పట్టుచీరల ముచ్చట్లు (కథ)
శ్రావణమాసం అంటేనే పూజలు,వ్రతాలు, పట్టుచీరలు.....
సోదరీమణులు అందరికీ శ్రావణమాస శుభాకాంక్షల తో ...
ఈ కమనీయ కథ
"సాయంత్రం కొంచెం సాయం చేస్తారా" అని అడిగింది మా ఆవిడ అన్నం వడ్డిస్తూ
"ఏ పనిలో"
"చీరల బీరువా సర్దుకొనే పనిలో"
"అలాగే"
"సరే అయితే సాయంత్రం టీ తాగి మొదలు బెడదాము"
"సరే"
//////////////////////////////
టీ తాగి బీరువా ముందు ఒక దుప్పటి పరిచి నన్ను కూచోబెట్టి
ఆవిడ బీరువా తీయగానే జలజల మంటూ నాలుగైదు కొత్త చీరలు వాళ్ళ యజమానురాలుకి పాదాభివందనం చేశాయి. మా ఆవిడ వాటిని ప్రేమగా హత్తుకుని ముద్దాడి నా చేతికిచ్చింది.
"నా స్పర్శ కోసం తహతహలాడుతున్నాయి పాపం. త్వరగా కట్టుకో కట్టుకో అంటున్నాయి"
అంది తన్మయత్వం గా బీరువా ఎదురుగా కింద కూచున్నానేమో తలెత్తి బీరువాలోకి చూస్తే ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణభగవానుడు విశ్వరూపం చూపెట్టినట్లు నాకు మా ఆరడుగుల బీరువా తన విశ్వరూపం చూపెట్టింది.
అయిదు అరల నిండా కిక్కిరిసి ఉన్న రంగు రంగుల రక రకాల చీరలని చూస్తుంటే నా కళ్ళకి మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, నారాయణపేట, పోచంపల్లి, పెడన, కంచి, బెనారస్, మైసూర్ ఇత్యాది ఊళ్ళు కనపడ్డాయి.
"మొత్తం చీరల ప్రపంచాన్నే బీరువాలో బంధించావు"అన్నాను నవ్వుతూ
"మీరు మరీనూ...దిష్టి పెట్టకండి. అసలే ఏడాది నుంచి కరోనా పుణ్యమా అని ఒక్క పెళ్లి లేదు, పేరంటం లేదు, ఒక్క చీర తనివితీరా కట్టినట్లు లేదు..ఒక్క చీర కొనుక్కోలేదు"
"సరే ఏ అర ఖాళీ లేదుగా...మరి ఇప్పుడు ఇందులో సర్దడానికి ఏముంది నా తలకాయ"
"శుభమా అని చీరల బీరువా తెరిస్తే దీపాలు పెట్టే వేళ ఏమిటా పిచ్చి వాగుడు...లెంపలు వేసుకోండి"
"సరే వేసుకున్నాను...ఏమి చేయాలి మనం ఇప్పుడు?"
"ఏమీలేదు...అన్నీ ఓకసారి తీసి చూసుకుని మళ్లీ మడతలెట్టి ఒక క్రమంలో సర్దుకుందాము. ఈ చీరలను చూస్తుంటే నన్ను ముంచెత్తే మధురానుభూతులు, మధుర జ్ఞాపకాలు మీతో పంచుకుందామని"
"అయితే నా సాయంత్రపు నడక కి ఈరోజు నాగా పెట్టాలా?"
"రోజూ ఉండేదేగా ఆ నడక? ఇవాళ నా చీరల సామ్రాజ్యం లోకి తొంగి చూడండి, అక్కడే పచార్లు చేయండి. ఉచితంగా బోలెడన్ని మధురానుభూతులు పొందండి"అంది మనోహరంగా నవ్వుతూ
"అయితే సరే..."
"అన్నీ కలగాపులగం అయిపోయాయి. పట్టుచీరలు అన్నీ ఒక అర లోను, కట్టుడు చీరలు ఒక దాంట్లోనూ, కాటన్ వి ఒకదాంట్లోను, ఫాన్సీ వి ఒక దగ్గిర, పాతవి ఒక దగ్గిర, కట్టనివి ఒక దగ్గిర ఇంకా....."
