అమావాస్య సుందరి
ఆమె చీకట్లో
శరీరాల్ని వ్రేలాడ దీస్తుంది
వేళ్ళతో ను కాళ్ళతోనూ
కుళ్ళబొ డుస్తుంది
బస్కీలు తీస్తుంది
నిన్ను తీయిస్తుంది
ఆమెది ప్రళయ భీకర మహదానందం
అంతా క్షణికం అయినా భయంకరం
భీభత్స రసాస్వాదనతో
ఆమె ఒక వెర్రినవ్వు నవ్వుతుంది
ఆమెది చీకట్లో చిటపటల గోత్రం
హింసిస్తూ నవ్వుతుంది
ఏడిపిస్తూ ఆనందిస్తుంది
ఈ అమావాస్య నాకు
ఒక అపురూప సుందరిలా కనిపిస్తోంది
అంతా చీకటే కానీ
ఏదో తెలీని విశృoఖలత్వం
విశృoఖలత్వంలో
విలయ తాండవం
కళ్ళు తెరిచి చూదామంటే
అంతటా చిమ్మచీకటి
అంధకారం అంతటా
అలుమకొని ఉన్నా
ఒక కనపడని వినపడని
పెను సవ్వడి ఏదో
నిరంతరంగా వినిపిస్తూనే ఉంటుంది
ఒక ఘోరమైన గుండెలదిరే
గజ్జల సవ్వడి
ఒక గుండెల్ని పిండేసే
వికృత రాక్షస విహ్వల దృశ్యం
అయినా ఏ మూలనుంచో
ఒక వికృత సౌందర్య ఝరి
ఒక మరణ మృదంగ ధ్వానంలా
హాయిగా
ప్రాణాలు విడుస్తున్నా నేను
మహదానందంగా
చాలు ఇక ఈ జీవితానికి
ఇంతటి విహ్వలానుభవం
చాలు ..చాలు ..!
- సుమనశ్రీ