Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    చుప్ (కథ)

    By Telugu GlobalJuly 13, 20237 Mins Read
    చుప్ (కథ)
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    2007 :: దృశ్యం  1

     

    “సైలెన్స్ ఇది క్లాస్ అనుకుంటున్నారా చేపల సంత అనుకుంటున్నారా! వాళ్లంటే మగ వెధవలు. తోకలు లేని కోతులు. ఆడపిల్లలు  మీకేమయ్యింది ! మీకు తోకలున్నాయిగా!”

    “మాకూ లేవు సార్ “ 

    “నోర్ముయ్యండి ! ఆడపిల్లలు ఎంతో అణగి మణిగి ఉండాలి . తల ఎత్తకూడదు.  నోరు విప్పకూడదు. పూర్వం అసలు ఇంట్లోంచి బయట అడుగు పెట్టనిచ్చేవారే  కాదు తెలుసా . ఇప్పడు చదువులూ చట్టుబండలూ అంటూ  వీధిలోకి తోలేస్తున్నారు ! అసలు మీ పెద్ద వాళ్ళకి బుద్ధిలేక గాని మీకు చదువులెందుకు శుద్ధ దండగ! ఇంటినీ పిల్లల్నీ చూసుకుంటే చాలదూ!”

       “ అలా అంటారేవిటి సార్.  వేద కాలంలోనే మైత్రేయి,  గార్గి , లోపాముద్ర  అన్ని విద్యలూ  అభ్యసించారట.  వేదాలు చదివారట.  స్త్రీలు యుద్ధంలో కూడా పాల్గొనాలని వేదాలు చెప్పాయిట. తెలుగు మాష్టారు చెప్పారు…”

    “ఆయనొకడు! ఆధునిక కాలం గురించి చెప్పకుండా ఆదిమానవుల గురించి చెబుతాడు! చూడండి పిల్లలూ. ఇది కలియుగం . ఈనాటి పరిస్థితులకు తగ్గట్టు మలచుకుని , సర్దుకుపోవడం నేర్చుకుంటే మీకూ మీ కుటుంబాలకూ  ఎంతో మంచిది. మీరు ఆడపిల్లలని కలలో కూడా మరిచిపోవద్దు!”

     

    2008 :: దృశ్యం – 2

     

    “నాన్నా,  మా స్కూల్ వాళ్లు స్టూడెంట్స్ ని  అరకు ఎక్స్ కర్షన్కి  తీసుకెళ్తున్నారు. నేనూ వెళతాను నాన్నా …!” 

    “నువ్విప్పుడు చిన్నపిల్లవి కాదు.  ఎక్కడికి బడితే అక్కడికి ఎగరేసుకుని పోకూడదు!” 

    “నేనొస్తే నా ఫ్రెండ్సూ వస్తానంటున్నారు. మన వీధిలోని నా ఫ్రెండ్స్ గుండుగాడు, పిలక శాస్త్రి కూడా వెళుతున్నారు నాన్నా !” 

    “వాళ్ళు మగాళ్లు.  ఎక్కడికైనా వెళతారు.  వాళ్లతో నీకు సాపత్యం ఏమిటే.  వాళ్లతో ఎప్పటికీ సమానం కావు గాని,  నోర్మూసుకుని ఇంట్లో పడి వుండు! “  

     

    2009 :: దృశ్యం – 3

     

    “ నాన్నా  నాన్నా “

    “అలా బెదురు చూపులు చూస్తున్నావేంటే ?  ఏమైంది  ?” 

    “ ఎదురింటిలోని అంకుల్  మంచివాడు కాదు….. ”

    “ రిటైర్డ్ తాసిల్దారు నీ కళ్ళకు చెడ్డవాడిగా కనిపిస్తున్నాడా! చాలు చాల్లే. నంగ నాచి చాడీలు  కట్టిపెట్టు. అన్నీ  నీకే తెలిసినట్టు వాగకు…!”

    “ నన్ను బలవంతంగా ఒళ్ళోకి లాక్కుని……  అతనిది బ్యాడ్ టచ్  నాన్నా…!”

    “ముందా ఏడుపు ఆపు . ఏదో జరక్కూడనిది జరిగిపోయిం దనుకుంటారంతా. ఈ సంగతి ఎక్కడా  ఎవరికీ చెప్పకు, పరువు పోతుంది!”

    “అది కాదు నాన్నా …” 

    “ఇంకేం చెప్పొద్దు. నేను వినను. ఇంకెప్పుడూ ఆ ఇంటివైపు వెళ్ళకు. వెళ్లినట్టు తెలిస్తే నీ ఒళ్ళు చీరేస్తాను, జాగ్రత్త …!”  

