Telugu Global
Arts & Literature

చింతా జలధి. (కథ)

చింతా  జలధి. (కథ)
X

మురారి మార్నింగ్ వాక్ చేసి, పార్క్ లో బెంచి మీద కూర్చున్నాడు. తెల తెల వారుతోంది. మంచు కురుస్తోంది. పది గజాల దూరంలో ఏముందో కూడా కనిపించడం లేదు. అలాగే ఆయనకు సమీప భవిష్యత్తులో ఏం జరగబోతోందో కూడా తెలియడం లేదు.

ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనాడు. ఎన్నో సంక్లిష్టమైన కేసుల్లో జనామోదమైన తీర్పులు చెప్పి అందరి మెప్పునూ పొందాడు. కానీ ఇప్పుడు తనకు ప్రాణప్రదమైన వ్యక్తికి తీరని అన్యాయం చేశానన్న ఆత్మన్యూనతా భావంతో లోలోపల మధన పడి పోతున్నాడు.

ఆయన పార్క్ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాడు.

కల్పన కాఫీ అందించింది. కాఫీ తాగుతూనే పేపరు చూశాడు. అది నిన్నటి పేపరు. ఆయన చూసింది వధూవరుల కోసం ప్రకటనలు ఉన్న పేజి. అందులో ఆయన ఇచ్చిన ప్రకటన ఉంది. ఆ ప్రకటనకు నిన్ననే ఒక వ్యక్తి స్పందించాడు. చూడాలి ఏమన్నా కుదురుతుందేమో నని.

ఖాళీ కప్పు అందుకుని లోపలికి వెళుతూ 'స్నానం చేసి రండి. టిఫెన్ రెడీగా ఉంది' అన్నది కల్పన. ఆమె మాట ఆయనకు ఆర్మీ ఛీఫ్ ఆర్డర్ లాంటిది. అర గంటలో అల్పాహారమూ ముగించి, ఆలోచనలో పడి పోయాడు.

ప్రతి మనిషీ, ప్రతి రాష్ట్రమూ, ప్రతి దేశమూ తమకు నచ్చిన న్యాయాన్యాయాలను రూపొందించుకొని వాటిని పాటించటం పరిపాటి. అలాగే దేవుడూ తనకు ఇచ్చవచ్చిన న్యాయాన్యాయాలను పాటిస్తూ ఉంటాడు. అయితే ఆయన తీర్పుకు అప్పీల్ లేదు. దాని అమలుకు అడ్డు లేదు. ఈ దేవుడు తన తీర్పును తిరగ రాశాడు. అదే బాధగా ఉంది..

అయిదు ఏళ్ల కిందట జరిగిన సంఘటన ఇది.

ఒక అనాధ శరణాలయం వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైనప్పుడు, అక్కడ ఆయనను సాదరంగా ఆహ్వానించిన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. ఆ అమ్మాయికి తల్లీ, తండ్రీ ఎవరో తెలియదు. ఇంక కులగోత్రాల గురించి ఏం తెలుస్తుంది?


"ఏం చదువుతున్నావు?" అని అడిగాడు మురారి.

"అనాధ ఆశ్రమం వాళ్లే ఇంజనీరింగ్ లో చేర్పించారు. నేను ఏవో తంటాలు పడి కొన్ని కంప్యూటర్ కోర్సులు చేస్తున్నాను. ఉచితంగా నేర్పుతుంటే సంస్క్రతమూ

నేర్చుకుంటున్నాను" అన్నదా అమ్మాయి.

"బంగారు తల్లివి. ఎన్నో విషయాలునేర్చుకుంటున్నావు" అన్నాడు మురారి.

"ఆ గొప్పదనం ఆయా విషయాలదేనండీ. "ఉత్తరోత్తర ముత్కర్ష స్సార ఇత్యభిదీయతే - మధురం మధు పీయూషం తస్మాత్తస్మా త్కవేర్వచః "అని అన్నారు కదండీ. అంటే తేనె మధురము, దాని కంటే అమృతము మధురము, దానికంటే కవి వాక్కులు మధురము. దేని మాధుర్యం, దేని విశిష్టత దానిదే కదండీ" అన్నదా అమ్మాయి.

" నేను వాటి గురించి కాదు. నీ గురించి మాట్లాడుతున్నా. ఒకే సమయం లో ఇన్ని పొంతన లేని విషయాలను అధ్యయనంచేస్తున్నావంటే..."

