రుణ్ని ‘కారణం’ అడిగాడు  వేణు .

    ‘తానొక అమ్మాయిని ప్రేమించానని ఆమె ప్రస్తుతం గర్భవతి అనీ’ చెప్పాడు సాగర్.

    ‘ఇంకెందుకాలస్యం … పెళ్ళి చేసుకో’…

    ‘’ఇప్పుడిప్పుడే పెళ్ళి అయ్యేటట్లు లేదు… ఆమెకి అబార్షన్ చేయిద్దామనుకుంటే సమయం దాటి పోయిందని డాక్టర్ చెప్పాడు’.

    ‘మరేంచేద్దామనుకుంటున్నావ్’!?…అడిగాడు వేణు.

    ‘అదే అర్ధం కాక నీదగ్గరకు వచ్చాను’.

    ‘ఓపని చెయ్యి… అమెకి పిల్లాడు పుట్టేదాక ఎక్కడైనా ఉంచు’… “

    “ఆ పుట్టే పిల్లాడ్నేం చేసుకోను?”  అనడిగాడు మిత్రుడు,

    “నాకిచ్చేసెయ్”

    మరి కొన్నాళ్ళకి మిత్రుడి ప్రియురాలికి పిల్లాడు పుడతాడనగా వేణు – తన ఇంట్లో…

    “నువ్వు గర్భవతివి అయ్యావ్”  అన్నాడు నీలిమతో నమ్మకంగా.  

    ఆమె తల్లితో కూడా అలానే చెప్పించాడు.  కూతురి పరిస్థితి చూసి ఆమె కూడా బాధపడుతోంది. అల్లుడు చెప్పినట్లు చేస్తే నీలిమ  ఆరోగ్యం బాగవుతుందని ఆమె కూడా భావించింది.

    ‘’అవునమ్మా నువ్వు తల్లివి కాబోతున్నావ్… త్వరలోనే పండంటి మనవణ్ణి నాకు ఇస్తున్నావ్’’!.. అంది అంతే నమ్మకంగా…    నీలిమ తన పొట్ట చూసుకుంటూ రాసుకుంటూ మురిసిపోయింది.

    ***

     

    సాగర్ ప్రియురాలు ఆడ శిశువుని కన్నది.

    ఆ పసికందుని తెచ్చి గాఢనిద్రలో ఉన్న నీలిమ పక్కన పడుకోబెట్టాడు వేణు.

    నీలిమకి చంటిపిల్ల ఏడుపు వినిపించింది.  కల అనుకుంది. నిద్రమత్తులో  చూసింది. పక్కకు చూడ గానే పరుపుమీద పండంటి శిశువు!.. కాళ్ళూ చేతులు కదిలిస్తోంది ఆ బిడ్డ.   నీలిమ సంతోషానికి  అవధులు లేవు..

    “అరే … నాకెప్పుడు పాపాయీ పుట్టిందీ.!?”

    “ఉదయం’’ అంతే  ఆనందంతో అన్నాడు వేణు.

    ‘అవును’! అంది తల్లి

    ‘’మరి నాకు తెలిదే! బహుశా పురిటినొప్పులు పడుతూ సొమ్మసిల్లి పోయివుంటాను’’

    నీలిమ గాల్లో తేలుతున్నట్లే ఉంది.  కాలకృత్యాలు తీర్చుకుని  తల్లిదగ్గరికి వెళ్ళింది.  పోతపాలు తాగేసి నిద్రమత్తులో ఉన్న శిశువు దగ్గరే పడుకుని జోలపాటలు నెమ్మదిగా పాడేస్తోంది.

    మర్నాడు షాపుకి వెళ్తూ, వేణు  భార్య గదిలోకి తొంగచూసి క్షణం సేపు – స్థాణువే అయ్యాడు.  అత్తగారు ఓ పక్క స్పృహ కోల్పోయి ఉన్నారు.  

    భార్య రొమ్ములు కోసేసుకుంటోంది. ఒక ఉదుటున వెళ్ళి ఆమె చేతిలోని కత్తి లాక్కున్నాడు.

    “ఏవిటి నువ్వు చేస్తున్న పని?.. దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు

    నీలిమ పక్కలోని పిల్లాడిని చూపిస్తూ…

    ‘’పాలకి ఒకటే  ఏడుపు! ఏడుపు!!.   పాలు -ఒక్క చుక్క వస్తే ఒట్టు… రొమ్ములు చీకి చీకి ఏడుస్తోంది బుజ్జిపాపాయి. పాలురాని  పనికిరాని ఈ రొమ్ములెందుకని…

    ‘మాట’ మధ్యలోనే ఆగిపోయింది.  

    పిల్లాడి ఏడుపు ఒక్కటే ఇప్పుడు వినిపిస్తోంది. 

    -తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి

    Amma Dhanam Telugu Kathalu
    Previous Articleభావన : విధి – సాధన
    Next Article ఐ ఫోన్ 15 వచ్చేసింది.. ఇవే కొత్త ఫీచర్లు, ధరలు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.