     

    2010 :: దృశ్యం – 4

     

    “ అన్నయ్యా , నేనూ  మీతో క్రికెట్ ఆడతాను… “  

    “నువ్వు ఆడపిల్లవి . మగ పిల్లలతో కలిసి ఆడకూడదు. వెళ్లెళ్లు …” 

    “నీకన్నా బ్యాటింగు బాగా చేస్తాను కదా అన్నయ్యా, ప్లీజ్ …..” 

    “వూరికే వాదించకు. నువ్వు ఇంట్లోనే  బొమ్మరిల్లుతోనో, తొక్కుడు బిళ్లలాంటి ఆటలో ఆడుకోవాలి. మగరాయుడిలా వీధిలోకొచ్చి ఎగరకూడదు . ఫో,  ఇంట్లోకి ఫో! ”

    2014 ::  దృశ్యం -5

     

    “కో ఎడ్ జూనియర్ కాలేజీలో సీటు  వచ్చింది బాబాయ్. డాడీ గర్ల్స్ కాలేజీలోనే చేరుస్తానంటున్నారు.  నువ్వు కొంచెం చెప్పు బాబాయ్. నీ మాట వింటారు…”

    “ మీ నాన్న అన్నీ బాగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకుని ఉంటార్లే. నీకంటే నీ బాగు మీ నాన్నకే ఎక్కువ తెలుసు. అతిగా ఆలోచించడం మానెయ్. ఆడవారి  సొంత నిర్ణయాలు అతిప్రమాదకరం అన్నారు !  ”

    “అదికాదు బాబాయ్. ఆ కాలేజీ ఎంతో మంచిది. ఇంటర్, ఎంసెట్లలో ఎన్నో ర్యాంకులు సాధిస్తోంది. ల్యాబ్ చాలా బాగుంటుంది..”   

    “అదంతా అనవసరం . నాన్న చెప్పినట్టే చేయి.  నువ్వే పెద్ద తెలివైందానివి అనుకోకు. నువ్వు ఆడపిల్లవి.ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అన్నిటికీ తగుదునమ్మా అని తయారవ్వకూడదు. అది నీకూ మాకూ అందరికీ మంచిది!”

     

    2015 ::  దృశ్యం – 6

     

    “మావయ్యా !చీకటి పడితే చాలు మా ఇంటి మలుపులోని కిళ్లీ బడ్డీ దగ్గర పోకిరీలు చేరుతున్నారు. నా మీదా , నా ఫ్రెండ్స్ మీదా  అసభ్యంగా కామెంట్లు  చేస్తున్నారు.  పోలీసులకు కంప్లైంటు ఇద్దామంటే, తిరిగి నా మీదే కోప్పడుతున్నారు అన్నయ్యా, నాన్నా  . నువ్వైనా ఏదోటి చెయ్యి  మావయ్యా. ప్లీజ్ …”

    “బిగుతుగా ఉండే , పలచగా ఉండే దుస్తులు ధరించకు . అతిగా మేకప్ చేసుకోకు. అప్పుడు నీ వంక ఎవరూ చూడరు. నీ   జోలికీ  రారు. అయినా చీకటి పడేదాకా మగాళ్లా  బయటి తిరుగుళ్లేమిటే !పెందలకాడే  ఇంటికి వచ్చేయ్. వాళ్ల వంక చూడకుండా తలవంచుకుని వచ్చేస్తే సరి. దుష్టులకు దూరంగా ఉండాలి.  తెలిసిందా! ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చిపిచ్చి ఫిర్యాదులు నాకు చెప్పకు !”

     

    2017 :: దృశ్యం – 7

     

    “ నాన్నా,  నా ఫ్రెండ్సంతా బలవంతపెట్టి నా చేత కల్చరల్ సెక్రటరీ పోస్టుకి నామినేషన్ వేయించారు… ”

    “వెంటనే  వెనక్కి తీసేసుకో.  అది అంతటితో ఆగదు . ఆ ప్రచారాలు, తిరుగుళ్లు, రాజకీయాలు నీకు అనవసరం. నీ చదువేదో నువ్వు చూసుకో. ఇంజనీరింగు చదువుతున్నావని నీకేవో కొమ్ములొచ్చాయని ఫీలవ్వకు. నువ్వు ఆడపిల్లవని బాగా గుర్తు పెట్టుకో  ! ”  

         “ లీడర్షిప్ క్వాలిటీస్ నా కెరీరుకి చాలా హెల్ప్ అవుతాయని మీకు  తెలుసుగా నాన్నా.  అయినా ఎందుకు వద్దంటున్నారు ?”

