Telugu Global
Arts & Literature

ఆడదే ఆధారం (కథ)

ఆడదే ఆధారం (కథ)
X

"అరేయ్! భరత్ లేవరా! కాలేజ్ కి లేట్ అవుతుంది. టైం ఎనిమిది అయ్యింది. ఎన్ని సార్లు లేపాలి. రా?" అని, విసుక్కుంటూ నిద్ర లేపుతుంది. జానకి.

"ఏంటి పొద్దుపొద్దున్నే వాడి మీద పడ్డావు. ఏ! ఆ గదిలో నీ కూతురు 'ఆడది' అయ్యుండి మొద్దులా ఇంత సేపు నిద్ర పోతుంది. ముందు దాన్ని లేపు." అని గంభీరమైన స్వరం తో కసిరారు." జానకి భర్త మోహన్.

భర్త మాటలకి చిన్నబుచ్చుకున్న జానకి, అతనికి కాఫీ అందిస్తూ... భర్తకి దగ్గరగా వచ్చి కాస్త స్వరం తగ్గించి నెమ్మదిగా...

"భారతి కి రాత్రి నుంచి బాగా లేదండి. రాత్రంతా 'కడుపునొప్పి' తో విలవిలలాడి పోయింది. ఇప్పుడు కూడా ఉదయాన్నే లేచి, తన పని చేసుకుని కాలేజీ కి వెళ్లడానికి తయారయ్యింది. నేనే ఇవాల్టికి కాలేజ్ వద్దు. రెస్ట్ తీసుకోమని పాలు తాగించి పడుకోబెట్టి వచ్చాను."

మోహన్ గారు విసుగ్గా... 'ప్రతినెలా' వచ్చే నొప్పి కూడా కొత్తేనా? ఆమాత్రం భరించ లేకపోతే ఎలా? ఇదో వంక మీ ఆడవాళ్ళకి, పనులు ఎగ్గొట్టి ఇంట్లో ముసుగుతన్ని పడుకోవడానికి" అని, విసురుగా కాఫీ కప్పు పక్కన పెట్టి స్నానం చేయడానికి వెళ్లిపోయారు.

భర్త మాటలకి కళ్ళల్లో చేరిన నీటిని పైట చెంగుతో ఒత్తుకుంటూ... కిచెన్ లోకి వెళ్లి పోయింది. జానకి.

భర్తకి ఆడవాళ్ళంటే అంత చులకన ఎందుకో అర్థం కాలేదు. పెళ్లయిన మొదటి నుంచి తనకి ఆ విసుర్లు, కసుర్లు అలవాటైపోయాయి. కానీ, కడుపున పుట్టిన కూతుర్ని కూడా... అదే విధంగా చూసేసరికి తట్టుకోలేక పోయింది. జానకి.

మోహన్ రడీ అయ్యి వచ్చే సరికి... జానకి టిఫిన్ సిద్ధం చేసి ఉంచారు. ఆయన టిఫిన్ తినగానే షాప్ కి వెళ్ళి పోతూ... ఇంకా మొద్దులా నిద్రపోతున్న కొడుకు దగ్గరికి వెళ్లి,

"ఒరే నాన్నా! నేను షాప్ కి వెళ్తున్నాను. నీకు కాలేజ్ కి టైం అయ్యింది. త్వరగా లేచి రెడీ అయ్యి, కాలేజ్ కి వెళ్లు నాన్న" అని.. ప్రేమగా కొడుకుని లేపి తను బాత్ రూమ్ కి వెళ్లే వరకూ ఉండి ఆయన షాప్ ఓపెన్ చేసే టైమ్ అవ్వడంతో, జానకి ఇచ్చిన క్యారేజ్ తీసుకుని షాప్ కి వెళ్ళిపోయారు.

మోహన్ గారు ఒక మధ్యతరగతి వ్యక్తి. తనకి ఉన్న చిన్న ఆటోమొబైల్ షాప్ ద్వారానే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయన దృష్టిలో ఆడవాళ్లంటే ఇంటి పనులకి, మగవాళ్లకు సేవ చేయడానికి మాత్రమే... అనే అపోహ తో పెరిగిన వ్యక్తి. ఆ విధంగానే కట్టుకున్న భార్య ని అర్థం చేసుకోకుండా... కడుపున పుట్టిన కూతురిని కూడా ప్రేమగా చూడకుండా...

"తనని ఉద్ధరించేది. తన కొడుకే అని... తనని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటున్నారు."

తండ్రి షాప్ కి వెళ్ళిపోయాడు. అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత భరత్ ఫ్రెష్ అయి వచ్చి, హాల్లో కాళ్లు చాపుకుని కూర్చుని టీవీ లో సాంగ్స్ పెట్టుకుని వింటూ... ఫోన్ లో గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. తండ్రి ఉదయం షాప్ కి వెళ్తే, మళ్లీ తను కాలేజ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వస్తారు. అది తెలిసి ఎలాగూ షాపుకి వెళ్లి పోయారు కాబట్టి! హ్యాపీగా తను కాలేజ్ కి ఎగనామం పెట్టాలని డిసైడ్ అయిపోయాడు.

