అనైక గీత (కవిత)
జాతీయ గీతం వింటూనే
అనేక సీతలు అగ్గికి
ఆహుతి అయ్యారు
మరణానికి ముందుమాటనేదే రాయకుండా
మరణించడమే వారి తప్పు..
సుప్రభాతం వింటూనే
అనేక దేవుళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు
పుట్టకముందే
చనిపోయిన దేవునికి
పంచనామా చేయకుండా
ఉండటమే వారి తప్పు ..
అమ్మ, నాన్నలు తెలిసేలోగానే
అనేక బిడ్డలు పురిటిలోనే కన్నుమూసారు
మట్టి పువ్వులైన ఆ దేహాలకు
ఉనికి దుస్తులు
వేయకపోవడమే
వారి తప్పు
అంతస్తుల ఆవరణలో
విలువల వలువలను
ఆకాశంపై నక్షత్రాల కింద ఆరేసుకున్నారు..
ఒకే దుప్పటి కోసం అనేకమంది పోరాడినప్పుడు
నాన్నమ్మ, అమ్మమ్మలు
చెప్పిన కథల్లో
భూకంపాల ఊసు
తీయకపోవడమే వారి తప్పు..
ఇరుకు గదుల
సంభాషణ ల మధ్య
ఎవరికి వారు తమ ఆశయాలను ఎంచుకున్నారు.
అక్కడ దేశముంటుందో.. దేహముంటుందో తెలియక
ఆరుబయట జాగరణ చేయడమే వారి తప్పు
ప్రపంచ ప్రధాన ద్వారంలోకి కులమతాలు చేరినంతనే
అనేక మనసులు మాడి మసిబారిపోయాయి..
అధికారం అలవాటు పడిన దేహాలకు
ఆసనం విలువ
తెలపకపోవడమే వారి తప్పు..
ప్రపంచానికి వెలుగు కాలువ తవ్వడానికి
చీకటి గుహలు నిర్మించే
ప్రయత్నం చేస్తున్నారు.
అక్కడి బేరాలకు శరీరాలు శవాలవుతాయని
అర్థంకాక నమ్మి
పలుగు పార
అందించడమే వారి తప్పు..
ఒక తప్పు నుండి మరొక తప్పుకు ప్రయాణించే దారులన్నీ
స్వర్ణధామాలని అనుకోవడం
నిజంగా వారి తప్పు..
- శైలజామిత్ర