    “ చెత్త ప్రశ్నల్ని పాతరేసి చెప్పింది ఫాలో అవ్వు.  నీ పేరు నలుగురి నోళ్ళలో నానడం నాకు ఇష్టం లేదు.  నీ తిరుగుళ్ళ గురించి  రేపు పెళ్లి టైంలో మగ పెళ్ళివారికి వాసన తగిలితే చాలు పెడర్ధాలు తీస్తారు. చులకనచేసి మాట్లాడతారు . లేనిపోని అప్రతిష్ఠ  వచ్చి పడుతుంది.  నీ మేలుకోరి చెబుతున్నా విను. వద్దంటే వద్దు.  మరి నోరెత్తొద్దు అని దానర్ధం. అది గ్రహించి బుద్ధిమంతురాల్లా  మసలుకో. మాకు తలవంపులు తెచ్చే పని చచ్చినా చెయ్యకు. నీకిదే నా వార్నింగ్ ! ”

     

    2019 :: దృశ్యం – 8

     

    “గుడ్ న్యూస్ నాన్నా! నాకు  క్యాంపస్ సెలక్షన్ వచ్చింది.  పూణే కంపెనీ.  12 లక్షల ప్యాకేజీ…”

    “సంతోషమే గాని, అంత దూరం పంపను. చిన్నదైనా సరే హైదరాబాద్ కంపెనీ చూసుకో . అసలు నీ ఇంజనీరింగ్ చదువు గురించే, నీకు ఎలాంటి ఇబ్బందీ రాకూడదనేగా  సిటీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుని మరీ వచ్చింది  !”  

    “మంచి ఆఫర్ నాన్నా . త్రీ ఇయర్సులో అబ్రాడ్ పంపిస్తారట…” 

    “అవసరం లేదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన దానివి. ఎక్కడో దూరాన  ఉంటే ,అక్కడేం వేషాలు వేశావో అని అనుమానిస్తారు. ఇక్కడే జాబు చేస్తే ఎన్నో మంచి సంబంధాలూ  వస్తాయి. చులాగ్గా పెళ్లి కుదిరిపోతుంది.  మేం తేలిగ్గా గుండెలమీంచి  నిప్పుల కుంపటి దించేసుకోవచ్చు. ఏం చేయాలో ఏది కూడదో మాకు  తెలుసు గాని, నువ్వూరికే ఎక్కువగా  ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు !”

    2021 :: దృశ్యం – 9

     

    “మీ సంబంధం మా వాళ్ళకీ , మా సంబంధం  మీ వాళ్ళకీ  బాగా నచ్చింది .  ఇచ్చిపుచ్చుకోటాల  వ్యవహారమూ  సెటిలైంది.  ఇక మనం పచ్చజెండా ఊపడమే తరువాయి. నువ్వు నాకు నచ్చావు . నేన్నీకు నచ్చకపోవడమన్న ప్రశ్నే లేదు. చదువులో ఎత్తులో సంపాదనలో అన్నిటా నీకన్నా పై స్థాయిలో ఉన్నాను. ఇంతటి  అదృష్టం ఎంతమంది అమ్మాయిలకు లభిస్తుందీ ! నువ్వు లక్కీ అవునా కాదా ?  ” 

    “నేను కొంచెం ఆలోచించుకోవాలి….”

     “ఆడవాళ్లు ఆలోచించడం మొదలుపెడితే ప్రళయాలు వచ్చేస్తాయి గాని తలూపి తాళి కట్టించుకో”

    “సారీ. మీరు నాకు నచ్చలేదు. మీది కుంచిత మనస్తత్వం. మగ దురహంకారం .  మీకు భార్య కావాలి గాని అర్ధాంగి, సంసార భాగస్తురాలు అక్కర్లేదు!”  

    “ హు , నీది తిరుగుబాటు మనస్తత్వం. విచ్చలవిడి ధోరణి. నువ్వు నాకు నచ్చలేదు.  ఐ హేట్ ఉమన్ లైక్ యూ ..!”

     

    2023 ::  దృశ్యం – 10

     

    “ నాన్నా , మీతో కొంచెం మాట్లాడాలి…”

    “నీ పెళ్లి సంబంధాల గురించా !”  

    “ కాదు, నా గురించి ..”

    “నీ గురించి మాట్లాడటానికి కొత్తగా ఏముందే . అంతా నాకు తెలిసిందేగా!”

    “తెలుసని మీరు అనుకుంటున్నారు, కానీ ఏమీ తెలీదు. నా రూపం, చదువు, మార్కులు, జీతం –  తప్ప ఇంకేమీ  తెలీదు. నా ఆలోచనలు ఆకాంక్షలు ఊహలు ఏవీ మీకు  తెలీవు.  అసలు నా మనసులో ఏముందో  మీకు కించిత్తు తెలీదు!”

