Telugu Global
Arts & Literature

శ్లోకమాధురి: రసమంచిత వర్ణనా శ్లోకాలు

శ్లోకమాధురి: రసమంచిత వర్ణనా శ్లోకాలు
X

1

“ఇందుః కిం కవకాలంకః సరసిజ

మేతత్కింమంబు కుట్ర గతం?

లలిత విలాస వచనైః ముఖమితి హరిణాక్షి నిశ్చితం పర్యతః “

ఒక నాయకుడు తన ప్రియురాలిని ప్రశంసిస్తూ ఇలా అంటున్నాడు

"ఓ హరిణాక్షి!(జింక కన్నులదానా)

నీ ముఖాన్ని చూసి మొదట నేను చంద్రుడేమో అనుకున్నాను కానీ చంద్రుడిలో ఉండాల్సినటువంటి కళంకం ఇక్కడ లేకపోవడంతో ఇది చంద్రుడు కాదేమో అనుకున్నాను ఆ తరువాత కమలమా అని సందేహించాను మరి పద్మమైతే నీటిలో ఉండాలి కదా మరి ఇక్కడ నీరు లేదు కదా అందుకని ఇది కమలం కాదులే అని అనుకున్నాను, ఎప్పుడైతే నువ్వు మాట్లాడావో అప్పుడు నీ సుకుమారమైన విలాసవంతమైన మాటల వల్ల నాకు ఇది చంద్రుడు కాదు కమలము కాదు నా ప్రియురాలి ముఖము అని తెలిసింది"

మొదట గుండ్రని మొహం చూసి సంశయం కలిగిందిట. మచ్చలేదు కాబట్టి కాదేమో ?అన్న అనుమానం కలిగింది , విచ్చిన కమలమేమో ?అన్న సందేహం కలిగింది కాకపోతే నీళ్లు లేవు కనుక కాదు అన్న శంక కలిగింది చివరికామె మాటలు విన్న తర్వాత సందేహాలు తీరి ,ఇవేవీ కాదు ముఖమే అన్న నిశ్చయం కలిగింది

2

“గతాసు తీరం తిమిగహత్తనేన ససంభ్రమమం పౌరవిలాసీషు యత్రోల్లసత్ఫేనతతిచ్ఛ లేన ముక్తాట్టహాసేవ విభాతి సిప్రా “

సిప్రా నదిలో పురస్త్రీలు స్నానం చేస్తుంటే పెద్ద చేప ఒకటి నదిలోని నీటిని అల్లకల్లోలం చేసిందట ,అంతే !

ఆ ఆడవాళ్ళందరూ భయపడి గబుక్కున ఒడ్డుకు పరిగెత్తారు. ఇలా చేప కలిగించిన అల్లకల్లోలానికి, స్త్రీలందరూ అలజడితో నీటిలో నుండి పరిగెత్తడంతో నదిలో నురుగు ఒక తెట్టులాగా తేలింది.

ఆ దృశ్యం ఎలాగుందంటే ఆడవాళ్ల భయం చూసి సిప్రా నది విరగబడి నవ్వుతున్నదా అన్నట్లుగా ఉంది.

- డా.భండారం వాణి

First Published:  22 Nov 2023 7:28 AM
Next Story