నల్లని వాడా ...
తలుపు ఓరవాకిలిగా చేర్చి ఉంది.
పళ్ళెం నిండా అరవిరిసిన మల్లె లను పోసుకుని ఒక చేతిలో దారం ముక్క పట్టుకుని చూస్తూ, మసక వెన్నెట్లో మాధవీలతలా ఒదిగి కూర్చుంది రాధ బాల్కనీలో.
సుకుమారమైన రాధ ముని వేళ్ళు మరింత సుకుమారమైన సన్నజాజి మొగ్గలను సుతారంగా చక చకా మాలలు కట్టేవి..కాని ఈ రోజు మాత్రం మొగ్గలు చేతిలోకి తీసుకున్నా కట్టబుద్ధి కాడం లేదు.అకారణంగానే కంట్లో నీళ్ళూరుతున్నాయి.
ఇల్లంతా ఈ మూలనుండి ఆ మూలకు నిశ్శబ్దపు కుంపటిలా వేడి వేడిగా ఉంది.
నిజానికి ఆమె పేరు రాధ కాదు. కాని రాధ ననే భ్రమలోనే ఉంది.
అతను వేణువు పలికించే కృష్ణుడనే అనుకుంది.ఈ మసక వెన్నెల మనసును తుమ్మెదలా రొదపెట్టి వేదిస్తుంటే, అతను పక్కన ఉండి ఒక్కో పువ్వూ అందిస్తుంటే, మౌనంగానే ఊహలు పంచుకుంటూ మైమరచి పోవాలని ఉంది.
అసలు మంచు ముద్దలా ఉన్న మనసును అతనే కదాకదిలించింది.
ఆ రోజున అతని పరిచయమే చిత్రం గా జరిగింది.ఉదయం పదిన్నరకు కాబోలు ఎప్పటిలా ప్రతి షోపీస్ నూ తుడిచి సర్దుతూ ఉంటేవినిపించింది డోర్ బెల్ మ్యూజిక్.
"ఈ సమయంలో వచ్చేది ఎవరబ్బా-- మామూలు గా పనిమనిషి వెళ్లిపోయాక ఎవరూ రారు. ఏ పోస్ట్ మాన్ లేకపోతే ఆమెజాన్ డెలివరీ బాయ్స్ తప్ప. వాళ్ళయితే కాల్ చేసి వస్తారు.ఈ రోజు ఏదీ వచ్చే అవకాశం లేదు. పోస్ట్ వచ్చే సమయం కాదు.
అయినా తీరికగా పని ముగిసాక స్నానం చెయ్యవచ్చని నైటీ లోనే ఉంది."మరో సారి డోర్ బెల్ మోగింది.తలుపు ఓరవాకిలిగా తెరిచి చూసింది.అతన్నెక్కడో చూసినట్టుగానే అనిపించింది.
" హలో ---"
అంత లోనే గుర్తు తెచ్చుకున్నట్టు
" మీరే కదా … విశ్వ సుందరం గారు"
మనసులోనే విసుక్కుంటూ అతన్ని లోనికి అహ్వానించి, ఒక్క నిమిషం అంటూ లోనికి వెళ్లి చీర కట్టుకుని వచ్చింది.అతని ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో కూచుని
"చెప్పండి " అంది చాలా కాజువల్ గా…
ఆమె గాయని - అతను టీవీ సీరియల్ నిర్మాత.
ఒక సీరియల్ లో ఒక గాయని జీవితం ప్లాన్ చేసి ఆ పాత్రకు ప్రయోగాత్మకంగా వారానికి రెండు పాటలు పాడించాలని అతని కోరిక. అదీ ఆమెతోనే పాడించాలి.
ఆ తొలి పరిచయం ఎప్పుడు ఎలా తీగలుగా సాగి విస్తరించిందో ఇద్దరికీ తెలియదు.
ఎవరూ ఎవరి గురించీ ఒక్క మాటా అడగలేదు.ఆ పరిచయం వయసిప్పుడు పదేళ్ళు.
