శ్లోకమాధురి :7..కాళిదాసు చేసిన ఆశ్రమ వర్ణన
*ఆకీర్ణమృషిపత్నీనాముటజ
ద్వారరోధిభిః ।
అపత్యైరివనీవారభాగధేయో
చితైర్మృగైః ॥
సేకాన్తేమునికన్యాభిస్తత్క్షణోజ్ఝిత
వృక్షకమ్।
విశ్వాసాయవిహఙ్గానామాల
వాలామ్బుపాయినమ్ ॥
కాళిదాసు రఘువంశంలో ఆశ్రమ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు ఇలా. దిలీప మహారాజు తన భార్య సుదక్షిణాదేవితో కూడి గురువైన వశిష్ట మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. వారు చేరే సమయానికి సాయం కాలమైంది . అప్పటి ఆశ్రమం యొక్క అద్భుతమైన దృశ్యము మన కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించాడు కాళిదాసు.
నీవారధాన్యాన్ని తినడానికి అలవాటుపడి , పర్ణశాల ద్వారాలకు అడ్డుపడి మునిపత్నుల సంతానం లాగా మెలుగుతూ ఉన్నటువంటి జింకలు ఆశ్రమ అంతటా వ్యాపించి ఉన్నాయిట . ఆ ఆశ్రమం లో వారి కన్యకలు మొక్కలకు నీళ్లు పోసి, ఆ మొక్కల కుదుళ్లలో నిలిచి ఉన్న నీటిని తాగే పక్షులకు భయం లేదు నిర్భయంగా తాగండి అని నమ్మకం కలిగిస్తున్నారా అన్నట్టుగా వెంటనే ఆ మొక్కలకు దూరంగా జరిగి నిలిచి ఉన్నారుట .
అటువంటి ఆశ్రమం లోనికి మహారాజు మహారాణి ప్రవేశించారు.
ముని పత్నుల నుండి వారి సొంత పిల్లల వలె తమ వంతు భాగం తమకి ఇచ్చేయమని గుమ్మం దగ్గరే ఆపిసి మారాం చేస్తూ అడ్డగించి వాళ్ళ చేతుల్లో నుంచి ఆ నీవార ధాన్యాన్ని లాక్కుంటూ ఉన్నటువంటి లేళ్లతో నిండిన ఆశ్రమ దృశ్యము, సామాన్యంగా మన ఇళ్లలోనూ బయటనుంచి వచ్చిన తల్లితండ్రులు తమకేం తెచ్చారు ,అది నావాటా అని వాదులాడుతున్నట్లుగా సహజంగా ఎంత మనోహరంగా ఉంది!!
అలాగే మరి అమ్మాయిలు కూడా ముని కన్యకలు కూడా చెట్లకి నీళ్లు పోసిన వెంటనే, భూమిలోకి నీరు ఇంకే కన్నా ముందే ఆనీటిని తాగే చిన్నచిన్న పక్షులు బెదిరిపోకుండా, నిశ్చింతగా ఆ పాదులలోని నీరు మీరు త్రాగ వచ్చునులే అని భయాన్ని తొలగిస్తున్నట్లుగా దూరంగా వెళ్లిపోయి నిల్చున్నారట. వాటి భయాన్ని దూరం చేస్తూ తామూ దూరంగా తొలగడం అనేది అద్భుతమైన సన్నివేశం.
అటువంటి ఆశ్రమానికి సంతానకాముడైన దిలీపుడు,అతని భార్య సుదక్షీణ ఇద్దరూ వచ్చి చేరారు.
- డా.భండారం వాణి