కొన్ని రుణాలు (కవిత)
అన్ని రుణాలూ
డబ్బుతోనే తీర్చలేము
కొన్ని రుణాలకు
బతుకంతా రుణపడి పోతామంతే ..!
పొద్దు పొద్దున్నే
నవ్వుతో పలకరించే
పూలతోటల్లాంటి
మనుషుల రుణాలు ..
విరగపండే పంట పొలాల్లాంటి మనుషుల రుణాలు ..
నిరతం జలజీవాలతో పారే
నిర్మలనదీ ప్రవాహాల్లాంటి
మనుషుల రుణాలు ..
తీరమెంత కోతకోస్తున్నా
నిలబడ్డ పచ్చని కొండల్లాంటి మనుషుల రుణాలు ..
బూడిదరంగు మబ్బులతో ముచ్చట్లాడే
కొండకొనల్లాంటి
మనుషుల రుణాలు ..
నెత్తిమీద పూలబుట్టల్ని మోస్తున్న
ఆకుపచ్చని అడవుల్లాంటి మనుషులు రుణాలు ..
లోన అగాధాలెన్నున్నా
తొణికని గంభీర సముద్రాల్లాంటి మనుషుల రుణాలు ..
చీకటిని సాగనంపుతున్న
వెచ్చని వేకువ దీపాల్లాంటి మనుషుల రుణాలు ..
ఎంతకీ తీర్చుకోలేం !
కొందరుంటారు
కొండా కోనా చెట్టూ చేమల్లే
ఏ రక్త బంధముండదు
కానీ చచ్చేదాకా వాళ్లతో
తెంచుకోలేనిబంధాలేవో
ముడిపడిపోతాయి
అన్ని రుణాలూ
ఆస్తులతోనే తీర్చలేము
మట్టిలో మట్టైనా ..
కొన్ని రుణాలు
తీర్చుకోలేని రుణానుబంధాలుగా మిగిలిపోతాయి
రుణం తీర్చుకోకపోయినా ..
వాళ్లు అడిగిందీ లేదు -
ఆశించిందీ లేదు గానీ
వాళ్లని వాళ్లలాగే ..
అంతే సహజంగా ..
నీలి ఆకాశమంత నిర్మలంగా ..
ఒక వేకువపొద్దున
చీకటిబురదలో విరిసిన
తెల్ల తామరపూవంత స్వచ్ఛంగా .. వదిలేస్తే చాలు !!
- సిరికి స్వామినాయుడు