"హలో..అయిదు అరలే ఉన్నాయి ఇందులో"
"అందుకే ఇంకో చిన్న బీరువా కొనండి మహాశయా అని మొత్తుకుంటున్నాను ఇంకోటి ఉంటే ఇలా కిక్కిరిసిపోయినట్లు సర్దుకొనవసరం ఉండదు. వాటికి కూడా కొంచెం గాలి తగలాలిగా!" అంది మూతి తిప్పుతూ
"సరే కొందాములే....ఇక మొదలెట్టు సర్దడం"
"ముందు పట్టు చీరలు...ఇది జ్ఞాపకం ఉందా.. మైసూర్ సిల్క్ . పెళ్లి అయ్యాక తిరుపతి వెళ్లి అటునుంచి బెంగుళూరు, మైసూర్ వెళ్ళాము. బృందావన్ గార్డెన్స్ చూశాక చేసిన షాపింగ్ లో కొన్న చీర ఇది" అంటూ నీలం రంగు మైసూర్ సిల్క్ చీర ఇచ్చింది చేతికి.
దానిని ముట్టుకోగానే పెళ్లి అయిన కొత్త రోజులు, ఆనాటి మధురానుభూతులు జ్ఞాపకం వచ్చాయి.
"ఏవేవో చిలిపి తలపులు ఉరుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నవీ"
అనే పాట కూనిరాగం తీసాను అప్రయత్నంగా
"ఆపండి ...ఆపండి...ఇంకా చాలా పాటలు జ్ఞాపకం వస్తాయి...ఇది చూసారా..కంచి పట్టు చీర....మన మొదటి పెళ్లిరోజుకి కొన్నారు"అంటూ పసుపురంగు ,ఇంత జరీ అంచు ఉన్న ఒక పట్టు చీర నా చేతిలో పెట్టింది.
"జీవితాన మరువలేము ఒకే రోజు....
ఇరు జీవితాలు ఒకటిగా ముడివేసే రోజు
అదే పెళ్లిరోజు....."
అనే పాట జ్ఞాపకం వచ్చింది
నిజమే....నల్లకుంట నుంచి కోఠీ కి సిటీ బస్ లో వెళ్లి కొనుక్కొని, కామత్ లో భోజనం చేసి ఇల్లు చేరుకున్నాము. అప్పట్లో షాపింగ్ అంటే కోఠీ, అబిడ్స్ కే వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ వాసులు. ఇన్నేళ్లు అయినా ఇంత జాగ్రత్తగా దాచుకున్నందుకు ముచ్చట వేసింది
"ఇది చూడండి... నా మొదటి సీమంతానికి మా అమ్మ వాళ్ళు కొనిచ్చింది"అంటూ కనకాంబరం రంగు పట్టు చీర చేతికిచ్చింది.
ఆప్యాయంగా తడిమాను..పురిటి గదిలోంచి తీసుకొచ్చి నాకు అందించిన మా పెద్దాడిని మొదటిసారి ఎత్తుకుని ముద్దాడిన మధురక్షణం, పురిటి వాసనతో సహా , జ్ఞాపకం వచ్చింది
"ఇది రెండవ వాడికి పేరు పెట్టినప్పుడు అత్తయ్యగారు కొనిచ్చారు"అంటూ నెమలికంఠం రంగు చీర అందించింది
వెండి పళ్లెం లోని బియ్యం లో "భరద్వాజ" అని నేను చూపుడు వేలుతో పేరు వ్రాస్తున్న జ్ఞాపకం గిర్రున కళ్ళముందు తిరిగి వేలు చిన్నగా వణికింది.
ఇన్నేళ్లయినా ఏమాత్రం పాడుగాకుండా కొత్తవాటిలా కనిపిస్తున్న చీరలను చూసి ఆమెను అభినందించకుండా ఉండలేకపోయాను.
"ఎంత బాగా జాగ్రత్తపెట్టుకున్నావు, సెహబాష్" అని భుజం తట్టాను.