తను లేచి వచ్చి చాలా సేపు అయినా, టిఫిన్ తీసుకురాకుండా ఉన్న వాళ్ళ అమ్మ మీద చాలా కోపం వచ్చింది. భరత్ కి.

ఫోన్ పక్కకు విసిరి కొట్టి డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్ళి, గిన్నెలు అన్ని మూతలు తీసి చూశాడు. అన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి.

'ఏంటి అమ్మ! టిఫిన్ చేయలేదా? ఇవాళ? మరి నాన్న ఏం తిని వెళ్లారు? నాన్న బయట ఫుడ్ తినరు కదా! చేసే ఉంటుంది. కానీ, ఇక్కడ పెట్టలేదు ఏమో'... అనుకుని, డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని...

"అమ్మా! అమ్మా!" అని పెద్ద పెద్ద కేకలు వేయడం మొదలుపెట్టాడు.

అసలే భర్త! కూతురి పరిస్థితిని అర్థం చేసుకోకుండా... అవమానించి వెళ్లారు. అనే బాధలో ఉన్న జానకి కి, కొడుకు అరుపులకి... ఆ బాధ కోపం గా మారి విసురుగా పెరట్లో పని వదిలేసి డైనింగ్ రూమ్ కి వచ్చింది.

వస్తు వస్తూనే, "ఏరా! తెల్లవారి ఇప్పుడు లేచి మళ్ళీ ఆంబోతులా అలా అరుస్తున్నావు. ఏ! ఏం కావాలి?" అని కోపంగా అరిచింది.

ఎప్పుడూ శాంతంగా... ఏది అడిగితే అది మాత్రమే చేసి పెట్టే అమ్మ, అపర "కాళి లా!" అలా అరిచే సరికి, బిక్క మొహం వేసుకుని కుర్చీలో ముడుచుకుని కూర్చుండిపోయాడు. భరత్.

జానకి ఇంట్లోకి వస్తూ... "ఏరా? కాలేజీ కి వెళ్ళకుండా ఇవ్వాళ ఎందుకు ఇంట్లో ఉండి పోయావు? పైగా టీవీ చూసుకుంటూ, గేమ్ ఆడుకుంటూ... పెద్ద తాసిల్దార్ ఉద్యోగం చేస్తున్నట్టు అరుస్తూ ఉన్నావు. చేసేది ఏమీ లేదు గాని, నీకు అన్నీ టైం కి అమర్చి పెట్టాలా?" అని కోపంతో ఊగిపోయింది.

భరత్ కి వాళ్ళ అమ్మ అలా అరుస్తుంటే భయం వేసినా... వాళ్ళ నాన్న ముందు ఎప్పుడూ నోరు మూసుకుని ఉండే వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుని, తన కూడా నోరు పెంచి...

"ఎందుకమ్మా? నామీద ఓ అరుస్తున్నావు. ఏ నీ కూతురు ఇంకా అక్కడ ముడుచుకుని పడుకుని ఉంది. నేను ఎట్లీస్ట్ లేచి ఫ్రెష్ అయ్యాను. అది చూడు ఎంత బద్దకంగా పడుకుని ఉందో, పైగా నువ్వు దాన్ని అరవడం మానేసి నన్ను అరుస్తున్నావు." అన్నాడు.

అసలే భర్త మాటలకి తీవ్రంగా కుంగిపోయి ఉన్న జానకి కొడుకు మాటలకి సహనం చచ్చిపోయి ఆవేశం గా... కొడుకుని కేకలువేసింది.

"ఏమనుకుంటున్నారు. రా? మీ తండ్రీకొడుకులు?" ఆడవాళ్ళ గురించి.

"ఆడవాళ్ళంటే అంత చులకనా... ప్రతి నెలా వచ్చే రుతుక్రమాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. ఆ బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏం మనుషులు రా! మీరు? తల్లికి విలువ ఎలా ఇవ్వాలో తెలియని విధంగా తయారయ్యావు. అంతా మీ నాన్నగారి ప్రవర్తన వల్లే. ఆయనకి ఒక తల్లి ఉంది. అక్కా, చెల్లి ఉన్నారు. ఏం లాభం."

"భార్యని, కూతురిని అర్థం చేసుకోలేకపోతున్నారు. నెల నెలా వచ్చే రుతుక్రమాన్ని కూడా అవహేళన చేసి వెళ్ళారు. ఒక రకం గా అమ్మతనాన్ని అవమానించారు."

"మమ్మల్ని తక్కువగా చూస్తున్నాము. అని అనుకుంటున్నారు. కానీ, తన తల్లి కూడా ఒక ఆడదే! తన తల్లిని కూడా అవమానించాను. అని, మీ నాన్నకి అర్థం కావడం లేదు. అని కోపంగా! ఆవేశంగా! భాధతో అరిచింది.

భరత్ వాళ్ళ అమ్మ మాటలు అన్నీ విని, విసుగ్గా! "ఏంటి అమ్మా! ఏదేదో మాట్లాడుతున్నావు. అవన్నీ నాకేం తెలుసు. నాన్న తోటి మాట్లాడు. నాకు ముందు టిఫిన్ పెట్టు" అని, చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.

