Telugu Global
Arts & Literature

"నీ ఇల్లు ఏది" ( వ్యాసం)

నీ ఇల్లు ఏది ( వ్యాసం)
X

ఆమెకు ఇల్లు ఉందా?

పద్దెనిమిది వయసు రాగానే, ఇది నీ ఇల్లు కాదు. నీకు వేరు ఇల్లు ఉంది. అంటూ.. ఆడంబరంగా పెళ్ళి చేసి, నీ భర్త ఉన్నదే! "నీ ఇల్లు "అంటారు.

ఆ పిచ్చి మాయమ్మ. "అవునా! నేను పుట్టి పెరిగిన ఇల్లు నాది కాదా!" అనుకుంటుంది.

మెట్టిన ఇంటినే.. తనదిగా చేసుకుంటుంది. తన అత్తమామల ఆలనా పాలన, తన భర్త అవసరాలను చూసుకుంటూ... తన ఇంటిని మరిచిపోయి, తను వచ్చిన ఇంటిని తనదిగా మార్చుకుంటుంది.

ఎప్పుడైనా! పొరపచ్చాలు వచ్చి కోపం వచ్చిన భర్త, ఆమెను, "ఇది నీ ఇల్లు కాదు. నాది." అని మాట జారితే!

"తన పుట్టిన ఇంటిని వదులుకుని తన సర్వస్వాన్ని అర్పించి, తన వారసత్వానికి జన్మనిచ్చిన ఆమెకి! అది తన ఇల్లు కాదా!" ఇది ఎక్కడి విచిత్రం.

పుట్టింటిలో అవసరానికి మించి, ఒక రోజు ఎక్కువ ఉంటే! చుట్టుపక్కల అమ్మలక్కలు.. "ఏమ్మా! పుట్టిల్లు నీ సొంతం అనుకుంటున్నావా? ఇది నీ ఇల్లు కాదు." అని అంటారు.

మరి ఆమెకు ఏది ? ఇల్లు పుట్టి పెరిగిన ఇల్లు తన ఇల్లు కాకపోతే! మెట్టిన ఇల్లు తన ఇల్లు కాకపోతే! మరి ఎక్కడ ఉంది? ఆమెకు ఇల్లు?

కనీసం.. తను చాలించిన తర్వాత అయినా! "ఆ ఈశ్వరుని ఇంటిలోనైనా తనకి చోటు దొరుకుతుందా?"

"అది అయినా! తన ఇల్లు అవుతుందా?"

"మనసు లేని భర్త ఉంటే, ఆ ఇల్లాలికి ఇల్లే కరువవుతుంది."

అదే! తనని మనసారా... ప్రేమించి, గుండెల్లో దాచుకునే భర్త దొరికితే.. "అతని హృదయమే ఆమె ఇల్లు అవుతుంది". ఆ ఇంటి ముందు.. ఎంతటి భవంతులైనా! చిన్నబోతాయి.

- శ్రీ విజయ దుర్గ. ఎల్

(నెల్లూరు)

First Published:  17 March 2023 1:56 PM GMT
Next Story