Telugu Global
Arts & Literature

ఇత్తుల గుమ్మి ( కవిత)

ఇత్తుల గుమ్మి ( కవిత)
X

అంబట్యాల్లకు గిర్కోలె,

సద్ది మూటగట్టి

బిరాన ఉరికే కైకిలి పాట నా బాస

మొల్కలెత్తిన ఇత్తు పంటల ఎదిగి ఒదిగిన తోటల ఊగులాటనే ఈ బాస

బేలసూపుల ఆవుల్యాగల

మూగబాసేరా మన తెలుగు

దుక్కి దున్నే ఎడ్ల బండీ,

జోడెడ్ల ఊసులాటేరా ఈ తెలుగు

శేను శెల్కల,

మూల మూలను సదును జేశీ

ఎవుసం జేశే,

రైతు సెమట సుక్కల బాసరా!

మోతుబరికాన్నించి,

బర్ల కాపూ దాక...

పాయిదెర్లు జూడని ధర్మాత్తురాలూ

ఈ బాసరా!!

నాల్కెల మీద ఆటలాడేటి

రతనాల మాటల

కడుపు సల్లటి అంబలోలె, ఆదుకుంటదిరా!

కండ శెర్కరోలె,

నాల్కెకింపైంది మన తెలుగు బాసరా! ఇత్తనాల ముచ్చట్లెన్నో నింపుకున్న

ఇంటి గుమ్మిదిరా!!

వాడకట్టున, అమ్మలక్కలు

కారెడ్డమాడిన యాసరా!

బొల్లకోరూ దంటగాడు

పాయిరంగా పలికిన పలుకురా!!

ఇంటింటి గడపా,

పంగపంగకు బాకిన తాతల మాటరా!

అవ్వ ఒడిలో, సల్లని లాలి పాటల జోలలాడే పాపరా!

గున్న గున్నా ఉర్కుతున్నా

పిలగాండ్ల ముచ్చట్ల మూటరా!

పెండ్లికెదిగిన పోరగాండ్లా

ఉడుకు నెత్తురు ముద్ద

నెలపొడుపూ బొమ్మరా!!

పెండ్లినాడు మ్యానెలల

ఊరంత దిరిగిన

ఎన్నెల రవ్వల ఎలుగురా!

ఎన్నెన్నో దాటీ ఈపు అంగిన ఎన్కటోల్లా... లంకె బిందెల మూటరా!!

మరీ...

ఇసుమంటి మన కోయినూరుకు

ఇంగిలీ పీసుల గాలి జోకిందా?

రాని బాసల రంజు మీనా...

మన తల్లి బాసకు అగ్గివెట్టీ కుండవడుతాండ్రా?

బోగరి పదాల పీతిరిగద్దలు జేరీ,

మన ముచ్చాలనుడుగుల మత్పరిత్తాండ్రా?

బతుకుదెరువుకు గండమానీ, బర్కద్దక్కువ ఇచ్చంత్రాలూ జేత్తాండ్రా?

ఇగ గందుకే...

ఐటెంక తంతెలకు,

సందు లేకుంట జూశీ దడిగట్టీ దండిగిద్దము!

గంగవాగుల తేటనీల్లోలె,

తెర్ల గాకుండా

గావురంగా నిలిపి ఇద్దము!

వడ్ల గింజల బియ్యం గింజోలె,

మేల్కతోటి పైలంగ గాపాడుకుందము!

రాయల రారాజు రీతిన,

"దేస బాసలందు తెలుగే లెస్స"గ

నిలిపి జూపెడ్దమూ!!


అక్షరయాన్ కవితలపోటీలో ప్రథమబహుమతి పొందిన పై కవిత లోని మాండలిక పదాల అర్థాలు :

ఇత్తులు :విత్తనాలు

గుమ్మి :గాదె ,భాండాగారం

అంబట్యాల :ఉదయం

గిర్కో లె : గిలక వలె

బిరాన :తొందరగా

కైకిలి :కూలి

ఎవుశం : వ్యవసాయం

పాయిదెర్లు : విభేదాలు

అంబలి :గంజి

గుమ్మి :ధాన్యపు పాతర ,పెద్దగంప

దంటగాడు : జతకాడు స్నేహితుడు

పాయిరంగా : ప్రేమగా

పంగపంగకు :వంశవృక్షం కొమ్మకొమ్మకూ

నెలపొడుపు :చంద్రవంక

మ్యానెలల :పల్లకిలో

బోగిరి :డాంబికం ,సంకరం

కుండవడుట :చితిముందు కుండ పగలగొట్టడం

పీతిరిగద్ద :రాబందులు

మత్పరించు : మరచిపోయేలా చేయు

గండము :అవరోధం ,ఇబ్బంది

ఇచ్చంత్రాలు :ఉపాయాలు

ఐటెంక తంతెలకు :రాబోయే తరాలకు

దండిగిద్దము :ఎక్కువగా ఇద్దాము

తెర్లగాకుండ : మురికి కాకుండా

గావురంగా :ప్రేమగా

మేల్కతోటి :మెళుకవతో

ఫైలంగా :భద్రంగా

- స్వాతి తక్కళ్లపల్లి

First Published:  17 Nov 2023 5:12 PM IST
Next Story