జానకి తల కొట్టుకుని, "ఎందుకా? ఇప్పుడే నీకు సరైన విషయాలు తెలియక పోతె, రేపు నీకు వచ్చే భార్య కూడా అలాగే ఇబ్బంది పడుతుంది. కనీసం నువ్వైనా... ఆడవాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకుని వారికి గౌరవం ఇవ్వడం నేర్చుకో, అందరికీ 'ఆడదే ఆధారం' అని తెలుసుకో," అని విసురుగా కిచెన్ లోకి వెళ్లి తాను వేసిన దోసెలను తెచ్చి కొడుక్కి పెట్టి లోపలికి వెళ్లిపోయారు.

రాత్రి షాప్ నుంచి తీసుకు వచ్చిన బ్యాగ్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్లడంతో, షాప్ వరకు వెళ్లిపోయిన మోహన్ గారు వెనక్కి తిరిగి వచ్చే సరికి జానకి కొడుకుతో ఆవేశంగా మాట్లాడుతున్న మాటలు విన్నారు.

హాల్ లోనే పక్కగా టేబుల్ పై పెట్టి బ్యాగ్ ని తీసుకుని, మౌనంగా వెనుతిరిగి షాప్ కి వెళ్ళి పోతూ... జానకి మాట్లాడిన మాటల్ని ఒకసారి ఆలోచించారు.

అలా... ఆ ఆలోచనలలో కూతుర్ని కూడా అర్థం చేసుకోకుండా... చిన్నతనంగా చూసిన, తన "తండ్రితనాన్ని" తిట్టుకుని ముందుకు వెళుతూ... రోడ్డు వారగా ఉన్న మెడికల్ షాప్ చూసి అక్కడ తన బండిని ఆపి, మెడికల్ షాప్ కి వెళ్లి కూతురి పరిస్తితి చెప్పి మందులు కొన్నారు.

ఆ మందులను తీసుకుని మళ్ళీ ఇంటికి పయనమయ్యారు.

ఇంటికి చేరుకున్న మోహన్ గారికి, కొడుకు హాలులోనే కూర్చుని టీవీ చూస్తూ ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ కనిపించాడు.

తండ్రిని సడన్ గా ఇంటి గుమ్మంలో చూసి, భయం తో కాళ్ళు చేతులు వణికిపోయాయి. భయంతో ఫోన్ పక్కన పడేసి లేచి నిలబడ్డాడు.

మోహన్ గారు సీరియస్ గా... ఒక చూపు చూసి, లోపలికి వచ్చే సరికి డైనింగ్ రూమ్ దగ్గర భారతి బుక్ చదువుకుంటూ ఉంటే, జానకి గారు తనకి టిఫిన్ తినిపిస్తూ కనిపించారు.

హఠాత్తుగా! భర్త రాకను చూసిన జానకి! భారతికి తినిపించడం ఆపి, కంగారు కంగారుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని తడిమి చూసింది.

నిలువెల్ల చెమటలతో తడిచిపోయిన ఆయన్ని, గబగబా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాగి కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్లు ఇచ్చి తన పైట చెంగు తో మొహానికి పట్టిన చమటను తుడిచి, పైన ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతున్నా... ఫైట చేంగుతో ఆయనకి విసురుతూ సపర్యలు చేసింది.

మోహన్ గారికి, "ఆమె సపరియలు" కొట్టకనే చెప్పుతో కొట్టినట్టుగా అనిపించింది.

తన జేబులోని మందులు బయటకు తీసి, భారతి చేతిలో పెడుతూ... టిఫిన్ తినేసి ఈ టాబ్లెట్ వేసుకుని... కాసేపు నిద్రపో అమ్మా! కడుపు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత చదువుకోవచ్చు లే, అని తను చదువుతున్న పుస్తకాన్ని మూసి టిఫిన్ ప్లేట్ తను తీసుకుని కూతురికి తినిపించారు.

భర్త లో వచ్చిన ఆ మార్పుకి జానకి కళ్ళు వర్షించాయి.

భారతి కూడా షాక్ గా! తండ్రి పెట్టే టిఫిన్ తినాలా? వద్దా? అని భయం భయంగా చూసింది.

ఎప్పుడు చూసినా! తనని తిట్టే తండ్రి అలా ప్రేమగా టిఫిన్ తినిపించి టాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకో అని చెప్పే సరికి తన కళ్ళ వెంట నీళ్లు కారాయి.

మోహన్ గారు భారతి కన్నీళ్ళు తుడిచి, "లేదు బంగారం ఇంక ఏడవకు. ఆడవాళ్ళు అని, ఇన్నాళ్లు మిమ్మల్ని చులకనగా చూసి చాలా బాధపెట్టాను."

"మగాడి కి 'ఆది' ఆడది" అని మరిచాను. నన్ను క్షమించండి. అని, కూతురు చేతులు భార్య చేతులు పట్టుకుని తన తలకు అన్చుకుని క్షమాపణ అడిగారు.

శ్రీ విజయదుర్గ

First Published:  16 Sept 2023 4:07 PM IST
Next Story