"ఇంకా చాలా ఉన్నాయి జ్ఞాపకాల సరాగాలు...
అన్నీ అయ్యాక ఒక్కసారే చెప్పండి"అంది నవ్వుతూ
"సరే" అన్నాను
"ఇది పెద్దాడి పెళ్లికి మీరు కొనిపెట్టింది,ఇది వియ్యాల వారు పెట్టింది. స్నాతకానికి మా అన్నయ్య పెట్టింది ఇది"మూడు చీరలు చూపెట్టింది
"పెద్దాడి పిల్లలకు కూడా వీటిని దాచి చూపెట్టేటట్టు ఉన్నావు"అంటూ నవ్వాను మడత పెడుతూ
"ఇది నేను రిటైర్ అయినప్పుడు మా స్నేహితురాళ్లు అందరూ కలిసి కొని పెట్టిన చీర. దీన్ని ఎప్పుడు చూసినా, కట్టుకున్నా 30 ఏళ్ల ఉద్యోగ జీవితం జ్ఞాపకం వస్తూ ఉంటుంది"అంటూ ఆ చీరను ముఖానికి తాకించుకుంది.
నాకూ జ్ఞాపకం వచ్చింది మా ఆఫీస్,ఆమె ఫ్రెండ్స్. ఎంతో ఆనందంగా గడిచిన ఉద్యోగపర్వం, ఎంతో ఆప్యాయంగా ఉండే స్నేహితులు గుర్తుకు వచ్చారు...
"ఇది మా తమ్ముడి పెళ్లికి కొనుక్కున్నది, ఇదేమో మీ చెల్లెలు పెళ్లికి కొన్నది" అంటూ రెండు చీరలు చేతిలో పెట్టింది.
శ్రావణ మాసంలో చిరుజల్లుల వర్షంలో జరిగిన బావమరిది పెళ్లి, "నయమే, కళ్యాణమండపం గనక సరిపోయింది. ఇదే ఆరుబయట అయితేనా?" అని అందరం అనుకున్న మాటలు జ్ఞాపకం వచ్చాయి.
మా చెల్లాయి పెళ్లి చీర చూడగానే మా మేనమావలతో బాటుగా నేను కూడా పెళ్లి కూతురు బుట్ట ని మోసిన ఉదంతం గిర్రున కళ్ళముందు తిరిగి అప్రయత్నంగా భుజం తడుముకున్నాను.
"ఇదేమో మా అక్క కొడుకు పెళ్లిది. ఈ పెళ్లి కోసం మా అక్కచెల్లెళ్ళు ముగ్గురం ఒకటే రంగు, ఒకటే రకం కావాలని ధర్మవరం పట్టు చీరలు కొనుక్కున్నాం. మీరూ, బావగారు మమ్మల్ని ఆడ బ్యాండ్ మేళం డ్రెస్ అని ఆట పట్టించారు...జ్ఞాపకం ఉందా?"
"ఎందుకు లేదు...మా ముగ్గురి చేత రామరాజ్ పంచె, చొక్కాలు కట్టించారు గదా మీకు తోడుగా?"
"మా సత్యం అన్నయ్య కూతురి పెళ్లికి బందరు వెళితే అక్కడనుంచి పెడన దగ్గిర అని వెళ్లి కొనుక్కున్న పెడన చీర ఇది. చూడండి ఎంత మెత్తగా ఉందొ?"
"అవును. డిజైన్ కూడా చాలా బాగుంది"
"భావుక సమావేశానికి గుంటూరు వెళ్లినప్పుడు కొనుక్కున్న మంగళగిరి చీర ఇది..ఎంత బాగా జరిగిందో గదా భావుక సదస్సు...."
