Telugu Global
Arts & Literature

ఫ్రెండ్షిప్ డే

ఫ్రెండ్షిప్ డే
X

అండమాన్ సముద్రం మధ్యలో

తొండమాన్ చక్రవర్తి లా

ఎండని కూడా ఎంజాయ్ చేద్దామని

బండబారిన మనసుని మెత్తబరుద్దామని ఆవురావురుమంటూ

అరుదెంచిన ఆప్తమిత్రుడు

అందని ఏ దూర తీరాలకో

చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా

అంతర్ధానమై పోయిన అమ్మ గుర్తొచ్చిందని కన్నీళ్ళు పెట్టుకుంటే

హత్తుకొని ఓదార్చడానికి

దెగ్గర లేనందుకు నన్ను నేనే నిందించుకున్నా ...

ఆన్ దిస్ ఫ్రెండ్ షిప్ డే ...

బళ్ళో భుజం రాసుకు తిరిగిన నేస్తాలు

కాలేజీ లో కలిసిమెలిసి తిరిగిన స్నేహితులూ

ఉద్యోగాల్లో ఉన్నతిని మెచ్చిన శ్రేయోభిలాషులూ

పట్టు తప్పి పడబోతే

ఆసరా అందించిన అనుభవజ్జులూ

కష్టం లో కుంగి పోతే

నష్టం లో కూరుకుపోతే

దాష్టీకాన్నెదిరించమని

అంగుష్టం అందించి ధైర్యాన్ని

పరిపుష్టం చేసిన ప్రాణమిత్రుల

సౌశీల్యానికి ప్రణామం ..

ఆన్ దిస్ ఫ్రెండ్ షిప్ డే ...

ఫేస్ బుక్ ద్వారానో, బస్టాండ్లోనో, ఇడ్లీ బండి దగ్గరో ఇతరత్రానో సోషల్పరిచయమై

జీవిత ప్రయాణం లో అనుక్షణం

అన్యోన్యత తో ఆదరించే

ఆనురాగ దేవతలూ ...

ప్రయాణం లో మజిలీల్లా

తాత్కాలికమే అయినా

ఆప్యాయంగా కలగలిసే

తోటి ప్రయాణీకుల్లా

కొన్నాళ్ళు, కొండొకచో కొన్నేళ్ళు,

గమ్యం గమనించని గమనం లా

తోడొచ్చిన తోటి మనసులూ

సాటి మనుషులూ

అందించిన

అందిస్తూన్న ప్రేమానురాగాలు

అబేధ్యం, అనిర్వచనీయం,

అన్ బ్రేకబుల్

అజరామరం...

అందుకే వారందరినీ

ఎక్కిస్తున్నా అందలం ...

ఆన్ దిస్ ఫ్రెండ్ షిప్ డే ...

సంస్కృతీ, సంప్రదాయం,

ప్రకృతీ, ప్రదోషం

రాగం, ద్వేషం,

స్వార్థం, స్పర్థ

అన్ని ఎల్లలూ చెరిగి

ఎత్తు పల్లాలూ ఒరిగి

అభిమానపుటంచులెఱిగి

స్నేహ మాధుర్యంలో కరిగి

ప్రవహిస్తూ పరుగులెత్తే

దోస్తానీ కి వందనం

జాన్ జిగ్రీ దోస్తులందరికీ

అభివందనం...

ఆన్ దిస్ ఫ్రెండ్ షిప్ డే

- సాయి శేఖర్

First Published:  6 Aug 2023 12:01 PM IST
Next Story