అవును, పదేళ్ళు.అయినా మొదటి పరిచయం లో ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసో ఇప్పుడూ అంతే తెలుసు.
ఇద్దరికిద్దరూ తమతమ రంగాలలో నిగ్గుతేరి మరింతనిష్ణాతులయారు. అతనికి రెండు నంది అవార్డ్ లు రెండు కార్ల తో పాటు చిరు బొజ్జ, కొద్దిపాటి జుట్టు నెరుపూ వచ్చాయి.
ఆమెకు పెరిగిన పిల్లలిద్దరూ భుజాలదాకా సాగి చదువు సంధ్యల కోసం ఆవలి తీరాలకు చేరుకోడం, వయసు తో పాటు కొంచం మనసుకు పరిపక్వత , కొంచం అక్కడో ఇక్కడో వద్దన్నా వచ్చి చేరిన కొవ్వు. మెరుపు తీగ కాస్తా ముద్ద బంతిలా మారింది.
మొదట్లో రోజుకు రెండు మూడు సార్లు ఫోన్ చేసేవాడు విశ్వ. కాని నెమ్మదిగా వారానికో సారికి వచ్చింది.
ఇంట్లో కుదరడం లేదు అనే వాడు.
ఆ సమయంలోనే ఎలా వచ్చిందో అర్ధం కాకుండా వచ్చింది వైరల్ ఇన్ఫెక్షన్.దాదాపు నెలరోజులు జ్వరం నీరసం .పని మనిషి తప్ప మరో సాయం లేదు. పిల్లలు రాలేరు.
ఏమైతే అవనీగాక అనుకుంది.
" డాక్టర్ దగ్గరకు వెళ్ళు, మెడిసిన్స్ వేసుకో " అతనిచ్చే సలహా.
జ్వర తీవ్రత ఎకువగా ఉన్నప్పూడు ఎవరి వడిలోనైనా తలపెట్టుకు పడుకుంటే ఎంత నిశ్చింత అనిపించేది.నీరసం నిలువెల్లా వణికించినప్పుడు పక్కన ఒక ఆసరా కావాలనిపించేది.లేచి కూచోలేక, ఏ పనీ చేసుకోలేక నిద్రో మెళుకువో తెలియకుండా పగలూ రాత్రీ గడిచినప్పుడునా పాపానికి ఇది తగిన శిక్షే అనిపించేది.
ఏం మిగిలిఉందో కాని నెమ్మదిగా జ్వరం తగ్గుముఖం పట్టింది.
నీరసం నుంది కోలుకోడానికి ఆర్నెల్లు తీసుకుంది.అతని ఊహే మనసుకు ముల్లులా గుచ్చుకుంది. ఒక్కసారైనా వచ్చి పరామర్శించలేని అతనితో అనుబంధాన్ని ఏమనాలి?
ఏమనుకోడానికీ మనసొప్పక తెగతెంపులు చేసుకుంది
చాలా రోజులకు పళ్ళెం నిండా మల్లెలు పెట్టుకుని బాల్కనీలో కూచున్నా జ్ఞాపకాలు కుడుతూనే ఉన్నాయి.
ఫోన్ నంబర్ బ్లాక్ చేసి ఇల్లు మార్చి ఊరు మార్చినా మనసు మారాలి కదా...మనసు మాట వినాలి కదా ...
అయినా ప్రేమ అనేది అడుక్కుంటే రాదుగా స్వతహాగా ఉండాలి కాని.
మాల చకచకా కట్టి నిలువెత్తు రాధాకృష్ణుల విగ్రహానికి వేసింది.
ఇల్లంతా మల్లెల గుబాళింపు.
అప్రయత్నంగానే ఆమె పెదవులు కదిలాయి...
"నల్లని వాడా ... నే గొల్ల కన్నెనోయ్ ...."
- స్వాతి శ్రీపాద