ఎదురుచూపు
అప్పుడెప్పుడో
డాబా జాలు పై కూర్చున్నప్పుడు
ప్రహరీ పక్కనే ఎదిగిన చెట్టు
మన ఒళ్ళో గాలివాలుకు రాల్చిన
ఆకాశమల్లెపూలు
మనసునిండా విచ్చుకుని
కబుర్లతో బాటుగా మనల్ని
పరిమళభరితం చేసినది
నీకు గుర్తుందో లేదో
కాలప్రవాహం ఉన్నట్లుండి
ఇద్దర్నీ చెరోమూలకి విసిరేసింది
అయితేనేం
వారానికో పదిరోజులకో
ఆ మూలనుండి ఈ మూలకి
ఎగిరొచ్చిన తోకలేనిపిట్ట
నా ముంజేతి మీద వాలి చెప్పిన ఊసుల్ని
భద్రంగా గాజులపెట్టెలో దాస్తే
పెట్టి తెరిచినప్పుడల్లా
గాజుల గలగలల పక్కవాయిద్యంతో కలిసి
కువకువ లాడుతూ పలకరిస్తూనే ఉండేవి
తర్వాత్తర్వాత
అరుదుగానో తరుచుగానో
తీగలప్రకంపనలతో ప్రయాణించి
నీగొంతులోని స్నేహామృతాన్ని
చుక్కలు చుక్కలుగా నాచెవిలో చిందించేవి
రాను రాను ఇప్పుడు
ఎప్పటికప్పుడు
మనసుకు క్లిప్పులు బిగించి
పెదాలకు జిప్పులు తగిలించి
మాట్లాడటం మర్చిపోయి
చాట్లతో కబుర్లను చెరుగుతూచెరుగుతూ
దుఃఖాన్నీ,ఆనందాన్నీ
ఆశ్చర్యాన్నీ,ఆవేశాన్నీ
అనుభూతులు అనుభూతులుగా
తగిన" ఎమోజీ" ల్ని ఎన్ని విసురుకుంటున్నా
అదేమిటో మనసు నిండటమే లేదు
మళ్ళీ పక్కపక్కనే
కూర్చునే మనమధ్య
ఒకరి స్నేహానుభూతిని మరొకరికి
స్పర్శ ద్వారా గుండెల్ని నింపుతూ
పారిజాతాలుగా కబుర్లు రాలి
పరిమళించేది ఎప్పుడోకదా!!
- శీలా సుభద్రాదేవి