    “వెధవ్వాగుడు కట్టిపెట్టు. నీ  స్థానం ఎక్కడో తెలుసుకుని మసలుకో, బాగుపడతావు. ఊరికే ఎగిరి పడడం మానెయ్ . వెళ్ళు.  వెళ్లి బుద్దిగా నీ పని చూసుకో. పని లేకపొతే వెళ్లి అమ్మకి వంటలో సాయం చెయ్యి . రేపు పెళ్లయ్యాక నీ మొగుడు సుఖపడతాడు …!” 

    “మీరు కోప్పడినా సరే ఇవాళ నేను గొంతు విప్పి  తీరతాను . ఇప్పుడూ కాకపోతే ఇంకెప్పుడు ? “ 

      “ఇవాళ నీకేమయ్యిందే?”

     “ అదే చెబుతున్నా.  ఇన్నేళ్లూ మీరు గీచిన బరిలోనే తిరిగాను. మీ మాటకు, కనుసైగకు కట్టుబడే ప్రవర్తించాను. ఇక నాకు సాధ్యం కాదు నాన్నా. నాలో గూడుకట్టుకున్న వేదన, నిరాశ, నిస్పృహ లోలోపలే బందీగా ఉండలేక  లావాలా గొంతు చీల్చుకుని  బయటికి వచ్చేస్తున్నాయి…!”

    “ఆడదానివని మర్చిపోయి ఆ మాటలేంటే ? సంపాదిస్తున్నావని కళ్ళు నెత్తి కెక్కాయా ?ఆడపిల్లకు అంత  అహంకారం  పనికిరాదు. ఇంకో ఇంటికి వెళ్లాల్సిన దానివని గుర్తుపెట్టుకో  !” 

    “ నాది పొగరుగా అహంకారంగా మీకు కనిపించొచ్చు. కానీ నాది ఆత్మగౌరవం! అస్తిత్వపోరాటం! రెండు గొంతులు ఇచ్చిన ‘మీ టూ’ నినాదం, అనేకానేక గొంతులుగా మారి, ప్రభంజనమై ప్రపంచాన్ని ఊపేసిందన్న సత్యం ఇచ్చిన ప్రేరణ! స్ఫూర్తి! ఇంకా ఇంకా ఈ లింగ వివక్షత భరించగల ఓపిక మాకు లేదు. మేమంతా ఈ బానిసత్వపు  సంకెళ్ళు తెంచేస్తున్నాం!”

    “బరితెగించిన దానిలా ఆ పిచ్చి ప్రేలాపనేమిటే ? బుద్ధిగా ఉండి శీలవతివీ ,పతివ్రతవీ అనిపించుకో! “  

    “శీలం ఆడదానికే ఉంటుందా నాన్నా ? మనస్సులో ప్రవర్తనలో సంస్కారంలో బుద్ధివికాసంలో గాక  కేవలం శరీరంలోనే శీలం ఉంటుందా? అదీ తొడల మధ్యే ఉంటుందా! వద్దు నాన్నా. ఆ బూజునింకా మా మెదళ్లలోకి ఎక్కించొద్దు. ఇన్నాళ్లూ  మా నోళ్లు నొక్కేశారు.  మెదడుకి నల్లని ముసుగు వేసేసారు. అడుగడుగునా ఆంక్షలు విధించారు . ఇకనైనా  ఇప్పుడైనా మా నోళ్ళు తెరవ నివ్వండి. గొంతు విప్పి స్వేచ్ఛగా మాట్లాడనివ్వండి. మేం పాతకాలపు గంగిరెద్దులం కాదు. అన్నిటా పురుషులతో సమానంగా ఎదిగాం. కొన్నిట్లో అధిగమించాం . ఆ ధైర్యంతో హక్కుతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను. ఇకనుంచి  మా గురించి, మేం  ఉండాల్సిన విధానం గురించి, మా నడత నడవడికల గురించి, మా దుస్తుల గురించి, మా విలువల గురించి మీరెవరూ డిక్టేట్ చేయకండి. తలొంచుకుని  వినడానికి మేం  సిద్ధంగా లేం ! అంతేకాదు, ఇన్నేళ్లూ ‘చుప్’ అని మా నోళ్లు మూసిన మగ దురహం కారులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం – చుప్ రహో!”

    – సింహప్రసాద్

    Chup Telugu Kathalu
    Previous Articleసైనస్‌ సమస్యకు సొల్యూషన్ ఇదే..
    Next Article భావన: ప్రకృతి -పురుషుల నుంచి నేర్చుకొవాలి
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.