ఇలాగ ఒక గంట ఆ చీరల ప్రపంచంలో ఇద్దరం విహరించాము. ఏ చీర , ఏ సందర్భంలో , ఏ ఊళ్ళో , ఎంతకి కొన్నదో, ఏ చీర, ఎవరు , ఏ సందర్భంలో , పెట్టారో ఇత్యాది వివరాలు అన్నీ తడుముకోకుండా చెప్పింది తన్మయత్వం తో..ఇలా మాట్లాడుకుంటూనే చీరలు అన్నీ నేను అందిస్తుంటే, ఒద్దికగా సర్దుకుంది ఆమె చెబుతున్నది అంతా నేను నిశ్శబ్దం గా వింటున్నాను. అవన్నీ వింటుంటే, మమ్మల్ని విడిచి వెళ్లిపోయిన అమ్మ, నాన్న, అత్తగారు,మామగారు జ్ఞాపకం వచ్చారు.
"ఏం మాట్లాడరే... పిచ్చి వాగుడు వాగుతోంది అనుకుంటున్నారా"అంది నవ్వుతూ "గిరీశం గారన్న మాట కొంచెం మార్చి " నిజంగా మా మగాళ్ళం అంతా ఉత్తి వెధవాయిలమోయి...." అనొచ్చు.
ఎప్పుడూ మీ ఆడవాళ్ళ చీరల, నగల మోజు మీద పిచ్చి జోకులు వేసుకుంటూ గడిపేస్తున్నాము గానీ మీకున్న భావుకత, వాటి మీద మీరు పెంచుకున్న మమకారం, వాటితో పెనవేసుకున్న మీ మమతానుబంధం, మీ అభిరుచి గురించి ఎప్పుడూ ఇంతలా ఆలోచించలేదు" బుగ్గన వేలేసుకుని నాకేసి ఆశ్చర్యం గా చూస్తున్న ఆవిడ ని చూస్తూ మళ్లీ కొనసాగించాను.
"ఇప్పుడు నువ్వు చెప్పిన సందర్భాల లో మేము కూడా మీతో బాటుగా కొత్త బట్టలు కొనుక్కుని ధరించి ఉంటాము...కానీ మీలా వాటితో ముడిబడ్డ మధుర క్షణాలు గుర్తు పెట్టుకోము. కొన్నామా,వేసుకున్నామా, మళ్లీ పెట్టెలో పెట్టామా... అంత వరకే మా మగవాళ్ల ఆలోచనా పరిధి. బట్టలతో ముడిపడ్డ జ్ఞాపకాలను ఇంత పదిలంగా మదిలో పెట్టుకోవచ్చని మాకు తెలీదు అనుకోవచ్చా, లేక మీ అంత సున్నిత మనస్తత్వం మాకు ఉండదు అనుకోవచ్చా! ఆస్తమాను బీరువా తెరిచి చీరలు చూసుకుంటోంది ఏమిటి అని నవ్వుకున్నానే గానీ ఇంత చక్కగా గతంలోకి ప్రయాణిస్తున్నావు , తాదాత్మ్యత పొందుతున్నావు అని తెలుసుకోలేకపోయాను ఇన్నాళ్లు"
"మీ మగవాళ్ల సంగతి ఏమో గానీ స్త్రీలకు, చీరలకు ఒక విడదీయలేని అవినాభావ సంబంధం ఉంటుంది. నేనైతే...ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే ఈ బీరువా తెరిచి చీరలు చూసుకుంటాను. ఆ చీరల వెనక ఉన్న జ్ఞాపకాలు, చీరలు పెట్టినవాళ్ళ మమతానురాగాలు, ఆ చీరలు కొన్న సందర్భాలు తలుచుకుంటే ఒక రకమైన స్వాంతన లభిస్తుంది. దిగులు పోయి మనసు తేలికవుతుంది"అంది.
"ఒత్తిడి నుంచి బయటపడే చక్కటి సులువైన మార్గం కనిపెట్టుకున్నావు. నా మనసు కదిలించావు.ఇక నీ చీరల మీద జోకులు వేయను"
"సర్లెండి. ఇక లేవండి.దీపాలు పెట్టే వేళ అయింది. థాంక్స్ మీ సహాయానికి"
మనస్ఫూర్తిగా చెబుతున్నాను...ఆడవాళ్ళూ మీకు జోహార్లు"
-సత్యవోలు పార్థసారథి
(హైదరాబాద్)