Telugu Global
Arts & Literature

శ్లోకమాధురి...కొత్తపాతలు

శ్లోకమాధురి...కొత్తపాతలు
X

పురాణమిత్యేవ న సాధు సర్వం

న చాపి కావ్యం నవమిత్యవద్యమ్ ।

సన్తః పరీక్ష్యాన్యతరద్భజన్తే మూఢః పరప్రత్యయనేయబుద్ధిః ॥

కావ్యము పాతది అవడం వల్ల మంచిది అని అనరాదు , అలాగే కావ్యము కొత్తదైనంత మాత్రం చేత నిందింపదగినదీ కాదు, అందుకే ఉత్తములు కొత్తపాతలను చక్కగా పరిశీలించి వాటిలోని ఏదో ఒకదానిని (మంచిదానిని) స్వీకరిస్తారు,

మూఢులైన వారి బుద్ధి ఇతరుల అభిప్రాయం చేత మాత్రమే నడిపింపబడుతుంది. అంటే వాళ్లుగా ఆలోచించి కాక పరుల అభిప్రాయంపైన ఆధారపడతారు అని.

ఇది దాదాపు 2000 ఏళ్ల క్రితం కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రంలోనిది. అప్పటికింకా ప్రసిద్ధిపొందని వర్ధమాన కవి (ఆయన మాటల్లోనే) కాళిదాసు తన నాటకం అందరూ ఆదరిస్తారో లేదో అని సందేహం మారీషుని (ఒక పాత్ర) ద్వారా వెలిబుచ్చుతూ దానికి జవాబుగా అన్న పలుకులివి.

సాధారణంగా కావ్యనాటకాలలో పురాణేతిహాసాలకు సంబంధించిన కథావస్తువు, నాయకుడు వుంటే ఇందులో కథ చారిత్రము, నాయకుడు సమకాలీనుడైన అగ్నిమిత్రుడు, మరి తన ఈ నవ్య కావ్యాన్ని ఎవరాదిరిస్తారు ?అని భావించి సూత్రధారుడితో ఇలా చెప్పించాడు.

ప్రేక్షక, శ్రోత, పాఠకులు వివేకవంతులైన వారు, విద్వాంసులు అయితే ఇది కొత్తప్రయోగం కదా అని తిరస్కరించరు, తామే స్వయంగా పరీక్షించి బాగోగులు గ్రహించి తగు నిర్ణయం తీసుకుంటారు. కొత్త వారికి పాతది, పాతవారికి కొత్తది అధికశాతం ఆమోదయోగ్యంగా వుండదని మనం నేటికీ ప్రపంచంలో చూస్తున్నదే .

నాటితరంవారు కొత్తవి చూసి ‘వేలంవెర్రి, ఓల్డ్ ఇస్ గోల్డ్ ‘ అంటారు. నేటితరం వాళ్ళు’అబ్బే! అదంతా పాత చింతకాయపచ్చడి’ అంటారు. మరి వాటిల్లో ఏది గ్రహించాలి, ఏది ఆమోదయోగ్యం కాదు అంటే తమంతతాముగా లేదా విజ్ఞులైన వారిని సంప్రదించి తెలుసుకోవాలి. అంతేగానీ ఇతరుల అభిప్రాయాలు తమవిగాచేసుకొని ప్రవర్తించి మూఢులనే ముద్ర ధరించకూడదు.

అలాగే కావ్యంలో కూడా గుణము ప్రధానము కానీ పురాతనమా , నవ్యమా అన్న దృష్టి ఉండకూడదని పిండితార్థం.

ఇవ్వాళ ఈ శ్లోకం ఎందుకు ఎంచుకున్నానంటే , సుధామగారి వినూత్న ప్రయోగం “సప్తపది” ని రచిస్తున్నవారు, ఆదరిస్తున్నవారంతా వివేకులు ,పండితులు అని చెప్పకచెప్పుతున్నట్లున్నదని. “రమణీయార్థ ప్రతిపాదకం కావ్యం” కదా! క్రాంతదర్శులైన సప్తపది కవులెందరో అందరికీ వందనాలు.

-డాక్టర్ భండారం వాణి

First Published:  14 July 2023 5:34 PM IST
Next Story