"ఆయా పరిస్థితులూ, పరిసరాలూ మనలను కొండల మీదకూ, కోనలలోనికీ నడిపిస్తాయి సార్. మీకు తెలియని దేముంది సార్. నేనొక అనాధను. ధనమే తల్లీ, తండ్రీ, గురువూ, దైవమూ అయిన ఈ రోజుల్లో నాలాంటి నిరుపేద నిలబడాలంటే ఆ మాత్రమైనా తపన ఉండాలి గదండీ..." అన్నదా అమ్మాయి.

ఆ అమ్మాయి మాటలు ఆయన మరిచిపోక ముందే నెల రోజుల తరువాత సంస్కృత పాఠశాల నిర్వహించిన పోటీలో ఆ అమ్మాయికి మొదటి బహుమతి వచ్చినట్లు పేపర్లో చూసి, కారు పంపించి ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించాడు మురారి.

భయంభయంగా ఆయన ముందు నిలబడిన ఆ అమ్మాయి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించమని వేడుకొన్నది.

" మా అబ్బాయి ప్రసాద్, అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎలా జీవించాలో వాడికి నేర్పించు. నీకు తెల్సిన సంస్కృతంతో మొదలు పెట్టు" అన్నాడు మురారి.

ఆరు నెలల పాటు ఆయన కారులోనే ఆయన ఇంటికి రోజూ సాయంత్రం వచ్చి పోతూ ఉండేది.

జీవితంలో యవ్వన వనంలో ప్రేమ పుష్పాలు విరబూసి పరిమళాలు వెదజల్లుతాయి.

కొన్నాళ్ల పాటు వాళ్ళ కళకళలాడే కిలకిలలు విన్న తరువాత మురారి ఆ అమ్మాయిని అడిగాడు "మా వాడిని పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టమేనా?" అని.

ఒక అనాధపైన ఇంత పెద్దఎత్తున దయ కురిపించినందుకు ఆ అమ్మాయి తెగిన పూల దండలాగా ఆయన పాదాల మీద పడి పోయింది.


కల్పన- కోడలిగా మురారి ఇంట్లో వెయ్యి కాండిల్ బల్బులా వెలిగి పోయింది.

కాళ్ళ కింద వెన్నెల పరిచిన కాలమే, గురి చూసి గుండెల్లోకి కత్తులు విసురుతుంది. ఆమె సంతోషం మూడు నాళ్ళ ముచ్చటే అయింది.

ఒక వర్షం కురిసిన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ దారుణ మరణానికి గురి అయినాడు.

అయన గుండెల్లో పెద్ద పిడుగు పడింది. చెట్టంత కొడుకును పోగొట్టు కోవటం ఒక ఎత్తు అయితే 'కొడుకు అర్ధాయుష్కుడని తెలిసే, ఆ అనాధ పిల్ల గొంతు కోశాడన్న' అపప్రధ ఆనోటా, ఆనోటా పడి ఆయన చెవిన పడింది. ఇది ఆయన్ను మరింత కృంగ దీసింది.

కనుకనే కల్పనకు మళ్ళీ పెళ్ళి చేయాలనుకున్నాడు. పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఎవరో ఒకరు ముందుకు వచ్చాడు.

ఈ విషయమే కల్పనతో అంటే ఆమే ఏడ్చింది.

"నన్ను మీరు దూరం చేస్తే, నన్ను నిలువునా రెండుగా చీల్చినట్లే..." అన్నది కల్పన.

"కానీ నీ నిండు జీవితం..."

"అన్నమయ్య ఆనాడే చెప్పినట్లు... నేను అనాధ ఆశ్రమంలో ఉన్నప్పటి భవ జలధిని మీరే దాటించారు. ఇప్పుడిది చింతా జలధి. దీనిని దాటించే తెప్ప కూడా మీరే... ఇంటి నిండా ఉన్న న్యాయశాస్త్ర పుస్తకాలు చదువుతున్నాను. మీ అంత దానిని కావాలని ఆశీర్వదించండి" అన్నది కల్పన కింద కూర్చుని ఆయన ఒడిలో తల పెట్టుకుని, కన్నీరు కారుస్తూ.

అప్రయత్నంగా రాలిన ఆయన కంటి ముత్యాలు రెండు కల్పన శిరసును అభిషేకించినయి.

రిటైర్ కాకముందు హైకోర్టులో తాను కూర్చున్న కుర్చీలో కల్పన కూర్చున్న దృశ్యం కన్నీటి పొరల మధ్య కదులుతూ కనిపించింది.

- శ్రీధర

First Published:  1 April 2023 4:10 PM IST
Next Story